జనవిజయంఆరోగ్యంవైద్య విధానాలవల్ల మేలు

వైద్య విధానాలవల్ల మేలు

హాస్పిటల్స్ పెరగటం అనాగరిక లక్షణం అని గాంధీగారు అన్నారు. అయినా హాస్పిటల్స్ పెరుగుతూనే ఉన్నాయి. అవి అలా పెరగడానికి కారకులెవరు అంటే, మనమే. మనకు శరీరంపట్ల సరైన అవగాహన లేక సరైన నియమాలు పాటించక ఆరోగ్యాన్ని చేతులారా పాడుచేసుకుని అనేక రకాల రోగాలతో అవస్థలు పడుతున్నాము. ఈ అవస్థల నుండి రక్షించడానికి వివిధ వైద్య విధానాలు కనిపెట్టడం జరిగింది. మనము ఎంతెంత ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటూ ఉంటామో అంతంత వైద్య విధానాలు, వైద్యులు పెరుగుతూ ఉంటాయి. మన ఆరోగ్యము ఎంతగా దిగజారిపోయిందంటే ఎన్ని ఆధునికమైన పరికరాలు, మందులు కనిపెట్టినా, ఎంతమంది మేధావులైన డాక్టర్లు మనమీద తమ వైద్యాన్ని ప్రయోగిస్తున్నా లొంగనటువంటి మొండి రోగాలు మనలో రోజు రోజుకీ ప్రత్యక్ష మవుతున్నాయి. వారు ఎంత చేసినా ఒక రోగం తగ్గి ఇంకొక రోగం వస్తూనే ఉంటుంది.

అందుకే అన్ని రోగాలు చూడటం ఒకరి తరం కాకపోయేసరికి ఒక్కొక్క జబ్బుకి కొంతమంది స్పెషలిస్టులు తయారవ్వాల్సి వచ్చింది. సుగరు స్పెషలిస్టు, గుండె స్పెషలిస్టు, నరాల స్పెషలిస్టు వగైరా వగైరా. కొన్ని సంవత్సరాల క్రితం వరకూ మామూలు డాక్టర్లకు తగ్గని రోగం స్పెషలిస్టు దగ్గరికి వెళ్తే తగ్గి బాగుపడి వచ్చేవారు. ఇపుడు సందుసందుకీ ఒక స్పెషలిస్టు వచ్చినా రోగుల సంఖ్య తగ్గడం లేదంటే ఎవర్ని అనుకోవాలి? రోగుల్ని డాక్టర్లు తయారు చేయడం లేదు కదా. రోగాల్ని తెచ్చుకుని మనం డాక్టర్ల దగ్గరకు వెళ్తున్నాం కాబట్టి రోగం రాకుండా చేసుకొనే బాధ్యత ముఖ్యంగా మనపైనే ఉంది. మనం ఆరోగ్యవంతంగా తయారవుతూ ఉంటే వాటి అవసరము క్రమేపీ తగ్గుతూ వస్తుంది. మనిషిని అనారోగ్యం నుండి రక్షించడానికి అనేక వైద్య విధానాలు ఎంతో మేలు చేస్తున్నాయి. ఆయుర్వేదం, అల్లోపతి, హోమియోపతి, నేచురోపతి, యునాని మొదలగు వైద్య విధానాలు ప్రజలకు ఆయా కోణాల నుండి సహకరిస్తున్నాయి. ఆ వైద్య విధానాలు అభివృద్ధి అవ్వడం ఎంత అవసరమో, మన ఆరోగ్యాన్ని మనం అభివృద్ధి చేసుకోవడం కూడా అంతే అవసరము.

అకస్మాత్తుగా మనకేదైనా రోగం వచ్చి బాధపడుతున్నప్పుడు దానిని తొలగించుకోవడానికి వైద్యము చేయించుకోవడము తప్పు కాదు. ఆ వైద్యము చేయించుకునే అవసరము శరీరానికి కలిగేటట్లు బ్రతకడం తప్పు. ఏ తప్పు చేస్తున్నందుకు ఆ జబ్బు వచ్చిందని వైద్యులు చెబుతారో, ఆ తప్పు ఇక చేయకండా, ఆ జబ్బు ఇకరాకుండా బ్రతికితే వైద్యులకు, వైద్య విధానాలకు పని తగ్గిపోతుంది. మన ఆరోగ్యాన్ని రక్షించుకుంటూ మందులతో అవసరము రాకుండా బ్రతకడం అన్నింటికంటే ముఖ్యమైనవి. మన శరీరాన్ని పూర్తిగా చెడగొట్టుకుని బ్రతుకుతున్నాం కాబట్టి ఏదో ఒక రోజు ఏదో ఒక రోగం మనకు రాకుండా ఉండదు కాబట్టి మనకు తప్పనిసరిగా డాక్టరు అవసరముంటుంది. ప్రస్తుతం మనిషి ఉన్న పరిస్థితికి వైద్య విధానాలు ఎంతో సేవచేయబట్టే ఈ మాత్రమైనా మనిషి కనీసం బ్రతికి బట్టకట్టి తిరుగుతున్నాడు. లేకపోతే ఎంతోమంది రోగాలతో ప్రతి నిత్యం చనిపోతూ ఉండవలసి వచ్చేది. ఒకవేళ ఇబ్బందులొచ్చినా సమస్య ముదిరినా నేను వైద్యం చేయించుకోను, వైద్యుడు దగ్గరకు వెళ్ళను, ఆ మందును నేను వాడను అని అనడం పొరపాటు.

డాక్టరు దగ్గరకు వెళ్ళాలి, కాని ఎప్పుడు వెళ్ళాలనేది ప్రతి మనిషి తెలుసుకోవాలి. పూర్వకాలంలో కడుపునొప్పి, జ్వరాలు లాంటివి వచ్చినప్పుడు పెద్దలు ఉపశాంతి కోసం ప్రకృతి సిద్ధమైన ఔషధాలు ఏవైనా వేయడం, లంఖణం పెట్టడం లాంటివి చేసి తగ్గనప్పుడు డాక్టరు దగ్గరకు తీసుకుని వెళ్ళి మందులు వాడేవారు. అందుకే ఎవరైనా పట్టణం వెళ్ళి వైద్యం చేయించుకుని వచ్చారంటే ఏదో పెద్ద జబ్బు వచ్చిందని అనుకునేవారు. ఈ రోజుల్లో తుమ్మినా, దగ్గినా కొంచెం వళ్ళు వెచ్చబడినా వెంటనే డాక్టరు దగ్గరకు పరుగెడుతున్నారు తప్పితే అది దేనివల్ల వచ్చింది? ముందు మనం ఏం చేస్తే తగ్గుతుంది? అనే ఆలోచనే రావడం లేదు. డాక్టరు దగ్గరకు ప్రతినిత్యం వచ్చే కేసుల్లో చాలా వరకు మందు అవసరం లేకుండా ఆహారనియమాలు పాటిస్తే, కొంత రెస్ట్ తీసుకుంటే తగ్గిపోయేవే ఉంటూ ఉంటాయి. చిత్రమేంటంటే డాక్టరు అదే సలహా ఇచ్చి పంపివేస్తే మన వాళ్ళకు నచ్చదు. ఏదో మందు వేస్తాడని వస్తే ఇలా సలహాలిచ్చి పంపుతున్నాడేంటని తిట్టుకుంటారు. పైగా ఏదన్నా వస్తే వెంటనే అది మాయమైపోవాలనే మనస్తత్వం మనలో ఉంది. కాబట్టి నొప్పి తగ్గడానికి, జ్వరం తగ్గడానికి 4, 5 రకాల మందులు వారు వ్రాసి ఇస్తారు.

ఇలా వచ్చిన ప్రతి దానికి మందులు వాడడం, చీటి మాటికి డాక్టర్ల దగ్గరకు పరుగులు పెట్టడం మనమే అలవాటు చేసుకున్నాం. అవసరానికి ఆదుకోవడానికి డాక్టర్లు, హాస్పిటల్స్ ఉన్నాయని గుర్తించి వెళ్ళాలి. ఉదాహరణకు మన ఇల్లు అంటుకున్నప్పుడు మనమే నీళ్ళు పోసుకుని ఆర్పడానికి ప్రయత్నించి సాధ్యం కాదనుకున్నప్పుడు అగ్నిమాపక దళం వారికి కబురు చేస్తాం. అదే విధంగా అనారోగ్యం వచ్చినపుడు మనం ముందుగా దాని నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుని మనవల్ల కానప్పుడు డాక్టరుతో వైద్యం చేయించుకోవాలి. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందన్నామని ఆరోగ్యం డాక్టర్ల చేతుల్లో లేదన్నామని రేపట్నుండీ ఆ మందులన్నీ మానేయడమో, హాస్పిటలకు, డాక్టరు దగ్గరకు వెళ్ళకుండా మొండికేయడమో చేయకండి. వాటి అవసరం. వైద్యులవసరము ఎంతైనా ఉంది. మన చేతిలో ఉన్నది మనం చేయాలి. వైద్యుల చేతిలో ఉన్నది వైద్యులు చేస్తారు. ఎవరిపని వారు చేస్తే మర్యాదగా ఆరోగ్యం వస్తుంది.

మనవంతు ఏమీ చేయకుండా అంతా మందులవల్ల, డాక్టర్ల వల్లే వస్తుందని ఎంతోమంది, వారి చేతుల్లో ఉన్నవాటిని అశ్రద్ధ చేస్తున్నారని ఈ మాటలు తెలియజెయ్యాల్సి వచ్చింది. చివరకు వైద్యులు కూడా వారి ఆరోగ్య సంరక్షణకు మందులపై, హాస్పిటల్స్ పై ఆధారపడకుండా, శ్రద్ధతో ప్రతిరోజు వ్యాయామం చేయడం, ఆహారం తేలిగ్గా తీసుకోవడం, మంచి ఆహారం తినడం మొదలగు నియమాలను క్రమం తప్పకుండా పాటిస్తూ ఉంటారు. మనం ఇప్పుడు ఏ రకమైన వైద్య విధానాన్ని ఆచరిస్తున్నప్పటికీ, రేపట్నుండీ ఆ సలహాలను, మందులను పూర్తిగా ఆవకుండా కొనసాగిస్తూ మన ఇంట్లో ఆరోగ్యాన్ని బాగుచేసుకునే మంచి పనులు చేస్తూ ఉండాలి. క్రమేపీ ఆరోగ్యంలో మంచి మార్పులు వస్తూ ఉంటే, వైద్యుల సలహాపై నిదానంగా మందుల అవసరాన్ని తగ్గించుకుంటూ జాగ్రత్త పడాలి. మళ్ళీ మనకెప్పుడన్నా, ఏదన్నా ఆపద వస్తే వెంటనే ఆ సమయానికి సందర్భాన్ని బట్టి, ఏ వైద్య విధానం లాభమనుకుంటే దానిని వెంటనే ఉపయోగించుకోవడం మంచిది.

ప్రతి వైద్య విధానం చూస్తే దేని గొప్పదనం దానికి ఉంటుంది. కాబట్టి మీరు ఏ వైద్య విధానాన్ని వాడినా మీ ఆరోగ్యాన్ని మీ ఇంట్లో ప్రతిరోజు మీ చేతులతో సంరక్షించుకునే ప్రయత్నం మానకూడదు. మబ్బులలో నీళ్ళు ఉన్నాయని, ముంతలో నీళ్ళను ఒలకపోసుకోకూడదు. అనారోగ్యం కలగకుండా చేసుకోవాల్సింది. మనమే కాని వైద్య విధానాలు కావు. కాబట్టి మనం మంచి మనస్సులో, శ్రద్ధతో, ఆరోగ్య సంరకు యజ్ఞాన్ని ప్రారంభిద్దాం.

రచయిత: డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

రేపు ఆరోగ్యం ఎవరి చేతుల్లో ఉంది? అనే అంశం గురించి తెలుసుకుందాం….

మీ ఆరోగ్యం-మీ చేతుల్లో వ్యాసాలలో ఇంతక్రితం వ్యాసం ఆరోగ్యానికి, డాక్టర్ కి ఉన్న సంబంధం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మంతెన ఆరోగ్య సలహాలు అన్నీ చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి

——-

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి