- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యా, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలకు నిరసనగా బైక్ ర్యాలీ
- విజయవంతం చేయాలని కోరుతూ వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ
బోనకల్, జులై 15(జనవిజయం):
విద్యలో కేంద్రీకరణ, వ్యాపారీకరణ, కాషాయీకరణలను పెంచి పోషించేదిగా ఉన్న జాతీయ విద్యావిధానం 2020 ని రద్దు చేసి భారత రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా లౌకిక, ప్రజాస్వామిక, శాస్త్రీయ విలువలతో కూడిన ప్రత్యామ్నాయ విద్యావిధానం ప్రవేశపెట్టాలని, ఉద్యోగుల కుటుంబాల సామాజిక భద్రతకు ముప్పుగా పరిణమించిన జాతీయ పెన్షన్ పథకాన్ని (NPS- CPS) రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్దరించాలని, ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని రు. 7 లక్షలకు పెంచాలని. పొదుపు మొత్తాలపై ఇచ్చే పన్ను రాయితీని రు. 3 లక్షలకు పెంచాలని… తదితర సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జులై 19 తేదీన బోనకల్ మండల వ్యాప్తంగా జరిగే ర్యాలీని నిర్వహిస్తున్నామని, ఆగస్టు 12న జిల్లా కేంద్రంలో నిరసన దీక్ష చేపడుతున్నామని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టిఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి గుగులోతు.రామకృష్ణ, జిల్లా నాయకులు సద్దా బాబు, టిపిటిఫ్ మండల అధ్యక్షులు యాకుబ్ పాషా శనివారంనాడు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలని, బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని, డీఈఓ, డిప్యూటీ ఇఓ, ఎంఈఓ తదితర పర్యవేక్షణాధికారుల పోస్టులను మంజూరు చేసి రెగ్యులర్ నియామకాలు చేపట్టాలని, పాఠశాలల్లో సర్వీస్ పర్సన్స్ ను నియమించాలని, మౌలిక వసతులు కల్పించాలని, నెల మొదటి తేదీన వేతనాలు ఇవ్వాలని, ట్రెజరీల్లో పాసై ప్రభుత్వం వద్ద నెలల తరబడి పెండింగ్ లో ఉన్న బిల్లులన్నింటినీ వెంటనే విడుదల చేయాలని, బకాయి ఉన్న రెండు డిఎ వాయిదాలను విడుదల చేయాలని, రెండవ పిఆర్సీ కమిటీని నియమించి 1.07.2023 నుండి ఆర్థిక ప్రయోజనంతో అమలు చేయాలని, రు. 398 స్పెషల్ టీచర్ సర్వీసుకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, 2003 డిఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలని, అన్ని యాజమాన్యాల విద్యాసంస్థల్లోని ఉద్యోగులకు హెల్త్ కార్డులపై నగదు రహిత వైద్యం అందించాలని, శ్రమకు తగిన వేతనాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టియస్ యుటియఫ్ మండల నాయకులు పి గోపాలరావు, కలకోట ప్రధానోపాధ్యాయులు జ్ఞానేశ్వర చారి ,చిన్న రంగారావు పి నరసింహారావు, ఆర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
డిమాండ్స్:
1. జాతీయ విద్యా విధానం -2020 (NEP-2020)ని రద్దు చేయాలి.
2. జాతీయ పెన్షన్ పథకం (NPS) ని రద్దు చేయాలి – పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి.
3. ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని రు. 7 లక్షలకు పెంచాలి. పొదుపు మొత్తాలపై ఇచ్చే రాయితీని రు. 3 లక్షలకు పెంచాలి.
4. దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో ఉన్న ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.
5. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి.
6. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ తదితర తాత్కాలిక ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.
7. తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించాలి.