– ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్
ఖమ్మం,ఫిబ్రవరి 23(జనవిజయం): అధికారులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ, విధులు సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అన్నారు.గురువారం ఐడిఓసి లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ఫైళ్ల నిర్వహణ,పాత రికార్డుల పై చర్యలు,ఈ-ఆఫీస్,పాత కార్యాలయాల ఖాళీ, కార్యాలయాల భవన సముదాయ నిర్వహణపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,అధికారులు,సిబ్బంది సమయపాలన చేయాలని, కార్యాలయానికి వచ్చిన తర్వాత మధ్యాహ్న భోజనం ఇతరత్రా అని కార్యాలయం విడిచి వెళ్లుట చేయరాదని అన్నారు.జిల్లా అధికారులు,వారి వారి సిబ్బందితో సమావేశమై ఈ విషయమై సిబ్బందికి సూచనలు చేయాలని,అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని ఆయన తెలిపారు.కార్యాలయ ఫైళ్ల నిర్వహణ ఈ-ఆఫీస్ ద్వారా చేపట్టాలని, కాగిత రహిత ఫైళ్ళతో భద్రతనే కాక,రికార్డు మార్పు చేయడానికి ఆస్కారం ఉండదని ఆయన అన్నారు.కొన్ని శాఖల వారు కలెక్టరేట్ కి సమర్పించే ఫైళ్లు ఈ-ఆఫీస్ ద్వారా, మిగతా ఫైళ్లు మాన్యువల్ గా నిర్వహిస్తున్నారని,ఇలాకాక, అన్ని ఫైళ్లు ఈ-ఆఫీస్ ద్వారానే చేపట్టాలని ఆయన తెలిపారు.పాత ఫైళ్ల నిర్వహణ విషయంలో ఫైళ్లను విషయాన్ని బట్టి ఎల్డిస్,డీడీస్,ఆర్డిస్ గా విభజించి సమయానుసారం భద్రత, ఖండనం నకు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.స్వంత భవనాలు కలిగిన కార్యాలయాలు,ఐడిఓసి కి తరలిన నేపధ్యంలో,వారి పాత భవనాలు,ఇతర కార్యాలయాలకు కేటాయింపు చేసినందునందున,ఆయా కార్యాలయాలు వెంటనే ఖాళీ చేసి,అప్పగించాలని కలెక్టర్ తెలిపారు.కార్యాలయాల్లో,పరిసరాల్లో పరిశుభ్రతను పాటించాలన్నారు.అంతకుముందు కలెక్టర్ కలెక్టరేట్ లోని వివిధ విభాగాల పర్యవేక్షకులు, సిబ్బందితో సమావేశమై విభాగాల వారిగా రన్నింగ్ ఫైళ్లు, రికార్డు రూం లో భద్రపరచిన ఫైళ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాల విభజనకు పూర్వం ఉన్న ఫైళ్లు, జిల్లాల విభజన జరిగినందున ఏ జిల్లాకు సంబంధించిన ఫైళ్లను ఆయా జిల్లాలకు పంపించే ఏర్పాట్లు చేయాలన్నారు. మంచి భవనం, కంప్యూటర్లు,సదుపాయాలు కల్పించినందున విధులు మెరుగ్గా నిర్వర్తించాలని కలెక్టర్ అన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి,ఎన్.మధుసూదన్,జిల్లా రెవిన్యూ అధికారిణి ఆర్.శిరీష,జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో శ్రీనివాసరావు,కలెక్టరేట్ వివిధ పర్యవేక్షకులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.