మెదడే పెరిగి హృదయం తరిగీ నరుడే ఈనాడూ వానరుడైనాడూ…. ఇది ఓ సినీగీతం. ఒక్క వాక్యంలో మనిషి ప్రస్తుత ఎదుగుదల గురించి చెప్పిన సత్యం. నరుడు వానరుడినుండి వచ్చాడని మనకు తెలుసు. వానరుడి నుండి నరావతరణ అనే పరిణామం ప్రకృతిలోని జీవులలో కేవలం మనిషికి మాత్రమే కలిగింది. మనిషి మాత్రమే తనను తాను నిరంతరం మార్చుకుంటూ ప్రకృతిని గమనిస్తూ, వాడుకుంటూ అభివృద్ధి చెందుతున్నాడు. దీనికి కారణం మనిషికి ఇతర జీవులతో పోల్చినపుడు రెండు అంశాలలో ఉన్న తేడా అని తెలుస్తుంది. ఒకటి ఆలోచన. రెండు శ్రమ.
మనిషి గతాన్ని బేరీజు వేసుకుని వర్తమానంలో శ్రమించి భవిష్యత్తుకు కావలసినవి తయారుచేసుకోగలడు. ఇక్కడే మనిషి ఆలోచన ఎలా ఉండాలి? అనేది తేల్చుకోవాలి. మనిషి ఎంత ఆలోచనాపరుడైనా, శక్తివంతుడైనా తనకు లభించే సమస్తమూ ప్రకృతినుండే అనేది మరచి పోకూడదు. తను కోరుకునే భవిష్యత్తు మనుగడ ప్రకృతితో ఆధారపడి ఉంటుందన్న సత్యాన్ని నిరంతరం గమనంలో ఉంచుకోకపోతే అంతకు మించిన ప్రమాదం మరొకటి ఉండదు. మనిషి ఆలోచనలు పరిస్థితులపైననే ఆధారపడి ఉంటాయి. మనిషి ‘జీవన విధానం’ సమాజానికి లోబడి ఉంటుంది. మనిషి సంఘజీవి కనుక సమాజం మనిషి ఆలోచనలను నిరంతరం ప్రభావితం చేస్తుంటుంది. ‘నేను’ ‘నాది’ అనే ఆలోచన మనిషిని సమాజం నుండి, ప్రకృతి నుండి సరైన పాఠాలు నేర్వడానికి అడ్డంకిగా, ఆటంకంగా తయారవుతుంది. మనిషిలోని మనీషిని ఎదగకుండా అడ్డుకుంటుంది. మనిషిలోని మనీషిని మాయం చేస్తుంది.
ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? ఒక్క సారి మీతో మీరు నిజాయితీగా మాట్లాడుకోండి. అంతా స్వార్ధం. నేను బాగుండాలి. నా పిల్లలు బాగుండాలి. నా కుటుంబం బాగుండాలి. నా వాళ్ళ వరకు బాగుంటే చాలు….. ఇలా ప్రతీది ‘నా’ అనే భావనతోనే మన ఆలోచనలు, పనులు సాగుతున్నాయి. ఈ ఆలోచనలు అందరిలో, అన్నింటా వ్యాపించి మనిషి సహజమైన సంఘజీవన తత్వాన్ని, కలిసుండే గుణాన్ని మరపించేస్తున్నాయి. ప్రకృతికి మనిషిని దూరం చేస్తున్నాయి. అంతా భ్రమలలో బ్రతికేలా చేస్తున్నాయి. ఈ ప్రపంచపు ఆలోచనలలో అత్యంత ప్రమాదకరమైన ధోరణి ఇది. నీ బాగు… కేవలం నీ స్వార్ధపు ఆలోచనలతో, బలమైన కోరికలతో ఆధారపడి ఉండదు. నీ బాగు నీ తోటివాళ్ళ బాగుతో కలిసి ఉంటుంది. నీ బాగు ప్రకృతిపై ఆధారపడి ఉంటుంది. అందుకే మానవసంబంధాలను, ప్రకృతిని నిరంతరం కాపాడుకునేలా మనిషి చైతన్యం ఎదగాలి. అది సామూహిక శక్తిగా ఉండాలి. సమాజమే సామూహికమైన ఐక్యత, కార్యాచరణ కలిగినదిగా ఎదగాలి. అలాంటి సమాజం ఏర్పడేందుకు మనిషి ఆలోచన ఎదగాలి.
మనిషి తెలివి పెరుగుతున్నది, కానీ హృదయం తరుగుతున్నది అన్న సినీకవి మాటలు ప్రస్తుత స్థితిని తెలుపుతున్నాయి. రోజంతా బిజీగజిబిజిగా గడుపుతున్నాము. ప్రక్కనున్న మనిషి కష్టాలను పంచుకోలేని మనం ఎంతో దూరంలో ఉన్నవారి యోగక్షేమాలను ఒక్క మెసేజ్‌తో కనుక్కుంటున్నాము. చందమామను సైతం టి.విలలో, సినిమాలలో చూసి ఆనందిస్తున్నాము. ఈ ధోరణి మారాలి. మనుషులతో మాట్లాడండి. మనుషులతో కలిసి ఉండండి. మనుషులలో మార్పుకు ప్రయత్నించండి. ఒక్క రోజు బిజీ షెడ్యూలు ప్రక్కనబెట్టి….. రోజంతా…. ప్రకృతిని గమనించండి. ప్రతిదీ పరస్పరం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉందని, ప్రతిదానికీ దాని గొప్పతనం ఉందని, ప్రకృతి మీకు పాఠం చెపుతుంది. అన్నీ దేనికదే ప్రత్యేకతను నిలుపుకుంటూనే, పరస్పర ఆధారంతో కలసి ఉంటున్నాయని నేర్పుతుంది. అవసరానికి మించి ఏది వాడినా అనర్ధమేనని ప్రకృతి ఫలితాలు ఇస్తుంది. కేవలం ‘నా’ అనే స్వార్థంతో ప్రతిదీ డబ్బుతో కొనుక్కోవచ్చనే అహంతో ఆచరణ ఉంటే సామూహిక అనర్ధాలు తప్పవు.
డబ్బుతో ప్రతిదీ సాధించలేవు. డబ్బుని తన అవసరాల రీత్యా మనిషే సృష్టించుకున్నాడు. తన అవసరాల కోసం మనిషే దానిని రద్దు చేసుకుంటాడు. తనను సృష్టించిన ప్రకృతిని కాపాడుకోవలసిన మనిషి, తను సృష్టించిన డబ్బు మాయనుండి బయటపడలేక, తనను తాను కాపాడుకోలేక నిత్యం సతమతమవుతున్నాడు. నరకయాతన అనుభవిస్తున్నాడు. ప్రకృతి మనిషి ఎదగడానికి కావలసిన జ్ఞానాన్ని, వనరులను ఇస్తుంటే, డబ్బు మనిషి దిగజారడానికి కావలసిన మాయను సృష్టిస్తుంది. మనిషి ఎంత త్వరగా డబ్బు మాయనుండి బయటపడితే అంత మంచిది. డబ్బుంటే చాలు నాకు ఏమీ కాదు అనే మాయనుండి బయటపడండి. మనిషికి ఆ మాయకు మించిన అమాయకత్వం మరొకటి లేదు.‘నేను’ అనే ప్రత్యేకతను నిలుపుకుంటూనే అది ‘మనము’లో ఒదిగి ఉండేలా చూసుకోండి. ‘మనము’ లేని ‘నేను’ కు విలువ లేదని గుర్తించండి. నిరంతరం ప్రకృతిని గమనించడానికీ, ప్రకృతి పాఠాలు వినడానికి రోజులో కొంత సమయం కేటాయిద్దాం. మానవ సంబంధాలను, ప్రకృతి వనరులను కాపాడుకునేందుకు ప్రయత్నిద్దాం. హృదయాన్ని కోల్పోని మెదడు ఎదుగుదలనీ, సమిష్ఠి తత్వాన్ని కోల్పోని వ్యక్తి ఎదుగుదలను ఆహ్వానిద్దాం.
– పల్లా కొండలరావు, ఎడిటర్, జనవిజయం.