- లక్షలు వెచ్చించా:ఒగ్గు సత్యనారాయణరెడ్డి
- ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూపులు
వేంసూరు,ఏప్రియల్,14(జనవిజయం): గత మూడు రోజులుగా ప్రకృతి లో జరుగుతున్న మార్పుల నేపథ్యంలో వీచిన భారీ ఈదురు గాలులకు,తేలికపాటి వర్షానికి మండలంలో ఉద్యాన వన పంటలైన మొక్కజొన్న,మామిడి,అరటి,డ్రాగన్ ఫ్రూట్ తోటలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.మామిడి కాయలు రాలి చెట్లు విరిగిన దుస్థితి దాపురించింది.మొక్కజొన్న ఒరిగి నేల మీద పడిపోయిన స్థితి ఉంది.మండల పరిధిలోని అమ్మపాలెం గ్రామ శివారులో ఐదు ఎకరాల విస్తీర్ణంలో సాగులో ఉన్న అరటి,డ్రాగన్ ఫ్రూట్ తోటలు కుప్పకూలిపోయి అరటి గెలలు పడిపోయాయి సాగుకు వీలు లేకుండా ధ్వంసం అయ్యాయి.అరటి,డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్న కౌలు రైతు ఒగ్గు సత్యనారాయణరెడ్డి మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికీ సుమారుగా 06 లక్షల వరకు వెచ్చించామని,ఒక్కసారి కూడా దిగుబడి రాలేదని ప్రభుత్వం ప్రకృతి వైపరీత్య చట్టం కింద తనను ఆదుకోవాలని,ఉద్యానవన అధికారులు పరిశీలించాలని కోరారు.వేంసూరు రైతువేదిక వద్ద మండల వ్యవసాయాధికారి పచ్చల రాంమోహన్ కు సోమవారం వినతిపత్రాన్ని అందజేయగా ఉద్యానవన శాఖ అధికారికి తెలియపరుస్తామని హామీ ఇచ్చారు.