Tuesday, October 3, 2023
Homeవార్తలుకొత్తగూడెం ఎమ్మెల్యే వనమా ఎన్నిక చెల్లదు : హైకోర్టు సంచలన తీర్పు

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా ఎన్నిక చెల్లదు : హైకోర్టు సంచలన తీర్పు

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా ఎన్నిక చెల్లదు

  • హైకోర్టు సంచలన తీర్పు
  • జలగమే ఎమ్మెల్యే
  • వనమా కు రూ. 5 లక్షలు జరిమానా

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 25 (జనవిజయం):

కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెల్లడించింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుండి అంటే 2018 డిసెంబర్ 12 నుండి జలగం వెంకటరావునే కొత్తగూడెం ఎమ్మెల్యేగా హైకోర్టు పేర్కొన్నది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం అసెంబ్లీ స్థానం లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వనమా వెంకటేశ్రరావు రావు, టిఆర్ఎస్ అభ్యర్థిగా జలగం వెంకటరావు పోటీ చేయగా 4, 139 ఓట్ల ఆధిక్యత తో వనమా విజయం సాధించారు. అప్పటి నుండి ఆయన కొత్తగూడెం ఎమ్మెల్యే గా ఉన్నారు.

తర్వాత కాలం లో కాంగ్రెస్ ను వీడిన వనమా టిఆర్ఎస్ లో చేరారు. వనమా 2018 ఎన్నికల్లో దాఖలు చేసిన నామినేషన్ అఫిడవిట్ లో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ, వనమా ఎన్నిక చెల్లదంటూ జలగం వెంకటరావు ఎన్నికల ఫలితాల అనంతరం హైకోర్టు ను ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనల అనంతరం మంగళవారం వనమా ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. వనమా కు ఐదు లక్షల రూపాయల జరిమానా విధించింది.

వనమా సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయనాయకుడు. ఉమ్మడి ఖమ్మం జిల్లా లో తనకంటూ వొక ప్రత్యేక గుర్తింపును, అనుచర గణంను కలిగి ఉన్నారు. గ్రామపంచాయతీ సర్పంచ్ నుండి రాజకీయాల్లో ఎదిగారు. మొదటి నుండీ కాంగ్రెస్ పార్టీ లోనే ఉన్న వనమా 2014 ఎన్నికల సమయం లో కాంగ్రెస్ టికెట్ రాకపోవడం తో వైఎస్సార్ పార్టీ నుండి పోటీ చేసి టిఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకటరావు చేతిలో ఓటమి పాలయారు. కొత్తగూడెం నుండి పలు మార్లు ఎమ్మెల్యే గా గెలుపొందిన వనమా 2004 లో సీఎం రాజశేఖరరెడ్డి మంత్రి వర్గం లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గా పనిచేసారు.

1983, 1985, 1994, 2009, 2014 ఎన్నికల్లో కొత్తగూడెం నుండి అసెంబ్లీ కి పోటీ చేసిన వనమా ఓటమిచెందారు. 1989, 1999, 2004, 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యే గా గెలుపొందారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 1,90,455 ఓట్లు కు గాను 1,72,318 ఓట్లు పోలయ్యాయి. వీటిలో వనమా కు 81, 118 ఓట్లు రాగా, జలగం కు 76, 979 ఓట్లు వచ్చాయి. 4,139 ఓట్ల ఆధిక్యత తో కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే గా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఇదే వనమా పై జలగం వెంకటరావు టిఆర్ఎస్ అభ్యర్థి గా పోటీ చేసి 16, 521 ఓట్ల ఆధిక్యం తో గెలిచారు. జలగం కు 50, 688 ఓట్లు రాగా, వనమా కు 34, 167 ఓట్లు వచ్చాయి.

సుదీర్ఘ రాజకీయ అనుభవము తో కొత్తగూడెం లో చెరగని ముద్ర వేసిన వనమా కు వయసు రీత్యా వృద్ధాప్యం దశ లో ఒక చేదు అనుభవం గా హైకోర్టు తీర్పు మిగిలిపోతుంది. అయితే వనమా హై కోర్టు తీర్పు పై సుప్రీంకోర్టు ను ఆశ్రయిస్తారని, అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని కోరుతూ వనమా అనుచరులు సోషల్ మీడియా లో ప్రచారం చేస్తున్నారు. భవిష్యత్ లో న్యాయస్థానం లో క్లీన్ చీట్ వస్తే తప్ప వచ్చే ఆరేండ్ల వరకు వనమా వెంకటేశ్వరరావు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు లేకుండా అనర్హులు అయినట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments