- వ్యవసాయ, పోలీస్ శాఖ అధికారులను నిలదీసిన సర్పంచ్ సుబ్బారావు
బోనకల్, జూలై 18(జనవిజయం):
బోనకల్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం వాడి వేడిగా మంగళవారం జరిగింది. ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకొచ్చిన పరిష్కారం అవడం లేదని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. చొప్పకట్లపాలెం సర్పంచ్ ఎర్రంశెట్టి సుబ్బారావు ఇటీవల అకాల వర్షాల వల్ల మొక్కజొన్న దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం ప్రకటించిన సాయం జాబితాలో తన పేరు ఎలా వచ్చిందని వ్యవసాయ అధికారి అబ్బూరి శరత్ బాబును నిలదీశారు. నేను గత 20 రోజుల క్రితం ఒక ప్రజా ప్రతినిధిగా వ్యవసాయ శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ నువ్వు ఇంతవరకు వివరణ ఇవ్వకపోవడం దారుణం అన్నారు. వాట్సాప్ గ్రూపులో గ్రామానికి చెందిన కొందరు సర్పంచ్ వ్యవసాయ శాఖ అధికారులు కుమ్మక్కై పరిహారం సొమ్మును కాజేసారని ప్రచారం చేశారని ఆయన తెలిపారు. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు సమగ్ర నివేదిక ఇవ్వకపోతే త్వరలో వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. సర్వసభ్య సమావేశానికి ఎస్ఐ రాకపోవడంపై సర్పంచ్ సుబ్బారావు ఎంపీడీవోను ప్రశ్నించగా వెంటనే ఎంపీడీవో పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేయగా ఏఎస్ఐ నాగరాజు సర్వసభ్య సమావేశానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ కు కొత్తగా వచ్చిన ఎస్ఐ ప్రజా ప్రతినిధులను గౌరవించడం లేదన్నారు. పిటిషన్ ఇచ్చి నెల రోజులు గడుస్తున్నా కనీసం రసీదు కూడా ఇవ్వలేదు అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ మండలంలో లేదా అని ఆయన ప్రశ్నించారు. మండలంలో పలువురు ప్రజా ప్రతినిధులు గ్రామంలో కరెంటు సమస్య ఉందని, చేసిన పనులకు బిల్లులు రావడం లేదని అధికారులకు తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, మోదుగు సుధీర్ బాబు, బోడెపుడి వేణు మాధవ్, ఆర్ ఐ సత్య నారాయణ, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.