జనవిజయంఆరోగ్యంవీరమాచనేని వాదనలో శాస్త్రీయత లేదా?! సమాజానికి ప్రమాదమా?!

వీరమాచనేని వాదనలో శాస్త్రీయత లేదా?! సమాజానికి ప్రమాదమా?!

వి.ఆర్.కె డైట్ ప్లాన్ అవగాహన – 2

వీరమాచనేని రామకృష్ణ ఎందుకు తెలుగు ప్రజల మనసులను దోచుకున్నాడనే విషయం ఇంతక్రితం వ్యాసంలో చర్చించాము. ఈ పోస్టులో ఆయన చెప్పే డైట్ లో శాస్త్రీయత ఉన్నదా? ఇలా చెప్పే హక్కు, అధికారం ఆయనకు ఎవరిచ్చారు? ఇలాంటి విషయాలు చెప్పడానికి ఆయన ఎవరు? అసలు శాస్త్రీయతకు కొలమానం ఏమిటి? డాక్టర్లు మాత్రమే ఆహార నియమాలు గురించి చెప్పాలా? అనే ప్రశ్నలకు సమాధానాలు వెదికే ప్రయత్నం చేద్దాం.

విమర్శ చేసే విధానం ఎలా ఉండాలి?

ఒక వేలు ఎదుటివారి వైపు చూపేటప్పుడు నాలుగు వేళ్ళు మన వైపు చూపుతాయనే పెద్దల హితవచనాన్ని ఇక్కడ జ్ఞాపకం తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నదనిపిస్తోంది. వీరమాచనేని రామకృష్ణ డైట్ ప్లాన్ గురించి గానీ, ఆయన ఏ హక్కుతో లేదా అధికారంతో ఇలా సభలు పెట్టి చెప్తున్నారని ప్రశ్నించేవారు లేదా విమర్శించేవారు ముందుగా రామకృష్ణ చెపుతున్నది ఏమిటి? అందులో తప్పేమిటి? అనేది ఆలోచించాలి. ఆలోచించాలంటే ముందుగా రామకృష్ణ చెప్పేదానిని పూర్తిగా వినాలి. అధ్యయనం చేయాలి. అందులో దేనివల్ల ఏ లోపం జరుగుతుంది? ఎలా ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతుంది? అనేది సాధికారికంగా వివరించాల్సి ఉంటుంది. వినదగునెవ్వరు చెప్పిన…. అన్నట్లుగా ముందు రామకృష్ణ చెప్పేది విని అందులో ఫలానా అంశంలో ఈ లోపం ఉంది…. ఈ ప్రమాదం ఉన్నది…. అని చెప్పగలిగితే ఆ విమర్శ నిలబడుతుంది. అలా కాకుంటే ఈర్ష్యా, ద్వేషాలతోనో మరో కారణంతోనో ఆ పని చేస్తున్నారనుకోవలసి వస్తుంది.

శాస్త్రీయతకు కొలమానం ఏమిటి?

సత్యాన్ని కనుగొనగలమే తప్ప సృష్టించలేమంటాడు రాహుల్ సాంకృత్యాయన్. రామకృష్ణ చెప్పినా, వైద్యులు చెప్పినా సత్యం లేకుండా చెబితే ప్రజలు ఏది బడితే అది ఆమోదించరని గుర్తించాలి. కొన్ని విషయాలలో కొద్దికాలం ఆమోదించినప్పటికీ, ఫలితం రానపుడు దీర్ఘకాలిక ఆచరణకు నిలువదు. ఓ విషయం యొక్క శాస్త్రీయత రుజువయ్యేది ఆచరణలో ఫలితం ఇవ్వగలిగినపుడే. ఫలితం ఇవ్వలేనిది శాస్త్రీయం అనిపించుకోదు. ప్రకృతి గొప్పదా? సైన్స్ గొప్పదా? అంటే ఏమి చెప్పాలి! ప్రకృతిలో ఉన్న పదార్ధ ధర్మాలను, ప్రకృతి నియమాలను వివరించగలగడమే సైన్స్ పని. ప్రకృతిలోని అద్భుతాలలో ఒక్క శాతం కూడా ఇప్పటికి సైన్స్ కనుగొనలేదనవచ్చు. ప్రకృతి కొన్ని నియమాల ప్రకారం ప్రతీది పరస్పర ఆధారంగా నిరంతరం చలనంలో ఉంటున్నాయనేది సత్యం. ఆ నియమాలు తెలియకున్నా, తెలుసుకోలేకున్నా ఫలితం ఆధారంగా సత్యాన్ని అంచనా వేస్తాము. ఏమిటి? ఎందుకు? ఎలా? అనే సైన్స్ కోణంకు సమాధానం దొరకకున్నా ఆచరణలో సత్ఫలితాల ఆధారంగా మనుషులు కొన్ని అలవాట్లు చేసుకోవడం సహజం. ఫలితాల ఆధారంగా పరిశీలన, పరిశోధనల సారాంశంగా సైన్స్ నివేదనలను పాఠాలుగా చదువుకుంటాం. ఆ పాఠాలు మరల ఆచరణలో తప్పనిపిస్తే సైన్స్ తన తప్పును సరిచేసుకుని కొత్త పాఠాలు నేర్చుకుంటుంది. లోకానికీ చెపుతుంది. సైన్స్ కు ఆ వినమ్రత, పరిధి ఉంటాయనేది గమనించాలి. సైన్స్ పేరుతొ ప్రతీది అశాస్త్రీయం అనడం, ఫలితం ఆధారంగా అధ్యయనం, పరిశీలన చేయకుండా మూర్ఖంగా కొట్టి పారేయడం, బట్టీ పట్టిన విద్యాజ్ఞానంతో మూసగా, మొరటుగా వాదించడం శాస్త్రీయత కాదు. ఎప్పటికపుడు పద్దతిగా అప్డేట్ కావడమే సైన్స్ గొప్పతనం. అప్డేట్ కాకపోవడం అంటే మూస ధోరణి, మూర్ఖపు తర్కానికి దిగడమే. దానివల్ల సమాజానికి మేలు జరుగదు. సూటిగా చెప్పాలంటే అలాంటివారిని ఒకరకంగా మతవాదుల క్రిందే లెక్క గట్టాలి. ఇంకా చెప్పాలంటే మతం కంటే కూడా వీరితోనే ఎక్కువ ప్రమాదం. పెట్టుబడిదారులకు పరోక్షంగా ఉపయోగపడే సమాజ ద్రోహులుగా మిగులుతుంటారు. పెంటకుప్ప మీద ఏపుగా పెరిగిన కలుపు మొక్కలతో ఏమి ప్రయోజనం? వీరి మూస ధోరణీ అంతే.. వీళ్లు కేవలం డిబేట్ పులులుగా మిగులుతారు. అదీ అసలైన సత్యవాది (సింహం లాంటి వారు) వచ్చేదాకా మాత్రమే.

రామకృష్ణ చెపుతున్నది, చేస్తున్నది ఏమిటి?

వీరమాచనేని విధానం గురించి క్లుప్తంగా పరిశీలిస్తే ఆయన చెప్పేది ప్రధానంగా:

రామకృష్ణ ఏమి చెపుతున్నాడో విని దానిని విమర్శించడం, లేదా ఆచరించడం చేయడానికి, పైపైన విమర్శలు చేయడానికి తేడా ఉంది. రామకృష్ణ చెపుతున్నదానిలో ముఖ్యమైనవి మన జీవితాలలో విచ్చలవిడితనం ప్రారంభం అయ్యాక ఆరోగ్యం పతనం అవ్వడం ప్రారంభమయింది. దానిని తగ్గించుకోవాలి. తద్వారా ఏ జీవన శైలి లోపం వల్ల అయితే కొన్ని వ్యాధులు వచ్చాయో.. అవి తిరిగి అదే దారిన పోవడం ఖాయం. ఇందుకు కొద్ది రోజులు ఆహార నియమాలు పాటించాలి. ఏ ఆహారం లో ఏమి ఉన్నది అన్నది తెలుసుకోవాలి. రీఫైండ్ ఆయిల్స్ ఎపుడూ వాడవద్దు. పురుగు మందులు వాడిన కూరగాయలను యధాతధంగా తినవద్దు. కొబ్బరినూనె, నెయ్యి, పెరుగుమీద మీగడ వంటి కొవ్వును కొద్ది రోజులు క్రమబద్ధంగా తీసుకోవాలి. రోజుకు కనీసం 4 లీటర్లు నీరు త్రాగాలి. 3 నిమ్మకాయల రసం వాడాలి. విధిగా ఒక మల్టీ విటమిన్ టేబ్లెట్ వాడాలి. రోజులో కనీసం 30 నిమిషాలు ఎండలో ఉండాలి. అన్నింటా ప్రకృతికి దగ్గరగా రావాలి. పంటల, వంటల విధానంలో మార్పులు రావాలి. ఆల్కహాల్, గుట్కా, ఖైనీ, వక్కపొడి, జంక్ ఫుడ్ , స్వీట్లు వంటి వాటికి దూరంగా ఉండాలి. వ్యాయామం, శారీరక శ్రమ ప్రాధాన్యత ఎంతమేరకు ఎలా అనేది గుర్తించాలి. కొన్ని ఆహార పదార్ధాలను ఏ మోతాదులో తీసుకోవాలి, ఏవి తీసుకోకూడదు, ఎంతకాలం తీసుకోకూడదు, ప్రోగ్రాం అయ్యాక… ఏవి తినాలి? ఎలా తినాలి? అనే విషయాలపై సమగ్ర అవగాహన కల్పిస్తున్నారు. మొత్తంగా ఇదొక మంచి జీవన విధానం. ఆయన డైట్ గురించి తెలుసుకోవాలంటే ప్రజలు ఆయన టివి ఇంటర్వ్యూ లు కాకుండా ఆయన పబ్లిక్ మీటింగ్ లలో మాట్లాడిన పూర్తి వీడియోలు రిపీటెడ్ గా చూసి తీరాలి. ఆయన చెప్పిన సబ్జెక్ట్ పూర్తిస్థాయిలో ఆకళింపు చేసుకొని తర్వాత మాత్రమే డైట్ చేయాలి.

ఇందులో ఎక్కడా మందుల వాడకం కానీ, వైద్యం కానీ ఆయన చెప్పడం లేదు. డాక్టర్ల పాత్రను తగ్గించి చెప్పడం లేదా విమర్శించడం చేయడం లేదు. ఒక్క టైప్ 2 డయాబెటిస్ కు తప్ప మిగతా ఏ వ్యాధులు ఉన్నా సరయిన డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే తను చెప్పేవి పాటించమని రామకృష్ణ విజ్ఞప్తి చేస్తున్నారు. స్వంత పైత్యం వద్దని హెచ్చరిస్తున్నారు. ఇప్పటిదాకా రామకృష్ణ విధానాన్ని విమర్శించిన వారు పైపైన వారు ఏమి ఎందుకు చెపుతున్నారో అర్ధం కాకుండా విమర్శలు చేశారు, చేస్తున్నారు. ఒక్క విషయంలో కూడా ఏ ఒక్కరూ వివరణాత్మక సద్విమర్శ చేయలేదు, వివరించలేదు. అలా చేస్తే వాటిని ఆహ్వానించాల్సిందే. తప్పులు నిరూపిస్తే రామకృష్ణ అయినా అప్ డేట్ కావలసిందే. సైన్సు కు పాతదానికంటే ఇది ఇలా మెరుగైంది అని నిరూపించగలిగితే ఖచ్చితంగా పాతదానిలో మంచిని కలుపుకుని కొత్తదానిని అప్డేట్ చేసుకుని మళ్ళీ మెరుగైన కొత్తది కనుగొనేవరకూ సవాల్ చేసుకుంటూ ముందుకు పోతుంది. ఇది నిరంతర ప్రక్రియ ఇందులో వ్యక్తుల ఇగోలు, భేషజాలు, ఈర్ష్యా ద్వేషాలు.. ఇతరత్రా ఏవైనా ఏమాత్రం పనికిరానివే.

ఇదెలా న్యాయం?

ఒక మంచిని చెప్పడానికి, అదీ ప్రకృతి సిద్ధమైన మంచి ఆహారపు అలవాట్లు, పూర్వీకులు గొప్పగా బ్రతికిన విధానాలు, వందల ఏండ్లుగా అద్భుత ఫలితాలు ఇచ్చినవి చెప్పడానికి ఏ అర్హత కావాలి? అలా చెప్పడాన్ని విమర్శించడం ఎలా న్యాయం? దానిని సమర్దించాల్సింది పోయి గుడ్డిగా విమర్శించడం సమాజానికి మంచిదా? సమాజ హితం కోరేవారు చేయాల్సింది ఏమిటి? సమాజంలో మతం పేరుతొ బోలెడన్ని అశాస్త్రీయ వైద్యాలు జరుగుతున్నాయి. అశాస్త్రీయతలు జోరుగా ప్రచారం సాగుతున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కానీ వాటిని వ్యతిరేకించడానికి జంకేవారు వంటిల్లే వైద్యశాలగా అనేక వ్యాధులకు లక్షలాదిమందికి అద్భుత ఫలితాలు అందిస్తున్న రామకృష్ణ విధానంపై అక్కసు వెళ్లగక్కడం ఎంతవరకు న్యాయం?

ఓ చానల్ లో డాక్టర్ పి.వి. సత్యనారాయణ చెప్పేది మంచిగా, రామకృష్ణ చెప్పేది ప్రాణాలు తీసేదిగా చెప్పడం గమనిస్తే… మీడియా వారు ప్రజలను మోసం చేయడానికి ఎలా ప్రయత్నిస్తున్నారో అర్ధం అవుతుంది. ప్రజలు అమాయకులనుకోవడమే వారు చేస్తున్న పొరపాటు. రామకృష్ణ చెప్పినా, పి.వి సత్యనారాయణ చెప్పినా లో-కార్బ్, హై-ఫ్యాట్ డైట్ గురించే. దీనికి ఆద్యుడు కెనడాకు చెందిన నెఫ్రాలజిస్ట్ జేసన్’ఫంగ్. ఆయనా వైద్యుడే. ఇంటర్నెట్ లోనూ, ఫంగ్ బ్లాగులోనూ ఈ అంశాలన్నీ ఉన్నాయి. ఆంగ్లం వచ్చినవారెవరైనా వాటిని నెట్ లో చదువుకోవచ్చు. నిజానికి పి.వి సత్యనారాయణ చేసినట్లు, చెప్పినట్లు డాక్టర్లంతా అప్డేట్ అయితే, కీటో డైట్ ను అడాప్ట్ చేసుకోగలిగితే…. రామకృష్ణకు ఇంతపేరు, ఆదరణ రావడానికి గానీ, సమాజ హితం కోసం ఇలా బాధ్యత  తీసుకోవలసిన అవసరం రామకృష్ణకు గానీ ఉండదనే చెప్పాలి.

ఒక పిల్లవాడు డాక్టరు దగ్గరకు వెళ్తే ఆయన మందులు వ్రాసి ఎలా వాడాలి? ఏమి చేయాలి? అన్నది చెప్తాడు. పిల్లాడు పక్కనున్న తల్లి లేదా పెద్దలు వాటిని గుర్తుంచుకుని పిల్లాడు తప్పు చేయబోతే డాక్టరు ఏమి చెప్పాడు? అంటూ మళ్ళీ చెప్తూ, గుర్తు చేస్తూ…. వైద్యం చేస్తారు. అంటే ఇక్కడ అర్ధం చేసుకోవలసింది ప్రతి రోగికీ డాక్టర్ ఎపుడూ ప్రక్కనే ఉండడు. వైద్యం గురించిన అవగాహన ప్రజలకూ అవసరం మేరకు అవసరమే. అది ప్రజలకు ఎలా? ఏ మోతాదులో అందాలి? అందించాల్సివారు చేయాల్సింది ఏమిటి? అన్నది ఇపుడు చర్చ జరగాలి. రామకృష్ణ ప్రజలనే పిల్లలపాలిట తల్లి బాధ్యతను తీసుకున్నాడే తప్ప తానే డాక్టర్ అవతారం ఎత్తలేదన్నది గుర్తించాలి.

అప్పటిదాకా……

ఆచరణలో మరికొంత కాలం ఫలితాలు చూసాక రామకృష్ణ చెప్పినా, పి.వి సత్యనారాయణ చెప్పినా కీటో లేదా లోకార్బ్, హై ఫేట్ డైట్ విధానం వల్ల నిజంగా ప్రమాదం ఉంటే…. అదీ ఇపుడు షుగర్ లాంటి రుగ్మతలకు మందుల పేరుతో ఒక్కో ఆర్గాన్ ను దెబ్బతీస్తూ మనిషిని నిదానంగా అధికారికంగా చంపేస్తూ, ఆత్మవిశ్వాసాన్ని అణగదొక్కుతూ ఉండడం కంటే ప్రమాదమని తేలినప్పుడు ఖచ్చితంగా ఈ విధానంపై పున:పరిశీలన చేయాల్సిందే. అంతవరకూ అనవసర వాదనలు, విమర్శలు, కుహనా మేధావుల బోధనలను అంతగా పట్టిచుకోవలసిన అవసరం లేదు. తదుపరి వ్యాసంలో డాక్టర్లు చేయాల్సిందేమిటి? చేస్తున్నదేమిటి? అనే అంశంపై చర్చిద్దాం.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
  • పల్లా కొండల రావు, ఎడిటర్, జనవిజయం
ఇవీ చూడండి..

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి