Tuesday, May 21, 2024
Homeరాజకీయంఎన్.డి.ఎ పాలనలో ప్రమాదకరస్థాయికి భారతదేశం

ఎన్.డి.ఎ పాలనలో ప్రమాదకరస్థాయికి భారతదేశం

– అభద్రతా భావంతోనే జీప్‌ దుశ్చర్యలు
– ఓటమి భయంతోనే ఈడీ, సీబీఐ దాడులు
– సీపీఐ (ఎం) ఖమ్మం జిల్లా విసృత స్థాయి సమావేశంలో పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
ఖమ్మం, ఏప్రిల్‌ 18: గత పదేళ్ల నుంచి అధికారంలో ఉన్న బీజేపీ, ఎన్టీఏ కూటమిని గద్దె దించడమే ప్రధాన ఎజెండాగా పార్లమెంట్‌ ఎన్నికల్లో సీపీఐ (ఎం), ఇండియా కూటమి ముందుకెళ్తుందని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు స్పష్టం చేశారు. దేశాన్ని ప్రమాదకరస్థాయికి మోడీ ప్రభుత్వం తీసుకెళ్లిందన్నారు. ఎన్టీఏ కూటమి మళ్లీ అధికారంలోకి వస్తే భారతదేశ రాజ్య స్వభావమే పూర్తిగా మారిపోతుందన్నారు. ఈ ఎన్నికల్లో ఓ ప్రధాన భూమికను నిర్వహించాలని మార్కిస్టు పార్టీ నిర్ణయించిందన్నారు. మోడీ, కార్పొరేట్‌శక్తులు, వారి అనుకూల మీడియా దేశంలో కృత్రిమ వాతావరణాన్ని సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నాయన్నారు.

పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్‌ అధ్యక్షతన శనివారం స్థానిక సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి రాఘవులు మాట్లాడారు. బీజేపీకి 370, ఎన్టీఏకు 400కు పైగానే సీట్లు వస్తాయని అనుకూల కార్పొరేట్‌ మీడియా. సంస్థలు సర్వేలు చేసినట్లు ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తమ కీర్తి ప్రతిష్టలు పెరిగాయని అంతర్జాతీయ మీడియా సంస్థల ద్వారా బీజేపీ ప్రచారం చేయిస్తుందన్నారు. గోబెల్స్‌ ప్రచారం తప్ప ఇందులో వాస్తవం లేదన్నారు. ఊదరకొట్టి లేనిది ఉన్నట్టు ప్రచారం చేయిస్తే ఈ దుష్ప్రచారాన్ని నమ్మి ప్రజలు ఓట్లు వేస్తారనే ఆశతో బీజేపీ ఉన్నట్టు కనిపిస్తోందన్నారు.

గెలుస్తామని ఇంత గట్టి విశ్వాసం ఉంటే ప్రతిపక్ష రాజకీయ పార్టీల ప్రముఖులు, ముఖ్యమంత్రులు కేజ్రీవాల్‌, హేమంత్‌ సోరైన్‌ లాంటివారిని అరెస్టు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఎక్కడన్నా ఎవరన్నా బీజేపీకి ప్రమాదకరంగా ఉన్నారంటే ఈడీ వెళ్లి దాడులు చేస్తుందన్నారు. రాజకీయంగా వీరు తమకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే ప్రజలు ఓట్లు వేయరనే భయంతోనే బీజేపీ ఎన్నికల ముందు ఈ అరెస్టులు చేయిస్తుందన్నారు. మాట వరసకు అవినీతిపరులనుకున్నా ఎన్నికలయ్యాక అరెస్టు చేయొచ్చు కదా? అని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐ(ఎం) తరఫున పోటీ చేస్తున్న కేరళ రాష్ట్ర ఆర్ధికమంత్రి థామస్‌ ఐజాక్‌ మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆర్బీఐ అనుమతితో విదేశాల నుంచి రూ. 6వేల కోట్ల మసాల బాండ్లు సేకరించి, విక్రయించారని విచారణ నిమిత్తం రావాల్సిందిగా ఈడీ నోటీసులు ఇచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో ఐజాక్‌ కోర్టుకు వెళ్లడంతో ఎన్నికల తర్వాత విచారణ చేసుకోవచ్చుగా..? అని కోర్టు మొట్టికాయలు వేసిందన్నారు. పార్టీ ఖాతాల లెక్కలు చెప్పలేదని ‘ఫెనాల్టీల మీద ఫెనాల్టీలు 2014 సంవత్సరం నుంచి వేసి కాంగ్రెస్‌ రూ. 1700 కోట్లు, కేరళలో సీపీఐ(ఎం) పార్టీ గ్రామశాఖ అకౌంట్లో రూ.కోటి ఉంటే వాటిని లెక్కల్లో చూపలేదని ఫెనాల్టీగా రూ.16 కోట్లు చెల్లించాలని నోటీసులు ఇచ్చారని తెలిపారు. దీనిపైనా కోర్టు స్టే ఇచ్చిందన్నారు.

అభద్రతా భావంలో  ఎన్టీఏ
బీజేపీ, ఎన్టీఏ పూర్తి అభద్రతా భావంలో పడిపోయి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతిపక్ష పార్టీల నేతలపై కేసులు పెడుతూ.. భయబ్రాంతులకు గురిచేస్తూ పార్టీ మారేలా బీజేపీ ఒత్తిడి చేస్తుందన్నారు. సీట్లు, ఓట్లు వచ్చేటట్టయితే ఇతర పార్టీల నేతలను మార్చించటం ఎందుకని? ప్రశ్నించారు. బీజేపీ, ఎన్టీ ఓ వాషింగ్‌ మిషన్‌ అయిపోయిందని, మురికి గుడ్డలు ఎక్కడెక్కడుంటే వాటిని తెచ్చుకుంటుందన్నారు. లిక్కర్‌ స్కాంలో ఆరోపణలు ఎదుర్శొన్న వైసీపీ ఎంపీ శ్రీనివాసులరెడ్డిని టీడీపీలో చేర్చుకుని ఎన్టీఏ కూటమి తరఫున టిక్కెట్‌ ఇవ్వడాన్ని ఏమనాలి? అని ప్రశ్నించారు. అవినీతిపరులను పోగు చేసి బీజేపీ గెలవాలని చూస్తుందని కేజ్రివాల్‌ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు.

ఈ దేశంలో ఎన్నికల బాండ్లు తీసుకోని ఏకైక పార్టీ సీపీఐ(ఎం) మాత్రమే అన్నారు. నీతినిజాయితీ గురించి మాట్లాడే బీజేపీ ఎన్నికల బాండ్లు అత్యధికంగా తీసుకుందన్నారు. క్విడ్‌క్రో పద్ధతిలో ఎన్నికల బాండ్లు వస్తున్నాయని, ప్రపంచంలోనే అత్యంత అవినీతికి నిదర్శనం ఈ బాండ్లని సీపీఐ(ఎం) కోర్టులో కేసు వేసిందన్నారు. దానితోనే ఎన్నికల బాండ్లు చెల్లవని కోర్టు తీర్చు ఇచ్చిందన్నారు. ఇన్ని అవినీతికరచర్యలు చేసిన బీజేపీ అవినీతి గురించి మాట్లాడే హక్కు కోల్పోయిందన్నారు. అధికారం, ప్రతిపక్షంలో ఎవరుంటారనేది తమకు ముఖ్యం కాదన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం బతకాలని, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

బ్రిటిష్‌వారి కాలం కంటే ఇప్పుడు భారతదేశంలో అసమానతలు ఎక్కువయ్యాయని ప్రాన్స్‌కు చెందిన ఓ సంస్థ తేల్చిందన్నారు. దేశంలో రాజ్యాంగ మౌలిక విలువలను రక్షించుకోవాలని, ప్రజలు ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని రాఘవులు పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీ ప్రమాదం ముంచుకొస్తోందని, మతోన్మాద వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్రంలో ఒక్క ఎంపీ స్థానం కూడా గెలవకూడదనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. కాంగ్రెస్‌ను లౌకిక పార్టీగా అంగీకరిస్తున్నాం తప్ప ఆ పార్టీపై మోజు ఏమీ లేదన్నారు. తెలంగాణలో ఆ విజ్ఞత కాంగ్రెస్‌కు లేదన్నారు.సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, కార్యదర్శివర్గ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, బొంతు రాంబాబు, వై.విక్రమ్‌, కళ్యాణం వెంకటేశ్వర్లు, చింతలచెర్వు కోటేశ్వరరావు, బుగ్గవీటి సరళ, మాచర్ల భారతి, భూక్యా వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments