హైదరాబాద్, నవంబర్ 9 : తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు అక్టోబర్ నెల కాసుల వర్షాన్ని కురిపించింది. ఒకవైపు పండగల వేళ.. భారీగా మద్యం విక్రయాలు జరగడంతోపాటు.. మరోవైపు కొత్త మద్యం షాప్‌ల కోసం టెండర్లు పిలవడంతో భారీగా ఆదాయం సమకూరింది. గతంతో పోల్చితే ఈ ఏడాది అక్టోబర్‌లో రాష్ట్ర ఖజానాకు భారీగా డబ్బులు వచ్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడిరచాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ అక్టోబర్‌లో ఆదాయం రావడం ఎక్సైజ్ శాఖ అధికారులను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊపునిస్తూ.. ఎక్సైజ్ శాఖ రికార్డు స్థాయిలో అక్టోబర్ నెలలో ఆదాయాన్ని నమోదు చేసింది. కేవలం ఒకే ఒక్క నెలలో ఏకంగా రూ.6,348 కోట్ల భారీ ఆదాయం ప్రభుత్వ ఖజానాలో జమ అయింది. కొత్త మద్యం పాలసీ అమలు చేయడంతోపాటు.. అక్టోబర్ నెలలో పండుగల సీజన్ కలయికతో ఈ అద్భుతమైన వృద్ధి సాధ్యమైందని అధికారులు తెలిపారు. ఇక ఎక్సైజ్ శాఖకు వచ్చిన ఈ మొత్తం ఆదాయంలో దాదాపు సగం వాటా కొత్త మద్యం పాలసీ మార్పుల ద్వారానే వచ్చిందని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.
మరోవైపు.. తెలంగాణలో మొత్తం 2,620 మద్యం దుకాణాలకు 2 ఏళ్ల కాలానికి కొత్త లైసెన్సులు ఇచ్చే ప్రక్రియలో భాగంగా దరఖాస్తులను ఆహ్వానించగా.. భారీగా స్పందన లభించింది.గతంలో మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఒక్కో షాప్ కోసం రూ.2 లక్షల దరఖాస్తు ఫీజు వసూలు చేసేవారు. అయితే ఈ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేవారు కాదు. అయితే ఈసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దరఖాస్తు ఫీజును రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచింది. ఫీజును భారీగా పెంచినా.. మద్యం దుకాణాల లైసెన్సుల కోసం 95,628 మంది దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.
కేవలం మద్యం దుకాణాల దరఖాస్తుల ద్వారానే ఎక్సైజ్ శాఖకు రూ.2,868.8 కోట్ల ఆదాయం సమకూరింది. ఇక లాటరీలో మద్యం షాపులు దక్కించుకున్న వ్యాపారులు తొలి విడతలో లైసెన్స్ ఫీజులో ఆరో వంతు మొత్తాన్ని అడ్వాన్స్‌గా చెల్లించగా.. అదనంగా మరో రూ.313 కోట్లు ప్రభుత్వానికి అందాయి. దీంతో లైసెన్సుల ప్రక్రియ ద్వారా వచ్చిన మొత్తం రూ.3,180 కోట్లు అని లెక్క తేలిందిమరోవైపు.. అక్టోబర్ నెలలో బతుకమ్మ, దసరా వంటి వరుస పండుగలు.. జాతరలు ఉండటంతో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఇక అక్టోబర్ నెలలో మద్యం అమ్మకాల ద్వారా రూ.3,168 కోట్ల ఆదాయం తెలంగాణ ఎక్సైజ్ శాఖకు సమకూరింది.
గతేడాది అక్టోబర్‌లో మద్యం అమ్మకాల ద్వారా రూ.2,987 కోట్లు రాగా.. ఈసారి ఆ రికార్డును అధిగమించడం గమనార్హం.ఈ రెండు ప్రధాన వనరుల నుంచి వచ్చిన రూ.6,348 కోట్ల భారీ ఆదాయంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీ ఊరట లభించినట్లయింది. ఈ అదనపు ఆదాయం కారణంగా పెండిరగ్‌లో ఉన్న బిల్లులు త్వరగా మంజూరవుతాయని మద్యం సరఫరాదారులు, కాంట్రాక్టర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

