భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్ట్ 04 (జనవిజయం):ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ డాక్టర్ వినీత్ పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా వాహనాలను నడుపుతూ సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తిస్తే చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోవాలనీ ఆయన పోలీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎస్పీ డా.వినీత్.జి కొత్తగూడెం, భద్రాచలం పట్టణ ట్రాఫిక్ పోలీస్ అధికారులు, సిబ్బందితో ఎస్పీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారు ఎవరైనా సరే ఉపేక్షించవద్దని ఆదేశించారు. వాహనదారులకు ట్రాఫిక్ నియమ నిబంధనలపై నిరంతరం అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని అన్నారు. నిత్యం రోడ్డు ప్రమాదాల బారిన పడి ఎంతోమంది తమ విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని,కొంతమంది విగత జీవులుగా మారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అన్నారు. జిల్లాలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి అక్కడ ప్రమాద సూచిక గుర్తులను ఏర్పాటు చేయాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై నిత్యం వాహన తనిఖీలు చేపట్టి చట్టపరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.మద్యం సేవించి వాహనాలను నడుపుతూ పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్, ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఎక్కువసార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ పట్టుబడిన వారి లైసెన్సు లను రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్, ఎస్బి ఇన్స్పెక్టర్ నాగరాజు, కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్సై నరేష్, భద్రాచలం ట్రాఫిక్ ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.