– సీఎం హామీని గౌరవిస్తాం
– మీడియాపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
– టీడబ్ల్యూజేఎఫ్
హైదరాబాద్, ఆగష్టు 22 (జనవిజయం): జర్నలిస్టులకు ఇళ్ళస్థలాలు ఇచ్చే ప్రక్రియ చివరి దశలో ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విషయాన్ని తాము మరోసారి నమ్ముతున్నామని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిడి సోమయ్య, బి. బసవపున్నయ్య తెలిపారు. సీఎం మాటను గౌరవించి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యపై ఈనెల 24న తలపెట్టిన రాష్ట్ర స్థాయి సదస్సును కొద్ది రోజులు వాయిదా వేస్తున్నట్లు వారు ఒక ప్రకటనలో తెలిపారు. ఇళ్ళస్థలాలు కేటాయింపుపై ప్రభుత్వం స్పష్టమైన విధాన ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్
పత్రికలు, మీడియాలుపై చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. జర్నలిస్టులు అనుదినం జన స్వరాన్ని వినిపించే దేశోద్ధారకులని, ప్రతి క్షణం ప్రజలపక్షాన రాసే కలం కార్మికులని, అలాంటి మహోన్నత బాధ్యతల్లో ఉన్న జర్నలిస్టులను పాములతో పోల్చడం క్షంతవ్యం కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉంటూ సమాజానికి, ప్రజలకు సేవ చేస్తున్నారని, పత్రికా వ్యవస్థను రాజ్యాంగం ఫోర్త్ ఎస్టేటుగా గుర్తించిందని, అలాంటి వ్యవస్థ పట్ల తాము అధికారంలో ఉన్నామని ఇష్టానుసారం మాట్లాడటం తగదని వారు పేర్కొన్నారు.