కరీంనగర్, నవంబర్ 9 : తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న భక్తులకు ఆలయ అధికారులు షాకింగ్ వార్త చెప్పారు. పలు రకాల ఆర్జిత సేవల టికెట్ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న ధరలను ఒకేసారి డబుల్ చేశారు. పెరిగిన ధరలు ఈ నెల అనగా నవంబర్ 15 నుంచి అమల్లోకి వస్తాయని ఈవో తెలిపారు. భక్తులు దీన్ని గమనించాలని కోరారు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న భక్తులకు అలర్ట్.. ఆర్జిత సేవల టికెట్ ధరలను పెంచినట్లు ఆలయ ఈవో శ్రీకాంత్ బుధవారం నాడు వెల్లడిరచారు. ఏ టికెట్ ధర ఎంత పెరిగింది అంటే.. చందన పూజ టికెట్ ధర గతంలో రూ.800 ఉండగా.. ఇప్పుడు దాన్ని ఏకంగా 1500 రూపాయలకు పెంచారు. అలానే రూ.400 ఉన్న అంతరాలయ దర్శనం టికెట్ ధరను రెట్టింపు చేశారు. అంటే 400 నుంచి రూ.800లకు పెంచారు.అలానే ప్రస్తుతం శాశ్వత అభిషేకం టికెట్ ధర రూ. 1,116 ఉండగా.. దాన్ని ఏకంగా ఒకేసారి రూ. 10 వేలకు పెంచారు.ఇదేకాక ఆలయంలో కొత్తగా అనేక రకాల ఆర్జిత సేవలు ప్రవేశపెట్టినట్లు ఆలయ ఈవో తెలిపారు. ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం సుప్రభాత సేవ సమయంలో.. స్వామి వారిని దర్శనం చేసుకునేందుకు ప్రత్యేక దర్శన టికెట్ రూ.1000 తీసుకొచ్చార. అలానే శని గ్రహ పీడ నివారణ పూజ టికెట్ ధరను రూ.1000గా నిర్ణయించారు. మన్యసూక్త హోమం కోసం రూ. 2000, వడమాల టికెట్‌ను రూ.1,116గా నిర్ణయించారు. పెరిగిన వివధ దర్శన, పూజా టికెట్ ధరలు నవంబర్ 15 నుంచి అమల్లోకి వస్తాయి అని ఆలయన ఈవో తెలిపారు. భక్తులు దీన్ని గమనించవల్సిందిగా కోరారు.అలాగే ఆలయానికి కొత్తగా పీఆర్‌వో కార్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ఆలయ ఈవో తెలిారు. గుడిచి చెందిన 11 ఎకరాల భూమిని చదును చేసి లీజుకు ఇస్తామన్నారు. మూలవిరాట్టుకు 60 సంవత్సరాల నుంచి చందనం తొలగించలేదన్నారు. కమిషనర్ నుంచి ఆదేశాలు రాగానే చందనం తొలగింపు కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు. ఆ తర్వాత బేతాళునికి చందనోత్సవం నిర్వహిస్తామన్నారు.ఇదిలా ఉంటే కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం నాడు కొండగట్టులో గిరి ప్రదక్షిణ అంగరంగా వైభవంగా జరిగింది. ఎన్నడూ లేని విధంగా సుమారు 7 వేల మంది భక్తులు పాల్గొన్నారు. కార్తీక పూర్ణమి, గురునానక్ జయంతి సందర్భంగా హాలీడే కావడంతో భక్తులు భారీగా తరలివచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.

