విభజించి పని చేయండి – విజయం సాధించండి

0
563
Share this:

మనం రోజువారీ పనులు ఒక వర్క్‌డైరీలో ప్లాన్ చేసుకుంటాం. అందరికీ ఈ అలవాటు ఉండకపోవచ్చు. ఈ అలవాటు లేని వారు కూడా ఈ రోజు ఈ పనులు చేద్దాం అని మనసులో అనుకుంటారు. డైరీ వ్రాసేవారు చేయాల్సిన పనులు  గుర్తుకు తెచ్చుకోవడానికి, ఆ పనులు మరచిపోకుండా ఉండడానికి అదొక మంచి అలవాటుగా పనికి వస్తుంది. అలా వ్రాసుకోని వారికి ఏదో ఒక పని మరచిపోవడం లేదా అసలు గుర్తుకు రాకపోవడం జరుగుతుంది. అందుకని ఈరోజే పనులను ఉదయాన్నే ప్లాన్ చేసుకోవడం, వాటికోసం ప్రయత్నించి రాత్రిపూట సమీక్ష చేసుకోవడం అలవాటుగా మార్చుకోండి. దీనికోసం వర్క్‌డైరీని వ్రాయడం వెంటనే అలవరచుకోండి.

నాలుగు ఏరియాలు

అయితే పనులను ప్లాన్ చేసుకోవడానికి, ఎక్కువ ఫలితం రావడానికి డైరీలో అనుసరించాల్సిన టెక్నిక్ ఏమిటంటే రోజులో మనం చేయాల్సిన పనులను విభజించడం. సాధారణంగా అయితే మన పనులను నాలుగు ఏరియాలుగా విభజించవచ్చు. ఇందులో మొదటిది వ్యక్తిగతం, రెండవది ఆర్ధికం, మూడవది కుటుంబం, నాలుగవది సమాజం. మనం చేసే పనులలో ప్రతీది ఈ నాలుగు ఏరియాలలో ఏదో ఒకదానికి చెందినదై ఉంటుంది. ప్రతిరోజూ అన్ని ఏరియాల పనులు ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. పని ప్లాన్ చేసుకునేముందు ఈ నాలుగు ఏరియాలకు చెందిన పనులు ఏమైనా ఈరోజు చేయాల్సి ఉన్నదా? అని ఓసారి చెక్ చేసుకుంటే ఆ ఏరియా పని ఈ రోజు చేయాల్సిన లిస్టులో చేర్చాలా? వద్దా? అన్నది తేలుతుంది. పని పెండింగ్ పడకుండా లేదా మరచిపోకుండా ఉండేందుకు ఈ టెక్నిక్ సహకరిస్తుంది. మీ లక్ష్యాన్ని బట్టి మరికొన్ని ఏరియాలు పెంచుకోవడం లేదా తగ్గించుకోవడం అనేది వ్యక్తిగతంగా ప్లాన్ చేసుకోవచ్చు.

వ్యక్తిత్వం పెంచుకుందాం

మొదటి ఏరియాకు వస్తే వ్యక్తిగతంగా అన్ని రకాలుగా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏమేమి చేయాలనుకుంటున్నారు? ఏమేమి చేస్తున్నారు? వాటిలో ఏ పనులు ఎందుకు వాయిదా వేస్తున్నారు? దీనిని ఎందుకు సాధించలేక పోతున్నారు? అనేది రివ్యూ చేసుకుంటూ ముందడుగు వేయడానికి వ్యక్తిగతం అనే ఏరియా గురించి ప్లాన్ చేసుకునేటపుడు ఉపయోగంగా ఉంటుంది. అలాగే ఎపుడైనా విజేతల గురించి చూస్తున్నప్పుడు, ఆలోచిస్తున్నపుడు మనమూ ఇలా చేయలేమా? అనిపిస్తున్నవి ముందుగా డైరీలో నోట్ చేసుకోండి. తరువాత సాధ్యాసాధ్యాలనుబట్టి వాటిని అలవాట్లుగా మార్చుకోవడానికి ప్రయతించవచ్చు. అధ్యయనం, ఆరోగ్యం, డ్రెస్సింగ్, వ్యక్తిగతశుభ్రత, రిలాక్స్ కావడం, నైపుణ్యాలను పెంచుకోవడం, ఆరోగ్యం కాపాడుకోవడం, వ్యాయామం చేయడం, ఇతర వ్యక్తిగత సామర్ధ్యాలను పెంచుకోవడానికి ఇది ఎంతగనో ఉపయోగపడుతుంది. మంచి అలవాట్లు పెంచుకోవడానికి, చెడ్డ అలవాట్లు మానడానికి ఇది బెస్ట్ టెక్నిక్ గా ఓ మంత్రం లా పని చేస్తుంది. ఆచరించి చూస్తే మీకే తెలుస్తుంది. మొత్తంగా మనిషి నుండి మనీషి గా ఋషిలా ఎదిగేందుకు మీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకునే శిల్పిలా మీకు ఈ ఏరియా ప్లానింగ్ ఉపయోగపడుతుంది.

డబ్బుపై దండయాత్ర చేద్దాం

ఆర్ధికం విషయానికి వస్తే కోటివిద్యలు కూటికొరకే అన్నారు పెద్దలు. ఈ సమాజం లో ఏ పని చేయాలన్నా డబ్బుతో ముడిపడి ఉంటుంది. డబ్బుతో ఒక్క అవసరమూ తీరదు. కానీ ఏ అవసరం తీరాలన్నా డబ్బు కావాలి. ఆర్ధిక అవసరాలకోసం మీరు ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, కూలీ లేదా ఇతర వృత్తులు ఏదో ఒకటి అనుసరిస్తారు. అయితే వీటికి సంబంధించి మీకు లభించే ఆదాయం, కుటుంబ ఖర్చులు విషయంలో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. పొదుపు, భవిష్య నిధి, అప్పులు, ఇన్సూరెన్స్, ఆరోగ్య భీమా వంటి వాటి గురించి ఏనెలకానెల ప్లాన్ చేసుకుంటూ పోవాలి. అదనపు ఆదాయ వనరులకోసం ప్లాన్ చేసుకోవాలి. రోజులో ఎక్కువ భాగం దీనికోసమే హార్డ్ వర్క్ చేయకుండా, స్మార్ట్ వర్క్ చేసుకునేలా చిన్నవయసు నుండే ప్లాన్ చేసుకోకపోతే జీవితంలో చాలా చిక్కులు ఎదుర్కోవలసి వస్తుంది. నిర్మొహమాటంగా డబ్బు విషయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బు మీద దండయాత్ర చేయండి. డబ్బు ని అది కల్పించే ఆలోచనలను ఎల్లపుడు మీ ఆధీనంలోనే ఉంచుకోండి. డబ్బు మాట మీరు వినేలా కాకుండా మీ మాటే డబ్బు వినేలా ఆర్ధిక వ్యవహారాలలో మీరు నైపుణ్యం సాధించాలి. అపుడే ప్రశాంత జీవితం సాధ్యమవుతుంది. దీనిని మీరు క్రమంగా ప్లాన్ చేసుకుంటూ సాధించాల్సి ఉంటుంది. దీనికి వర్క్ డైరీ చాలా ఉపకరిస్తుంది.

బంధాల బాధ్యత మరువొద్దు

మూడో అంశం ముఖమైన, బాధ్యతగా వ్యవహరించాల్సిన విషయం కుటుంబం. కుటుంబం ఎపుడూ మీకు సహకిరించేలా చూసుకోవడం అత్యంత కీలకమైన అంశం. ఈ ఏరియాలో మీకు వాతావరణం అనుకూలిస్తే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. మన మనసుపై, ఏకాగ్రతపై కుటుంబం ప్రభావం అధికం. ఇంటి అవసరాలు, ఇంటి సమస్యలు, బంధువులతో సంబంధాలు వంటి విషయాలు మీ పనిపై ప్రభావితం పడకుండా ఇంటి పనులను ప్లాన్ చేసుకోవాలి. ఇది కుటుంబ సభ్యుల సహకారంతో మాత్రమే సాధ్యం. ఏ పని చేసినా కుటుంబ సభ్యులతో కలసి ప్లాన్ చేయడం వంటి టెక్నిక్ లు పనికి వస్తాయి. మానవ సంబంధాలు, ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్న నేపధ్యంలో ఇది కత్తిమీద సామే. అయినా ఆత్మీయతానుబంధాలు ఇచ్చే శక్తిని డబ్బుతో కొలవలేము, డబ్బుతో ముడిపెట్టి చూడలేము. కుటుంబం విషయంలో మీరేసే అడుగులు మీ పిల్లలకు, భావితరాలకు మార్గదర్శకం కావాలి. పిల్లలు కేర్ సెంటర్లలో, పెద్దలు వృద్ధాశ్రమంలో ఉండే సంస్కృతి సమాజానికి ఏమాత్రం మంచిది కాదు. దీనిని మార్చేలా మీ కుటుంబం ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఇపుడున్న సామాజిక, మానసిక పరిస్తితులలో ఇది అంత తేలిక కాదు కానీ, అసాధ్యం మాత్రం కాదని గుర్తుంచుకోండి. కుటుంబం, మానవ సంబంధాలకోసం మీ సంపాదనకై వెచ్చించే పని వేగం గమనంలో ఉంచుకోండి.

నలుగురితో నారాయణా….

నాలుగో అంశం సమాజం. ‘నలుగురితో నారాయణా….కులంతో గోవిందా’ అని సామెత. ఇందులో కులం అనేది వ్యక్తిగతం. సమాజంలో మనకంటూ కొందరు ఆప్తులను సంపాందించుకోవాలి. సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించడం అలవాటు చేసుకోవాలి. మనం, మన కుటుంబం సమాజంలో భాగమని మనకు తెలుసు. అయినా ఎందుకో సమాజం గురించి, రాజకీయాల గురించి, ఇతర సాంఘిక అంశాల గురించి మనకు సంబంధం లేనట్లుగా ఉంటాము. ఇది సరికాదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉండడం ఎవరికీ క్షేమం కాదు. ప్రస్తుత సమాజిక పరిస్తితులు అన్నింటా విలువలు దారుణంగా దిగజారిపోతున్నాయి. పరిస్తితి మరింత ప్రమాదంలోకి వెళ్లకముందే దీనిని మనం అరికట్టాలనే ఆలోచన అందరిలోను ఉండాలి. సమాజం కోసం మీ ఇతర పనులను త్యాగం చేయక్కర్లేదు కానీ కనీస బాధ్యతతో ఐక్యతతో ఉంటే మనకూ మంచిది. నలుగురితో కలవడం, నలుగురికి ఉపయోగపడడం అన్నది అలవాటుగా చేసుకోండి. అందుకోసం మంచి మానవసంబంధాలను పెంచుకోవడానికి సమయం కేటాయించండి.

ఇలా మీ పనులను పైన వివరించినట్లు లేదా మీ ప్రాధాన్యతల రీత్యా ప్లాన్ చేసుకోండి. ప్రతి రోజూ దినచర్యలో ఇలా ఏరియాల వారీగా ప్లాన్ చేస్కుంటూ ప్రగతి మార్గంలో నడవండి. ముందడుగు వేయండి. విజయం మీదే.

– పల్లా కొండలరావు,
kondalarao.palla@gmail.com

గమనిక:

  • WhatsApp లో జనవిజయం అప్డేట్స్ పొందేందుకు https://bit.ly/3jqXNLp గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
  • Telegram లో జనవిజయం అప్డేట్స్ పొందేందుకు https://t.me/janavijayam ఛానల్ లో జాయిన్ అవ్వండి.