ఖమ్మం, ఆగస్టు 17(జనవిజయం): నూతన ఓటర్లకు ఓటు హక్కుపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. గురువారం నూతన కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో స్వీప్ కార్యక్రమంలో భాగంగా చేపట్టబోయే 5కె రన్ నిర్వహణపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ప్రాముఖ్యత, ఓటు హక్కు వినియోగంపై ఓటర్లలో అవగాహన కల్పించి, చైతన్యం తేవాలని స్వీప్ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ నెల 19న జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో 5కె రన్ నిర్వహించనున్నట్లు, ఇట్టి రన్ ను నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అనే భావనతో చేపడుతున్నట్లు ఆయన అన్నారు. యువ ఓటర్లు, నూతన ఓటర్లను ఎక్కువ సంఖ్యలో ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలన్నారు. బూత్ లెవల్ అధికారులు అందరూ పాల్గొనేలా చూడాలన్నారు. స్వయం సహాయక సంఘాలు, మెప్మా సంఘాలు పాల్గొనేలా కార్యాచరణ చేయాలన్నారు. 5కె రన్ లో కేవలం రన్ నే కాకుండా ఓటర్లలో అవగాహన, స్వేచ్ఛగా, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుంగా ఓటు వేసేలా చైతన్య పరచాలన్నారు.
ఓటరుగా నమోదు ఉన్నది, పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉన్నది తదితర వివరాలు తెలుసుకోవడానికి యాప్ డౌన్లోడ్ పై అవగాహన చేయాలన్నారు. ఓటు హక్కు పై కరపత్రాలు ముద్రించి పంపిణీ చేయాలన్నారు. 5కె రన్ ప్రారంభం, ముగింపు ప్రదేశాల్లో మొబైల్ డిమాన్ స్ట్రేషన్ వాహనాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలన్నారు.
సమీక్ష లో పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ మాట్లాడుతూ, ఒక్క చూపులో అర్థం అయ్యేలా కరపత్రాల రూపకల్పన చేయాలని, 5కె రన్ చేపట్టే ప్రాంతం, చుట్టుప్రక్కల పంపిణీ చేయాలని, 5కె రన్ లో భాగస్వామ్యం అయ్యేవారికంటే 10 రేట్లు ఆయా ప్రదేశాల్లో ఉన్నవారికి అవగాహన కలిగేలా చూడాలన్నారు. ఇంటర్, ఇంజనీరింగ్ కళాశాలల, సైక్లింగ్, వాకర్, స్పోర్ట్స్ అసోసియేషన్ల సభ్యులను కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలన్నారు.
ఈ సమీక్ష లో ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, జెడ్పి సిఇఓ అప్పారావు, జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, జిల్లా సాంఘీక సంక్షేమ అధికారి కె. సత్యనారాయణ, జిల్లా బిసి సంక్షేమ అధికారిణి జి. జ్యోతి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవిబాబు, ఎస్బి ఏసీపీ ప్రసన్న కుమార్, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ రాంబాబు, ఆర్సీవోలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.