భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్ట్ 27 (జనవిజయం): 1.10.2023 నాటికి 18 సంవత్సరాలు నిండే యువతీ, యువకులు నూతన ఓటరుగా నమోదు కావడం, మరణించిన ఓటర్లు జాబితా నుండి తొలగింపు, పోలింగ్ కేంద్రం కానీ, చిరునామా కానీ మారిన ఓటర్లు మార్పులు, చేర్పులు కొరకు 26, 27 తేదీల్లో నూతన ఓటరు నమోదుకు 4041, తొలగింపుకు 557, మార్పులు చేర్పులకు 1820 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. ప్రత్యేక క్యాంపుల్లో వచ్చిన దరఖాస్తులు విచారణ ప్రక్రియ పూర్తి చేయాలని తహసిల్దారులను ఆదేశించారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లోని 1095 పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించామని చెప్పారు. ఇంకనూ ఎవరైనా 1.10.2023 నాటికి 18 సంవత్సరాలు నిండే వారుంటే నూతన ఓటరుగా నమోదు కావాలని చెప్పారు. ఈ నెల 21వ తేదీన ప్రకటించిన ఓటరు జాభితాను ప్రతి ఓటరు పరిశీలించాలని, ఏమైనా అబ్యంతరాలుంటే తెలియచేయాలని పేర్కొన్నారు. వచ్చిన దరఖాస్తులను విచారణ నిర్వహించి ఎన్నికల పోర్టల్ లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అలాగే వచ్చే నెల 2 వ తేదీ శనివారం, 3వ తేదీ ఆదివారం నిర్వహించనున్న ప్రత్యేక క్యాంపులపై ప్రతి ఒక్కరికి సమాచారం చేరాలని అందుకు గాను అన్ని గ్రామాలు, మున్సిపాల్టీలలో టామ్… టామ్ ద్వారా విస్తృత ప్రచారం గావించాలని కలెక్టర్ పేర్కొన్నారు.