Thursday, November 13, 2025
Homeరాజకీయంఒంటిచేత్తో నడిపిస్తున్న కేటీఆర్‌

ఒంటిచేత్తో నడిపిస్తున్న కేటీఆర్‌

హైదరాబాద్‌, నవంబర్‌ 8 : పదిహేనేళ్ల్లకు పైగా ఎమ్మెల్యేగా.. పదేళ్లు మంత్రిగా, బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా అనుభవం ఉన్న కల్వకుంట్ల తారకరామారావు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పార్టీ కార్యకలాపాలు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు పరిపాలన.. తండ్రి కేసీఆర్‌ బాటలో తను నడుస్తూ, ఆయనకు చేదోడువాదోడుగా ముందుకు సాగిన కేటీఆర్‌ ప్రస్తుతం అన్ని బాధ్యతలను తనే నిర్వర్తిస్తున్నారు.ఇప్పటికే పలు ఎన్నికల బాధ్యతను విజయవంతంగా పూర్తిచేసిన కేటీఆర్‌, రాజకీయ ప్రస్థానంలో జూబ్లీహిల్స్‌ మరో మైలురాయిగా నిలువబోతోంది. జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధించడం నల్లేరుపై నడకగానే ఉందనేది ఆ పార్టీ వర్గాల అంచనా ఉంది. ఈ ఉపఎన్నికల తీరు తెన్నులపై పలు సంస్థలు నిర్వహించిన సర్వే నివేదికలు కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి.

వాస్తవానికి ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలిచేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జూబ్లీహిల్స్‌లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని బి.ఆర్‌.ఎస్‌ శ్రేణులు చెబుతున్న మాట. దీంతోపాటు ఇక్కడ అధికార కాంగ్రెస్‌ పార్టీకి ఎదురుదెబ్బ తగులుతుందని పలు సర్వేలు చెబుతున్నాయి. జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌ సాధించబోయే విజయానికి సంబంధించిన ఘనత.. ప్రచారాన్ని ముందుండి ఒంటిచేత్తో నడిపించిన కేటీఆర్‌కే దక్కుతుందని ఆయన వర్గీయులు ఇప్పటినుండే ప్రచారం చేసుకుంటున్నారు.

జూబ్లీహిల్స్‌ ఎన్నికలలో బి.ఆర్‌.ఎస్‌ గెలిస్తే దాని ప్రభావం రాష్ట్రమంతటా వ్యాపించే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే తెలంగాణలోని అన్నివర్గాల్లో కేటీఆర్‌ పట్ల విశ్వాసం పెరుగుతున్నదని బి.ఆర్‌.ఎస్‌ శ్రేణులు బలంగా నమ్ముతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని ఉన్నతాధికారులు మొదలుకుని అటు వ్యాపారులు, ప్రభుత్వ నిర్ణయాల బాధితులు కేటీఆర్‌ను కలిసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొందరు అధికారులు, వాణిజ్యవేత్తలు ఇప్పటికే ఆయనతో టచ్‌లో ఉన్నారు. కాంగ్రెస్‌పై అసంతృప్తి పెరుగుతున్నదని చెప్పడానికి ఈ పరిణామం నిదర్శనంగా ఉందని పరిశీలకులు చెబుతున్నారు.2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా బీఆర్‌ఎస్‌ పార్టీ, కేటీఆర్‌ ప్రజాక్షేత్రంలోనే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం దిశగా పోరాటం చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల నేపథ్యంలో మరింత పటిష్టంగా రంగంలోకి దిగారు.

ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఆయన పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనపై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అవినీతి, వాగ్దానాల అమలుపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతూ బీఆర్‌ఎస్‌ వైపు ప్రజల దృష్టిని తిప్పే ప్రయత్నం చేస్తున్నారు.మరోవైపు పార్టీ అంతర్గతంగా కూడా కేటీఆర్‌ తన ఆధిపత్యాన్ని బలోపేతం చేసుకున్నారు. విూడియా ద్వారా బీఆర్‌ఎస్‌ అజెండాను మళ్లీ తెరపైకి తీసుకురావడం వంటి చర్యలు ఆయన దూకుడుకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఈ దూకుడులో భాగంగా పార్టీ పునరుద్ధరణ, పాలక పక్షంపై తీవ్ర విమర్శలు, కొత్తతరం నాయకత్వాన్ని ప్రోత్సహించడం, అభివృద్ధి, ఐటీ, ఇన్నోవేషన్‌ అంశాలపై మళ్లీ చర్చకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తిచేసుకుంటున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ తిరిగి పుంజుకుంటుంది. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ ముఖచిత్రంగా నిలుస్తున్న కేటీఆర్‌ దూకుడు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. హావిూల అమలులో విఫలమైన కాంగ్రెస్‌ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వైద్యరంగం, విద్యా వ్యవస్థ, మిషన్‌ భాగీరథ, రైతుబంధు వంటి పథకాల అమలులో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపిస్తున్నారు.

ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ పార్టీ పునర్నిర్మాణంపై కేటీఆర్‌ ప్రధానంగా దృష్టి సారించారు. గ్రామస్థాయిలో యూత్‌ కమిటీలు, మండల స్థాయిలో కోఆర్డినేటర్లు, జిల్లా స్థాయిలో వర్కింగ్‌ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. అంతర్గతంగా బీఆర్‌ఎస్‌ పార్టీలో శక్తివంతమైన మార్పులకు కేటీఆర్‌ శ్రీకారం చుడుతున్నారు. జిల్లాలవారీగా సమన్వయకర్తల నియామకాలు, యువతకు పెద్ద పీట, సోషల్‌ విూడియా టీంల బలోపేతం వంటి వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు.కేసీఆర్‌ తరచూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోయినా కేటీఆర్‌ నాయకత్వం పార్టీని నూతన దిశలో నడిపే ప్రయత్నం చేస్తున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఐటీ, పట్టణాభివృద్ధి మంత్రిగా పనిచేసిన సమయంలో హైదరాబాద్‌ను గ్లోబల్‌ సిటీగా తీర్చిదిద్దిన నాయకుడిగా కేటీఆర్‌కు గుర్తింపు ఉంది. ఇప్పుడు ఆ ఇమేజ్‌ను రాజకీయ పునరుద్ధరణలో ఆయుధంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లో మళ్లీ పెరుగుతున్న ఆదరణ, పార్టీ పునర్నిర్మాణం వంటి పరిణామాలు కేటీఆర్‌ను తెలంగాణ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మార్చే అవకాశం ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న కేటీఆర్‌ దూకుడు రాబోయే ఎన్నికల రాజకీయ సవిూకరణాలను పూర్తిగా మార్చనున్నది. పార్టీ పునర్మిర్మాణంతో ప్రభుత్వ విధానాలను కేటీఆర్‌ ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు.అవినీతి, నిర్వాహక లోపాలు, యువత నిరుద్యోగం వంటి అంశాలపై కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

బీఆర్‌ఎస్‌ పాలనలోనే తెలంగాణ ప్రగతి సాధ్యమని ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ భవిష్యత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను కీలక స్థానంలో నిలబెట్టే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్‌ హవా రోజురోజుకూ పెరుగుతున్నది. ఇటీవల కాలంలో రాష్ట్రంలోని ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు కేటీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఇది తీవ్ర చర్చనీయాంశమవుతున్నది. ఈ విషయం బహిర్గతం కాకపోయినా బీఆర్‌ఎస్‌ తిరిగి బలపడుతుందన్న సంకేతంగా రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. కటీఆర్‌ ఐటీ, పట్టణాభివృద్ధి మంత్రిగా ఉన్న కాలంలో రూపొందించిన పలు ప్రాజెక్టులు ప్రస్తుతం మళ్లీ చర్చలోకి వస్తున్నాయి.

కొంతమంది సీనియర్‌ అధికారులు ఆయనను కలవడం ద్వారా హైదరాబాద్‌ మెట్రో విస్తరణ, టీఎస్‌ఐఐసీ ప్రాజెక్టులు, డిజిటల్‌ సిటీ విస్తరణ వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. వీటిని కేవలం పరిపాలనా సమావేశాలుగా కాకుండా రాబోయే ఎన్నికల దిశగా వ్యూహాత్మక మం తనాలుగా విశ్లేషకులు అభిప్రాయపడు తున్నారు.ఐటీ కంపెనీలు, రియల్‌ ఎస్టేట్‌, ఇన్‌ఫ్రా రంగాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా కేటీఆర్‌ను కలుస్తున్నారు. వీరిలో కొందరు ఆయనకు గత బీఆర్‌ఎస్‌ పాలనలో పెట్టుబడి వాతావరణం బాగుండేదని, ప్రస్తుత విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఇది కేటీఆర్‌ పట్ల వ్యాపార వర్గాల్లో మళ్లీ పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనంగా భావిస్తున్నారు. దీంతోపాటు రాష్ట్రంలోని ఆయా వర్గాలు ప్రభుత్వ నిర్ణయాలతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఈ విషయంలో కేటీఆర్‌ బాధితుల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారానికి హావిూ ఇస్తున్నారు. అందరికీ భవిష్యత్‌పై భరోసా కల్పిస్తున్నారు. ప్రస్తుతం కేటీఆర్‌ దూకుడు, భేటీలు, విూడియా చర్చలు చూస్తుంటే బీఆర్‌ఎస్‌ మళ్లీ పటిష్టంగా మారుతున్నదని స్పష్టమవుతుంది. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయ సవిూకరణాలు కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలతో తెలంగాణ రాజకీయాలు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా బీఆర్‌ఎస్‌ పునర్మిర్మాణంలో భాగంగా కేటీఆర్‌ ఇదే దూకుడు కొనసాగిస్తారని పలువురు అంచనా వేస్తున్నారు.

జూబ్లీహిల్స్‌ ఎన్నికల అనంతరం కేటీఆర్‌ పొలిటికల్‌ ఇమేజ్‌ మరింత పెరగనున్నది. ప్రస్తుతం కేటీఆర్‌ తన ప్రసంగాల్లో ‘ప్రజా పాలన వర్సెస్‌ పదేళ్ల ప్రగతి పాలన’ పేరిట ప్రచారం చేశారు.ఈ నినాదాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే దిశగా వ్యూ హాలు రచించే అవకాశం ఉంది. కేటీఆర్‌ దూకుడు వ్యవహరిస్తుండటంతో కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుతం కేటీఆర్‌ ప్రదర్శించే దూకుడు కేవలం వ్యక్తిగత రాజకీయం కాదని, బీఆర్‌ఎస్‌ భవిష్యత్‌ దిశను నిర్ణయించే ప్రాధాన్యమైన ఉద్యమంగా మారుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.‘2028 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలుపే లక్ష్యం’ అని స్పష్టమైన సందేశం ఇస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీని కేటీఆర్‌ ముందుకు నడిపిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన పర్యటనలు, సవిూక్షలు, వ్యూహాత్మక భేటీలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. కేటీఆర్‌ను కలవడానికి ఐటీ, ఇన్‌ఫ్రా, విద్య, హెల్త్‌ రంగాల ప్రముఖులు వస్తున్న క్రమంలో పెట్టుబడులు, అభివృద్ధి ప్రాజెక్టులు, భవిష్యత్‌ దిశపై చర్చలు జరుగుతున్నాయి.ఇది కేటీఆర్‌కు పరిపాలనా స్థాయిలోనూ మద్దతు పెరుగుతోందనే సూచనగా కనిపిస్తోంది. అయితే జూబ్లీహిల్స్‌ ఎన్నికల ఫలితాల ప్రభావం భవిష్యత్‌ అసెంబ్లీ ఎన్నికలపై తప్పకుండా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇటు జూబ్లీహిల్స్‌లో, అటు భవిష్యత్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ క్యాడర్‌ను కేటీఆర్‌ సన్నద్ధం చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments