Tuesday, October 3, 2023
Homeమై వాయిస్తుమ్మల మొండిపట్టు వీడతారా?

తుమ్మల మొండిపట్టు వీడతారా?

(పల్లా కొండలరావు, ఖమ్మం)

పాలేరులోనే పోటీ చేయాలనే మొండిపట్టుదలను మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీడనున్నారా? ఈమేరకు ఆయనను ఒప్పించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది. తుమ్మల ప్రభావంతో తెలంగాణలో దాదాపు 30 నియోజక వర్గాలలో కాంగ్రెస్ గెలుపు సునాయాసం అవుతోందని అధిష్ఠానం అంచనాకు వచ్చిందంటున్నారు. తుమ్మల అనుభవాన్ని కేవలం ఖమ్మం జిల్లాకు పరిమితం చేయకుండా రాష్ట్రవ్యాపితంగా ఉపయోగించాలని కాంగ్రెస్ అధిష్ఠానం పావులు కదుపుతోంది. రాహుల్ గాంధీ ఆదేశాలమేరకు మాణిక్ రావు ఠాక్రే తుమ్మల వ్యవహారాన్ని చూస్తున్నారంటున్నారు. తుమ్మల ఎక్కడ పోటీ చేసినా గెలిచేలా ఉండాలని , అధికారంలోకి వస్తే మంత్రిని చేసి ఆయన అనుభవాన్ని వాడుకోవడం ద్వారా కమ్మ సామాజిక వర్గంలో కాంగ్రెస్ కు పట్టు పెంచుకోవాలని చూస్తోంది.

ఇప్పటికే ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరికతో కాంగ్రెస్ జోష్ లో ఉంది. ఇపుడు తుమ్మల రాకతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 కి 10 సీట్లు కాంగ్రెస్ ఖాతాలోకి ఈజీగా రాబట్టవచ్చన్నది కాంగ్రెస్ అధిష్ఠానం అంచనాగా ఉంది. తుమ్మల నాగేశ్వరరావును పాలేరు కంటే కూకట్ పల్లి నుండి పోటీ చేయించాలని కాంగ్రెస్ మంతనాలు ప్రారంభించింది. తుమ్మల మాత్రం తాను ఎక్కడైతే అవమానించబడ్డానో అక్కడే ప్రజాక్షేత్రంలో గెలిచి చూపించాలనే మొండిపట్టుదలతో ఉన్నారు. ప్రస్తుతం కామ్రేడ్లతో కూడా పొత్తు పెట్టుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ ఖమ్మం జిల్లాలో సీట్ల సర్దుబాటు విషయం కొత్త తలనెప్పిగా మారింది. ఈ జిల్లాలో సిపిఐ, సిపిఎంలకు చెరో సీటు కేటాయించక తప్పని పరిస్థితి కాంగ్రెస్ ముందు ఉందని తాజా పరిస్తితులు చెబుతున్నాయి.

ఖమ్మం సీటును తమ్మినేని వీరభద్రంకు కేటాయిండం ద్వారా సిపిఎం ను సంతృప్తి పరచాలనే కొత్త ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లుగా కొత్త ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎట్టి పరిస్తితిలో ఏ ఒక్క సీటునూ పోగొట్టుకోకూడదని కామ్రేడ్లతోనూ పొత్తును కొనసాగించాలని భావిస్తోంది. కొత్తగూడెం సీటును కూడా కూనంనేని సాంబశివరావుకు కేటాయించాల్సి వస్తే ఆ సీటు ఆశిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అక్కడ నుండి తప్పించి పాలేరులో పోటీకి దింపాలని కాంగ్రెస్ చూస్తోంది. కొత్తగూడెంలో జలగం వెంకట్రావు కాంగ్రెస్ లోకి వస్తారని ప్రచారంలో ఉన్నా సి.ఎం కేసీయార్ తాజాగా కొత్తగూడెం విషయంలో పునరాలోచనలో పడినట్లు సమాచారం. సుప్రీంకోర్టు తీర్పు వనమాకు వ్యతిరేకంగా వస్తే సీటు నీదేనని లేకుంటే ఎంఎల్సీ ఇస్తానని తొందరపడొద్దని జలగంకు కేసీయార్ నచ్చజెప్పారని అంటున్నారు. వనమాకు బి.ఫామ్ ఇవ్వడం కష్టమేననే వాదనలు వినిపిస్తున్నాయి. జలగం కాంగ్రెస్ లోకి రాకుంటే కూనంనేనికి కొత్తగూడెం కేటాయిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనా కాంగ్రెస్ చేస్తోంది. కాంగ్రెస్ క్యాడరు, లీడర్లు మాత్రం కామ్రేడ్లకు ఖమ్మం జిల్లాలో జనరల్ స్థానాలు కేటాయించేందుకు అంత ఇష్టం చూపడం లేదు.

మరోవైపు ఖమ్మం జిల్లా రాజకీయాలు సిఎం కేసీయార్ ను కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా జిల్లాలోని 10 నియోజకవర్గాలను ప్రభావితం చేయగల తుమ్మల నాగేశ్వరరావు విషయంలో చివరికంటా ప్రయత్నాలు కొనసాగించాలనే చూస్తున్నారు. రాజ్యసభ, మంత్రి పదవి ఆఫర్ లను కూడా తుమ్మల త్రిప్పికొట్టారని సమాచారం. ఆయన కాంగ్రెస్ లో చేరాలనే నిర్ణయం ఖరారైందని సీటు విషయంలోనే తేల్చుకోలేకపోతున్నారని తెలుస్తోంది. తుమ్మలను ఓడించడంలో కేటీయార్ పాత్ర ఉందని తాజాగా తుమ్మల అనుయాయులు ఆరోపిస్తుండడం కొసమెరుపు. ప్రస్తుత మంత్రి పువ్వాడ అజెయ్ ద్వారా మంత్రి , ముఖ్యమంత్రి తనయుడు కేటీయార్ తుమ్మలను ఓడించారన్నది తాజాగా బలంగా వినిపిస్తున్న వాదన. కొన్ని సందర్భాలలో ఆఫ్ ద రికార్డుగా ఉండే సందర్భాలలో తుమ్మల దురుసుగా మాట్లాడతారన్నది తెలిసిన విషయమే. కేసీయార్ కాకుంటే సీఎంగా హరీష్, కేటీయార్ లలో ఎవరిని సమర్ధిస్తారని తుమ్మలను ప్రశ్నించగా ఉద్యమంలో కీలక పాత్ర వహించినవాడు, సీనియర్ అయిన కారణంగా హరీష్ రావునే తాను సి.ఎం గా సమర్ధిస్థానని తుమ్మల కుండబద్దలు కొట్టారని చెబుతున్నారు. అది మనసులో పెట్టుకున్న కేటీయార్ అప్పటినుండి తుమ్మల ప్రాధాన్యం తగ్గించేందుకు అన్నివిధాలుగా పువ్వాడ అజెయ్ కుమార్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారన్నది పాలేరు నియోజకవర్గానికి చెందిన తుమ్మల అభిమాని ఒకరు జనవిజయంతో చెప్పారు.

ఇది తెలిసే తుమ్మలను బుజ్జగించే పని ఉన్నపుడు మాత్రం కేసీయార్ హరీష్ రావును ప్రయోగిస్తుంటారు. ప్రస్తుతం కూడా హరీష్ రావును, ఎం.పి నామా నాగేశ్వరరావుల ద్వారా కేసీయార్ చేసిన ప్రయత్నాలు కూడా బెడిసికొట్టాయి. ఏ ఆఫర్ ఇచ్చినా ఇంత జరిగాక మరోసారి కేసీయార్ చేతిలో మోసపోవద్దని తుమ్మలకు ఆయన అనుయాయులు తేల్చిచెబుతున్నారు. కేటీయార్ కు తుమ్మలను బిఆర్ఎస్ లో ఉంచుకోవడం ఇష్టం లేదంటున్నారు. మనసులో ఏమున్నా కేసీయార్ మాత్రం పైకి మాత్రం తుమ్మలను బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తూనే నష్ట నివారణ చర్యలు చేపట్టారు.

ఈ నేపథ్యంలో మీరు కాంగ్రెస్ లోకి వెళ్లడం ఇష్టం లేకుంటే ఇండిపెండెంట్ గా పాలేరు లేదా ఖమ్మంలలో ఎక్కడ నుండి పోటీ చేసినా కష్టపడి గెలిపించుకుంటామని తుమ్మలకు అభిమాను లు తెగేసి చెప్పారు. స్వగ్రామం గండుగలపల్లిలోనూ, గంగారం ఫామ్హౌజ్ లోనూ తుమ్మల తన అభిమానులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాలేరు నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా తుమ్మలను కలవడం విశేషం. తుమ్మల సెప్టెంబరు మొదటివారంలో రాహుల్ గాంధీ సమక్షంలో పెద్ద ఎత్తున తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరడానికి దాదాపుగా నిర్ణయం ఖరారు చేసుకున్నారు. కేసీయార్ ఇచ్చే ఏ ఆఫర్ ను ఆయన ఖాతరు చేయడం లేదు. ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, అశ్వారావుపేట, సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాలలోని తన అనుచరులతో రానున్న ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చించినట్లు చెబుతున్నారు.

తాను ఎక్కడ నుండి పోటీ చేయాలో మాత్రం తుమ్మల తేల్చుకోలేకపోతున్నారు. ఆయన నిర్ణయం తేలితే వామపక్షాలతో పొత్తు విషయంలోనూ ఖమ్మం జిల్లాలో ఏ సీటులో ఎవరిని పోటీకి దింపాలనే దానిలోనూ క్లారిటీ వస్తుందని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. కూకట్ పల్లిలో పోటీ చేయడం వల్ల అందరికి ప్రయోజనం ఉంటుందని లెక్కలు వేసి మరీ తుమ్మలను ఒప్పించేందుకు కాంగ్రెస్ నేతలు చేస్తున్న తాజా ప్రయత్నాలు ఫలిస్తాయా? అన్నది తేలేందుకు కొద్దిరోజులు సమయం పట్లవచ్చు. తుమ్మల కూడా ఏది బెటర్ అనేదానిలో తలమునకలైనట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments