ఖమ్మం, ఏప్రిల్ 14 (జనవిజయం): బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ సృష్టికర్త భారత రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగ పితామహుడు భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకొని ఖమ్మం జిల్లా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఈ రోజున సుందరయ్య భవనం నందు రైతు సంఘం రాష్ట్ర నాయకులు నున్నా నాగేశ్వర రావు అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సభలో నున్నా నాగేశ్వర రావు మాట్లడుతూ, డాక్టర్ బి.ఆర్ అంబెడ్కర్ సమ సమాజం కోసం ఉద్యమించారని, భారత జాతి గర్వించదగ్గ మేధావి, భారత రాజ్యాంగాన్ని రాసి, జాతి ప్రజలకు అంకితం చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు.
అంబేడ్కర్ 133వ జయంతిని పురస్కరించుకొని, బిజెపి మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం 10 ఏళ్లుగా దేశంలో అరాచక పాలన చేస్తూ, దేశాన్ని విధ్వంసం చేసే విధంగా సంస్కరణలు చేస్తున్నారని, మరో దఫా అధికారంలోకి రావడానికి కులాల పేరిట, మతాల పేరిట చిచ్చులు పెడుతూ, దేశభక్తి పేరుతో యువతను పెడదోవ పట్టించే విధంగా పాకిస్తాన్, చైనా బూచి చూపి ఉద్వేగాలు రెచ్చగొడుతూ ఓట్లు దండుకునే కుయుక్తులు పన్నుతున్నారనీ, అసలు దేశ స్వాతంత్రోద్యమంతో ఎలాంటి సంబంధం లేని ఆర్‌ఎస్సెస్, బీజేపీ నేడు సినిమా రంగాన్ని తమ చేతుల్లోకి తీసుకొని అబద్ధపు కథలతో సినిమాలు తీసి, అదే నిజమైన చరిత్రగా, బ్రిటీష్ వారి బూట్లు తుడిచిన వారిని దేశభక్తులుగా చూపెడుతూ ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారని, దేశంలో మోడీ షా సాగిస్తున్న అరాచక పాలనకు వ్యతిరేకంగా అంబేడ్కర్, స్పూర్తితో ఉద్యమించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, సిఐటియు జిల్లా నాయకులు ఎర్ర శ్రీకాంత్, పిన్నింటి రమ్య, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మాదినేని రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎర్ర శ్రీనివాసరావు, ఎస్.కె. బషీరుద్దీన్, ఎం.సుబ్బారావు, టి.యల్. నర్సయ్య, మల్లెంపాటి వీరభద్రరావు, బండారు రమేష్, రఫి, బోడపట్ల రవీందర్, శివన్నారాయణ, మెరుగు సత్యనారాయణ, నందిపాటి మనోహర్, నాదెండ్ల శ్రీనివాస్, ప్రతాపనేని వెంకటేశ్వరరావు, మాచర్ల గోపాల్ తదితరులు పాల్గొన్నారు.