Saturday, February 24, 2024
Homeసినిమాతెలుగు సినిమా ఉన్నంత కాలం నిలచే పేరు హీరో కృష్ణ

తెలుగు సినిమా ఉన్నంత కాలం నిలచే పేరు హీరో కృష్ణ

తెలుగు సినిమా ఉన్నంత కాలం నిలచే పేరు హీరో కృష్ణ

మే31. సూపర్ స్టార్ కృష్ణ అభిమానులకు పండుగరోజు. ఆరోజు హీరో కృష్ణ పుట్టిన రోజు. గత ఏడాది నవంబరు 15న ఆయన పరమపదించారు. భౌతికంగా కృష్ణ లేకుండా జరుగుతున్న మొదటి పుట్టినరోజు మే31,2023. పద్మాలయా సంస్థ 52 ఏండ్ల క్రితం నిర్మించిన మోసగాళ్లకు మోసగాడు సినిమా ఆయన స్మృతి కానుకగా రీరిలీజ్ చేస్తున్నారు. 4కే టెక్నాలజీతో ఈ సినిమాను ప్రపంచవ్యాపితంగా రీరిలీజ్ చేస్తుండడం విశేషం. దాదాపు 350 చిత్రాలలో హీరోగా నటించిన కృష్ణ కెరీర్ లో అనేక ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. నటుడిగా కంటే మనసున్న మంచి వ్యక్తిగా, నిర్మాతల మంచి కోరే వ్యక్తిగా పేరుంది. ఎక్కువ సినిమాలు చేయడం ద్వారా ఇండస్ట్రీలో అనేకమందికి ఉపాధి దొరుకుతుందని భావించి సినిమాలు చేసిన కృష్ణను ఇండస్ట్రీ కూడా అదే స్థాయిలో ప్రేమించింది.

వివాదరహితుడిగా, అజాత శత్రువుగా పేరున్న కృష్ణ కెరీర్ ఎపుడూ సాహసాలు, సంచలనాలతో నిలిచేది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాపితంగా నిలిపిన కృష్ణ టెక్నాలజీ పరంగా తెలుగుతెరకు పరిచయం చేయడంలో ముందుండేవారు. కొత్త నటులను, దర్శకులను, నిర్మాతలను ప్రోత్సహించి ఆదరించేవారు. సినీ కార్మికులను ప్రేమతో చూసుకునేవారు. ఆర్ధికంగా వెనుకబడ్డవారికి ఇతోధికంగా సహకారం అందించేవారు. నేను వ్రాసిన ప్రతి అక్షరానికి వెలకట్టి ఇచ్చిన ఏకైక వ్యక్తి అని, తెలుగు సినిమా పరిశ్రమలో ఎందరున్నారు మంచివారు మన కృష్ణ లాంటి కొందరు తప్ప అని మహాకవి శ్రీశ్రీ వ్యాఖ్యానించడాన్ని బట్టి కృష్ణ గారి మంచితనాన్ని అవగాహన చేసుకోవచ్చు.

ప్రతి రోజూ 3 షిఫ్టులలో దాదాపు 10 ఏండ్లు పనిచేశారాయన. ఒక ఏడాది 18 సినిమాలు విడుదలయ్యాయి. కృష్ణ సినిమాలకు కృష్ణ సినిమాలే పోటీగా నడిచేవి. కొన్ని సెంటర్లలో ఉన్న అన్ని థియేటర్లలో కేవలం సూపర్ స్టార్ కృష్ణ సినిమాలే ఆడడం అప్పట్లో విశేషంగా చెప్పుకునేవారు. ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్ ల హవా నడుస్తున్న కాలంలో తొలి సినిమా తేనెమనసులు తో హిట్ అందుకున్న కృష్ణ మూడో సినిమా గూఢచారి 116తో ఒకేసారి స్టార్ గా ఎదిగారు. అప్పటిదాకా వస్తున్న మూసధోరణికి భిన్నంగా తెలుగు సినిమా ట్రెండ్ పరుగులు తీయడం మొదలు పెట్టింది.

కృష్ణ సినిమా నిర్మాణంలో 24 క్రాఫ్ట్స్ పై పట్టు సాధించారు. సినిమాను అమితంగా ప్రేమించిన ఆయన నటుడిగానే గాక నిర్మాతగా, దర్శకుడిగా, ఎడిటర్ గా, స్టూడియో అధినేతగా రాణించారు. తెలుగులో అత్యధికంగా మల్టీస్టారర్ సినిమాలలో నటించిన ఘనత కూడా కృష్ణదే. రామ్మోహన్,ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్, ఎస్.వి.రంగారావు, కాంతారావు, సత్యనారాయణ,శివాజీగణేషన్,శోభన్ బాబు, కృష్ణంరాజు, రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, సుమన్, రాజశేఖర్ వంటి నటులతో కలిసి ఆయన మల్టీస్టారర్ సినిమాలు చేశారు. ఎన్టీయార్ తో కలసి చేసిన దేవుడు చేసిన మనుషులు, శోభన్ బాబుతో కలసి చేసిన ముందడుగు లు ఇండస్ట్రీ హిట్ లుగా నిలిచాయి.

కృష్ణ సరసన అత్యధిక సినిమాలలో విజయనిర్మల, జయప్రద, శ్రీదేవిలు హీరోయిన్ లుగా నటించారు. జమున నుండి మొదలుకుని ఇంద్రజ వరకు దాదాపు 85మంది హీరోయిన్లతో నటించారు. గూఢచారి 116,అసాధ్యుడు, అల్లూరి సీతారామరాజు, పండంటి కాపురం, పాడిపంటలు, మోసగాళ్ళకు మోసగాడు, మాయదారి మల్లిగాడు, ఊరుకి మొనగాడు, సింహాసనం, ఈనాడు, అగ్నిపర్వతం, వజ్రాయుధం, ప్రజారాజ్యం, కిరాయి కోటిగాడు, ముందడుగు,కిరాయి అల్లుడు, దొంగోడొచ్చాడు, నెంబర్ వన్, పల్నాటి సింహం, కంచుకాగడా, పచ్చని సంసారం, పచ్చని కాపురం,ముద్దాయి వంటి ఎన్నో హిట్ సినిమాలున్నాయి.

తన అభిమాన నటుడు ఎన్టీయార్ అని గర్వంగా చెప్పుకునే కృష్ణ రాజకీయంగా ఆయనను విభేదించారు. జై ఆంధ్రా ఉద్యమంలోనూ, కాంగ్రెస్ లో చేరినపుడు కృష్ణ ఎన్.టి.ఆర్ ను విభేదించి పనిచేశారు. అల్లూరి సీతారామరాజు సినిమా విషయంలో ఏర్పడిన మనస్పర్ధలు కారణంగా కృష్ణతో ఎన్.టి.ఆర్ 10 ఏండ్లు మాట్లాడలేదు. ఎన్.టి.ఆర్ తో కలసి 9 సినిమాలలో నటించగా అన్నింటిలోనూ ఆయన తమ్ముడిగానే నటించడం విశేషం. నిజజీవితంలో కూడా ఎన్.టి.ఆర్ కృష్ణను తమ్ముడూ అనే ఆప్యాయంగా పిలిచేవారు.

రాజీవ్ గాంధీ పిలుపు మేరకు కృష్ణ కాంగ్రెస్ లో చేరారు. ఆయన ఏలూరు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయడమే గాక కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడానికి దోహదపడ్డారు. రాజీవ్ బ్రతికి ఉంటే కృష్ణ ఏ.పీ సీ.ఎం అయ్యేవారనే టాక్ ఉంది. రాజీవ్ మరణం అనంతరం కృష్ణ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రాజకీయాలలోనూ కృష్ణ దూకుడుగానే ఉన్నారు. ఈనాడు పత్రికను ఆయన బహిరంగంగా విమర్శించేవారు. నా వార్తలు మీ పేపర్ లో వ్రాయవద్దంటూ హెచ్చరించారు.

కృష్ణ సినిమాలలో సాంఘికంతో పాటు పౌరాణిక, చారిత్రక, జానపద, బాండ్ చిత్రాలలో నటించారు. సినిమా వ్యాపారంపై ఆయనకు మంచి పట్టు ఉండేది. తన సినిమాలపై తానే విమర్శలు చేసుకునేవారు. ఎదుటివారి సినిమాలు బాగుంటే ఏమాత్రం భేషజం లేకుండా మెచ్చుకోవడమే గాక బహిరంగంగా ప్రకటించేవారు. బహుశా మన హీరోలలో ఇలా డైనమిక్ గా ప్రవర్తించేవారు లేరనే చెప్పవచ్చు. క్లప్తంగా, ముక్కుసూటిగా, నిర్మొహమాటంగా నిజాలు మాట్లాడేవాడిగా కృష్ణకు పేరుంది.

1974లో అల్లూరి సీతారామరాజు సినిమా నటనకు నంది అవార్డు లభించింది. జ్యోతిచిత్ర సినిమా పత్రిక నిర్వహించిన సూపర్ స్టార్ అవార్డుకు వరుసగా 4 సార్లు కృష్ణనే ఎంపికయ్యారు. వరుసగా కృష్ణనే ఎంపిక అవుతుండడంతో ఆ పత్రిక ఆ పోటీని ఆపేసింది. తొలిసారి ఈ అవార్డు ఎన్.టి.ఆర్ అందుకోగా ఆయన తదుపరి ఏడాది రాజకీయాలలోకి వెళ్లారు. అప్పటినుండి ఇప్పటిదాకా సూపర్ స్టార్ అంటే కృష్ణగారే గుర్తుకు వస్తారు. 1997లో ఫిల్మ్ ఫేర్ జీవిత సాఫల్య పురస్కారం, 2003లో ఎన్.టి.ఆర్ జాతీయ పురస్కారం, 2008లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, 2009లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం లభించాయి. 1976లో కేంద్ర కార్మిక శాఖామంత్రి కె.వి.రఘునాధరెడ్డి చేతుల మీదుగా నటశేఖర బిరుదును అందుకోగా ఆస్ట్రేలియా ప్రభుత్వం కృష్ణను గౌరవిస్తూ ఓ పోస్టల్ స్టాంపును విడుదల చేయడం విశేషం.

ఇలాంటి పురస్కారాలకంటే అభిమానుల ఇచ్చే బిరుదులే కృష్ణను ఎక్కువగా ఆనందపరచేవి. ప్రజా,విప్లవ,సాహస,సంచలన నటుడు, డేరింగ్, డేషింగ్, డైనమిక్ హీరో, ఆంద్రాజేమ్స్ బాండ్, సూపర్ స్టార్, నటశేఖర, నటస్రష్ట హీరో కృష్ణ అంటూ అభిమానులు ఆయా సందర్భాలలో కృష్ణను పిలుచుకునేవారు. అయితే సూపర్ స్టార్ అనేది ఎక్కువగా ఆయన పేరుముందు నిలిచి ఉంది. అదే బిరుదు ఆయన రెండో కుమారుడు మహేష్ బాబును అభిమానులు పిలుస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు కృష్ణ లెగసీని కొనసాగిస్తూ ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్నారు. ఎందరు గొప్ప నటులున్నా అనేక ప్రత్యేకతల రీత్యా తెలుగు సినిమా ఉన్నంతవరకూ హీరో కృష్ణ ధ‌ృవతారగా నిలిచి ఉంటారు. ఆయన స్థానాన్ని వేరెవరూ భర్తీ చేయలేరు. కృష్ణ గారికి జనవిజయం తరపున ఘన నివాళి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments