జనవిజయం పాఠకులకు ఉగాది శుభాకాంక్షలు. తెలుగు వారు నూతన సంవత్సరంగా జరుపుకునే ఈ పండుగనాడు జీవితంలో కష్టాలు, సుఖాలు అన్నింటినీ సమానంగా ఎదుర్కుని మనిషి ధైర్యంగా ముందడుగు వేయాలని కోరుతూ అన్ని రుచులతో ప్రకృతి సహజ పదార్ధాలతో ఉగాది పచ్చడి తినిపిస్తారు. జ్యోతిష్యులు పంచాంగ శ్రవణం వినిపిస్తారు. సాహితీ ప్రేమికులు సాహితీ సభలు నడుపుతారు. సంగీత, నాటకం, నాట్యం వంటి కళారూపాలు ప్రదర్శిస్తుంటారు. ఉగాది రోజును మంగళకరమైనదిగా భావించి కొత్త వ్యాపారాలు, గృహప్రవేశాలు, పెళ్లిళ్లు, దైవదర్శనాలు వంటివి చేస్తుంటారు. జీవితంలోనూ, ఆ ఏడాదిలోనూ కొత్తకు ఆహ్వానం పలికేవి అనేకం చేస్తుంటారు. నూతన సంవత్సరమంతా తాము అనుకున్నది శుభంగా పూర్తిగా మంచిగా నెరవేరాలని కొత్త ఉత్సాహంతో, ఆత్మవిశ్వాసంతో కోరుకుంటారు. ప్రజలందరూ తమకు మంచి జరుగాలని కోరుతూ తమ తమ వృత్తులలో కొత్తవి ప్రారంభిస్తుంటారు. కొత్త ఏడాదిలో లాభ, నష్టాలు ప్రకృతి సహకారం ఎలా ఉంటుందనేది అంచనా వేస్తుంటారు. నమ్మకాలు, కోరికలు అందరికీ ఉంటాయి. కుటుంబమంతా ఆనందోత్సాహాలతో పిల్లల నుండి పెద్దల వరకు హుషారుగా జరుపుకునే పండుగ ఉగాది. విదేశాలలో ఉంటున్న తెలుగువారు సైతం ఉగాదిని ప్రత్యేకంగా జరుపుకుంటారు. తెలుగువారందరూ ఆనందోత్సాహాలతో జరుపుకునే ఉగాది ప్రత్యేకతలలో ప్రకృతితో మమేకమైన అంశాలను గుర్తించాలి. ప్రకృతికి దగ్గరగా కార్యక్రమాలుండే సహజ పండుగ ఉగాది. ఈ సందర్భంగా మనమందరం ప్రకృతిని కాపాడుకునేందుకు కూడా ఇప్పటినుండైనా శక్తిమేరకు కృషి చేస్తామనే కొత్త సంకల్పం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఉగాది సందర్భంగా ఉన్న సాంప్రదాయాలలో శాస్త్రీయతకు, హేతుబద్ధతకు నిలిచేవి, ప్రకృతినీ, ప్రజలను కాపాడేవి కొనసాగించాలి. నష్టం కలిగించేవి త్యజించాలి. తెలుగువారందరూ ఈ దిశగా ఆలోచన ప్రారంభించాలని కోరుతున్నాము. ప్రకృతినీ, ప్రజలను కాపాడుకోవడం కంటే మనిషికి గొప్ప ఆశయం ఏదీ ఉండదు. ఉగాది పండుగ కీలకంగా మనకు చెప్పేది కూడా అదే. ప్రపంచమంతా ప్రకృతినీ, పర్యావరణాన్ని కాపాడుకుంటూ మనుషులందరిలో ఐకమత్యాన్ని పెంపొందించే ఆలోచనలు, ఆచరణలు కొనసాగాలని కోరుకుంటూ ఆమేరకు జనవిజయం టీమ్ తమ వంతు కృషి కొనసాగిస్తుందని హామీ ఇస్తున్నాము.
– పల్లా కొండలరావు, ఎడిటర్, జనవిజయం మీడియా