భద్రాచలం బిఆర్ఎస్ పార్టీకి తుమ్మల వర్గీయుల గండం
భద్రాచలం, 30 ఆగస్ట్(జనవిజయం) : కమ్యూనిస్టు లకు కంచుకోటగా ఉన్న భద్రాచల నియోజకవర్గం 2018 ఎన్నికల్లో మూడవస్థానానికి నెట్టివేయబడి అప్పటి టిఆర్ఎస్ పార్టీ అనూహ్యంగా రెండవ స్థానంలో ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
2014 ఎన్నికల్లో సిపిఎం కి 57,750 ఓట్లు తెలుగుదేశం పార్టీకి 55,935 ఓట్లు , కాంగ్రెస్ కి 22000 ఓట్లు రాగా టిఆర్ఎస్ పార్టీకి కేవలం 8700 ఓట్లు వచ్చాయి.కానీ 2018 ఎన్నికల్లో భిన్నంగా 35,961 కైవసం చేసుకోవడం కేసీఆర్ పాలన పై ప్రజల్లో విశ్వాసం తో పాటు టిఆర్ఎస్ పార్టీ నాయకుల సమిష్టి కృషికి నిదర్శనంగా కనబడుతోంది. అంతే కాదు 2014 లో మూడవ స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 2018 లో 47700 ఓట్లుసాధించి విజయం పొందడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
భద్రాచల నియోజకవర్గంలో 2018 లో టిఆర్ఎస్ పార్టీకి ఉన్న పరిస్థితికి ఇపుడున్న బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి చాలా భిన్నంగా ఉంది.బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు భద్రాచల నియోజకవర్గ ఇంచార్జి గా చేస్తూ మాజీ ఎం.పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరుడి గా ముద్ర పడిన డాక్టర్ తెల్లం వెంకట్రావు పొంగులేటి తో పాటు కాంగ్రెస్ తీర్థం తీసుకోవడం..అనతి కాలంలోనే తిరిగి బిఆర్ఎస్ గూటికి చేరుకోవడం అంతా శరవేగంగా జరిగిపోయింది. ఇంత వేగంగా జరిగిన రాజాకీయ పరిణామాలను ఇటు పార్టీ కార్యకర్తలు మరియు నియోజక వర్గ ప్రజలు జీర్ణించుకునేలోగా..మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు పార్టీ అధిష్టానంపై ధిక్కార స్వరాన్ని తీవ్రతరం చేయడం ఉమ్మడి ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీలో ఓ పెద్ద పిడుగు పడినట్లనిపించింది.ఆ ప్రభావమే భద్రాచలం నియోజవర్గంలో బిఆర్ఎస్ పార్టీ పై తీవ్రంగానే పడబోతుంది అనడంలో సందేహంలేదు.
ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటూ…ఏ వివాదాలకు వెళ్ళకుండా ఉండే తుమ్మల వర్గీయులను భద్రాచల నియోజకవర్గంలో తక్కువ అంచనా వేయడానికి వీలులేదు.తుమ్మలకు ప్రధాన అనుచరుడు ఎస్.ఏ.రసూల్ కి 2018 ఎన్నికల్లో దుమ్ముగూడెం మండల ఇంచార్జి గా వ్యవహరించినా ..తనదైన శైలిలో నియోజకవర్గంలో ఉన్న తన పాత పార్టీ అయిన టిడిపి పరిచయాలను ఉపయోగించి టిఆర్ఎస్ పార్టీని ఎన్నికల్లో ద్వీతీయ స్థానంలో నిలబెట్టడంలో తన వంతు కృషి చేశాడు అనడానికి…దుమ్ముగూడెం మండలంలో టిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్న ఓట్లే నిదర్శనం.ఎన్నికల అనంతరం ఓ సందర్భంలో ఇప్పటి బిఆర్ఎస్ పార్టీ భద్రాచల నియోజకవర్గ ఇంచార్జి మాజీ ఎం.ఎల్.సి బాలసాని లక్ష్మినారాయణ దుమ్ముగూడెం పార్టీ కార్యాలయానికి వెళ్లగా ..పార్టీ కార్యాలయం తాళాలు తీయకపోవడం వలన వెనుదిరిగి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇప్పటి పరిస్థితి గమనిస్తే బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తెల్లం భద్రాచలం పట్టణంలో ఎన్నికల ప్రచారం లో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో బాలసాని వర్గీయులుగా ముద్ర పడిన కొందరు నాయకులు కనబడకపోవడంతో సామాన్య కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు.
ఏది ఏమైనప్పిటికీ అధిష్టానం ఈ గందరగోళ పరిస్థితులను సరిచేయకపోతే..విద్యావంతుడు,అజాత శత్రువు, సున్నిత స్వభావం గల డాక్టర్ తెల్లంకు ఈ ఎన్నికలు ముళ్ల బాటే అని కొందరు పార్టీ అభిమానులు అనుకుంటున్నారు.అంతే కాదు బిఆర్ఎస్ పార్టీ లో జరుగుతున్న అన్ని పరిణామాలను సునిశితంగా పరిశీలిస్తున్న వామపక్ష పార్టీలు వారికి అనుగుణంగా మార్చుకునే అవకాశం లేకపోలేదు అని కొందరి రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.