ఖమ్మం, ఆగస్టు 13(జనవిజయం): భారత స్వాతంత్ర వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలలో భాగంగా ఈ నెల 14 నుండి 24 వరకు రాష్ట్రంలోని సినిమా థియేటర్ లలో జాతిపిత మహాత్మాగాంధీ చలనచిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించుటకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని జిల్లా విద్యా శాఖ అధికారి సోమశేఖరశర్మ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, దేశ స్వాతంత్రం కోసం ఎంతో పోరాడిన జాతిపిత మహాత్మాగాంధీ జీవిత చరిత్రను తెలియజేసే గాంధీ చిత్రాన్ని కేవలం విద్యార్ధులకు మాత్రమే కాకుండా వారి తల్లిదండ్రులు, సాధారణ ప్రజలు కూడా వీక్షించే విధంగా సినిమా థియేటర్ లలో ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వ నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం గాంధీ చిత్రాన్ని సినిమా థియేటర్ లలో ప్రదర్శించాలని చెప్పారు. ఈ నెల 14 వ తేదీన ఉదయం 8 నుండి 11.30 గంటల వరకు చిత్ర ప్రదర్శన ఉంటుందని, 15 వ తేదీన ఇండిపెండెన్స్ డే సందర్బంగా, 20 వ తేదీన ఆదివారం కారణంగా చిత్ర ప్రదర్శన ఉండదని ఆయన అన్నారు. తిరిగి 16 వ తేదీ నుండి 24 వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటలకు వరకు చిత్ర ప్రదర్శన ఉంటుందని విద్యాధికారి తెలిపారు. జిల్లాలోని సినిమా థియేటర్ ల నిర్వహకులు గాంధీ చలన చిత్ర ప్రదర్శన ఎలాంటి ఆటంకాలు లేకుండా సమన్వయంతో విజయవంతం చేయాలని ఆయన అన్నారు.