- కార్పొరేట్ మోసాలపై సత్తుపల్లిలో నిరసన
సత్తుపల్లి,ఆర్ సి,ఏప్రిల్13(జనవిజయం): ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సత్తుపల్లిలో నారాయణ స్కూల్ లో ఆదివారం టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తుండగా పలువురు ఆ పాఠశాలకు వెళ్లి ఆందోళన చేశారు. టాలెంట్ టెస్టులు పేరిట విద్యార్థులను వారి తల్లిదండ్రులను చేస్తున్న మోసాలపై నిలదీశారు. అక్కడ ఆందోళన ఉద్రిక్త పరిస్థితికి దారి తీసిన విషయం స్థానిక మండల విద్యాశాఖ అధికారి దృష్టికి వెళ్లడంతో ఆయన నారాయణ స్కూల్ కి వెళ్లి పరీక్షను నిలుపుదల చేశారు. విద్యార్థుల దగ్గర్నుంచి సమాధాన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. టీచర్లను క్లాసులకు పంపడం ఆపి అడ్మిషన్ల కోసం సెలవు దినాలు, ఎండ, రాత్రి అని చూడకుండా రోడ్ల వెంట తిప్పుతున్నారని , వారికి అడ్మిషన్లు టార్గెట్లు పెడుతున్నారని ఎంఈఓ దృష్టికి తెచ్చారు. టాలెంట్ టెస్టులు, అడ్మిషన్ టెస్టులు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎంఈఓ హెచ్చరించారు. టాలెంట్ టెస్ట్ విషయం జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకురావడం జరిగిందని డీఈవో ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో నిరసన కారులు ఆందోళన విరమించారు. స్థానిక కార్పొరేట్ పాఠశాలల వారు తమ గొప్పను చాటుకునేందుకు, రాష్ట్రస్థాయి ర్యాంకులు తమవే అని ప్రకటించుకునేందుకు విజయవాడ ,గుడివాడ తదితర ప్రాంతాలలో పదవ తరగతి చదివిన
మెరిట్ విద్యార్థులను ఇక్కడకు తీసుకొచ్చి తమ పాఠశాల తరఫున ఫీజు కట్టి పరీక్షలు రాయించాలని స్థానిక ప్రైవేట్ పాఠశాలల వారు ఎంఈఓ కు ఫిర్యాదు చేశారు.
శ్రీ చైతన్య పేరిట స్కూలు లేదు
సత్తుపల్లిలో గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ చైతన్య పేరిట నడుస్తున్న పాఠశాలకు ఆ పేరుతో గుర్తింపు ఉందా? అని విలేకరులు ఎంఈఓ ని అడిగారు. శ్రీ చైతన్య పేరుతో తాము సత్తుపల్లిలో ఏ పాఠశాలకు గుర్తింపు ఇవ్వలేదని, గుర్తింపు లేని పాఠశాలలలో విద్యార్థులను చేర్చి మోసపోవద్దని ఈ సందర్భంగా ఎంఈఓ తల్లిదండ్రులకు సూచించారు. కార్పొరేట్ మోసాలపై విచారించి చర్య తీసుకోవాలని సత్తుపల్లి డివిజన్ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల సంఘం(TRSMA) ఎంఈఓ రాజేశ్వరరావుకు వినతిపత్రం అందజేసింది.