రసాభససగా సాగిన వికలాంగుల రుణాల ఎంపిక!
ఒక్కరికే ఇచ్చేదానికి 150 మందిని ఎందుకు పిలిచారు?
అసౌకర్యం నడుమ అసంతృప్తి వ్యక్తం చేసిన వికలాంగులు!
వికలాంగుల అధికారి లేకుండా లాటరీ!
వేంసూరు,ఏప్రియల్03, (జనవిజయం):గురువారం ఖమ్మంజిల్లా వేంసూరు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఇంచార్జి ఎంపీడీఓ పరిమి రాజారామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వికలాంగుల రుణాల ఎంపిక రసా బసగా జరిగింది. సమావేశమందిరంలో కేవలం 50 మంది మాత్రమే కూర్చోవడానికి వీలుగా ఉంటుంది.కానీ దరఖాస్తు చేసుకున్న 150 మందిని రావాలని సమాచారం ఇవ్వగా ఒకరిద్దరు మినహా అందరు హజరయ్యారు.వారికి తోడుగా మరో మనిషి కూడా రావడంతో మొత్తంగా 200 మంది పై చిలుకు వచ్చారు కానీ ఎంపిక సభలో సుమారుగా 55 మంది మాత్రమే పాల్గొన్న పరిస్థితి దాపురించింది.కొందరు కార్యాలయం బయట చెట్ల కింద,మరికొందరు సమావేశ మందిరం బయట ఉండి అట్టి అసౌకర్యం నడుమ వికలాంగులు అసంతృప్తి వ్యక్తం చేశారు.అంత మందిని ఆహ్వానించినప్పుడు కార్యాలయం వెనుక ఖాళీ స్థలంలో టెంట్ ఏర్పాటు చేసి,వడదెబ్బకు గురి కాకుండా ఎలక్ట్రిక్ కూలర్లు ఏర్పాటు చేసి నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని నాలుగుగోడల మధ్య నిర్వహించడం సరి కాదని ఎన్.పి.ఆర్.డి.(జాతీయ వికలాంగుల హక్కుల వేదిక) మండల అధ్యక్షులు మల్లూరు చంద్రశేఖర్ మండలాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.వికలాంగులపై చిన్న చూపు కనబరిచిన అధికారులపై చర్యలు తీసుకోవాలని,సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ఉన్నతాధికారులతో మాట్లాడాలని మల్లూరు ఓ ప్రకటనలో కోరారు.అంతే కాకుండా ముగ్గురు చిన్నారులతో లాటరీ తీయించి జిల్లా అధికారులకు పంపుతామని ముగ్గురిలో ఒకరిని సెలక్ట్ చేస్తారని తెలపగా అదేదో ఇక్కడే చేయాలని కొందరు,ఒక్కరికే ఇచ్చే దానికి 150 మందిని పిలవడం దేనికి అని అసహనం వ్యక్తం చేస్తూ ఇన్చార్జి ఎంపీడీఓ ను ప్రశ్నించారు.ఇంచార్జ్ ఎంపీడీఓ రాజారామ్ వారికి ఓపికగా సమాధానం చెబుతూ ఓదార్చారు.రాజీవ్ యువ వికాసం పథకంలో కూడా దరఖాస్తులు చేసుకోవచ్చని,వికలాంగులకు ఐదు శాతం ప్రత్యేక అవకాశం ఉందని తెలిపారు.కొసమెరుపు ఏమిటంటే ఇట్టి ఎంపిక సభలో ఎంపీడీఓ తో పాటు,ఐకేపీ ఏపీఎం,ఐసిడిఎస్ సీడీపిఓ(వికలాంగుల అధికారిని) వుండాల్సి ఉంది.కానీ వికలాంగుల అధికారి,ఐసీడీఎస్ సిడిపీఓ కనకదుర్గ రాకుండానే ఎంపిక హడావుడిగా నిర్వహించారని తెలుస్తోంది.