ఖమ్మం, ఆగస్టు 16(జనవిజయం): ఓటు ప్రాముఖ్యత పై ప్రణాళికాబద్ధంగా ప్రచారం చేయాలని జాయింట్ ఎన్నికల ప్రధాన అధికారి సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర జాయింట్ ప్రధాన ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ రాష్ట్ర స్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర శాసనసభకు జరగబోయే సాధారణ ఎన్నికలపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర జాయింట్ ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వాహణ సమీపిస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఓటరు టర్న్అవుట్ పెరిగే దిశగా అవగాహన కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని, ప్రజల్లోకి ఎన్నికల కమిషన్ సందేశం విస్తృతంగా వెళ్ళే విధంగా వినూత్న రీతిలో ప్రచారం చేయాలని అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఓటరు టర్న్అవుట్ పెంచేందుకు అనుసరించే వ్యూహం, చేపట్టే కార్యక్రమాల పై నివేదిక సమర్పించాలని అన్నారు.
పట్టణ ప్రాంతాల్లో సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కల్పించాలని, గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక పరిస్థితుల కనుగుణంగా ప్రచారం చేపట్టాలని అన్నారు. జిల్లాలో ఉన్న విద్యా సంస్థలో ప్రత్యేక ఎలక్టోరల్ క్లబ్స్ ఏర్పాటు చేయాలని, ఓటరు ప్రాముఖ్యత పై విస్తృత ప్రచారం కల్పించాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. నూతన ఓటరు నమోదు అంశంలో లింగ నిష్పత్తి 790 మాత్రమే ఉందని, దీని పై ప్రత్యేక శ్రద్ధ వహించి నూతన మహిళా ఓటర్లు నమోదు విస్తృతంగా జరిగేలా చూడాలని అన్నారు. ప్రతి పోలింగ్ బూత్ వారిగా ఓటరు జాబితాలో లింగ నిష్పత్తి గమనించి తక్కువ ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. జిల్లాలో నూతనంగా మంజూరు చేసిన ఓటర్లకు ఓటర్ గుర్తింపు కార్డులు ముద్రించి అందించాలని అన్నారు.
జిల్లాలో నూతనంగా మంజూరు చేసిన ఓటర్లు, ముద్రించిన ఓటర్ గుర్తింపు కార్డులు, పంపిణీ పై జిల్లా ఎన్నికల అధికారులు దృష్టి సారించాలని, ఆగస్టు 15 నాటికి మంజూరు చేసిన ఓటర్లు గుర్తింపు కార్డులు త్వరగా ముద్రణ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని, ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ప్రింటర్లతో సమన్వయం చేసుకొని త్వరగా పంపిణీ చేసేలా చూడాలని అన్నారు. జిల్లాలో మూడవ జెండర్ ఓటరు నమోదు పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. రెండవ విడత ఓటర్ జాబితా సవరణలో భాగంగా డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల కంటే ముందు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని, రెండవ ఓటరు సవరణ షెడ్యూల్ పై సమాచారం అందించాలని, ఆగస్టు 21న విడుదల చేస్తామని, సెప్టెంబర్ 19 లోపు అభ్యంతరాలు, నూతన ఓటరు నమోదు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని అన్నారు.
ఈ వీడియో సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, తక్కువ ఓటింగ్ జరిగే ప్రాంతాలు, అక్కడ మెరుగుపరిచేందుకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేశామని అన్నారు. లింగ నిష్పత్తి తక్కువ ఉన్న ప్రాంతాల్లో మహిళా ఓటర్ల నమోదుపై దృష్టిసారిస్తామన్నారు. స్వీప్ కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా చేపడతామన్నారు.
ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, మాస్టర్ ట్రైనర్ కె.శ్రీరామ్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.