ఖమ్మం, జూలై 15(జనవిజయం): ఖమ్మం అర్బన్ మండలంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల ఆక్రమణలు సహించేది లేదని, కఠినచర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. వెలుగుమట్ల లో సర్వే నెంబర్ 147, 148, 149 లలో భూదాన్ భూములు ఉన్నట్లు ఆయన అన్నారు. ఒకరిద్దరు దళారులు అమాయక పేద ప్రజల నుండి డబ్బులు వసూలు చేసి, వారిని భూదాన్, పరిసర పట్టా భూముల ఆక్రమణకు ఉసిగోల్పుతున్నట్లు, వారిని మోసం చేస్తున్నట్లు కలెక్టర్ అన్నారు. దళారులు ఒక్కొక్కరి నుండి రూ. 40 వేల నుండి లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఆయన అన్నారు. ఖమ్మం నుండే కాక సూర్యాపేట, తల్లాడ తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలచే భూ ఆక్రమణలు చేయిస్తున్నట్లు ఆయన తెలిపారు. శనివారం భూ ఆక్రమణ చేసి, 300 షెడ్లు వేయగా, అన్నింటిని కూల్చివేసినట్లు ఆయన తెలిపారు. ప్రజలెవ్వరు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, భూ ఆక్రమణలపై కఠిన చర్యలు వుంటాయని, భూ ఆక్రమణదారులు, ప్రోత్సహించిన వారిపై భూ ఆక్రమణ, క్రిమినల్ కేసులతో పాటు పిడి యాక్ట్ నమోదు చేస్తామని కలెక్టర్ ఆ ప్రకటనలో హెచ్చరించారు.