వరద పూర్తిగా తగ్గేవరకు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలి
- కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ ప్రియాంక అలా
భద్రాచలం, జూలై 21 (జనవిజయం):
వరద ముంపు తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ముంపు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రంలో ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అల తెలిపారు. శుక్రవారం రాత్రి నన్నపనేని మోహన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గోదావరి 44.30 గంటలకు వచ్చినప్పటి భద్రాచలం పట్టణంలోని కొత్త కాలనీకి నీరు చేరినట్లు చెప్పారు. కొత్తకాలనికి చెందిన 29 కుటుంబాలకు చెందిన 90 మందిని పునరావాస కేంద్రానికి తరలించినట్లు చెప్పారు. వీరిలో 40 మంది మహిళలు, 38 మంది పురుషులు 12 మంది బాలబాలికలు ఉన్నట్లు తెలిపారు.
నాణ్యమైన ఆహారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి తక్షణ వైద్య సేవలు అందించాలని కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు. అనంతరం విస్తా కాంప్లెక్స్ వద్ద మురుగునీటి తరలింపును పరిశీలించారు. నీటి తరలింపుతో పాటు పరిసరాలను పరిశుభ్రం చేయాలని, ఎలాంటి వ్యర్ధాలు లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.