భద్రాచలం, ఆగస్ట్ 20 (జనవిజయం): కాంగ్రెస్ పార్టీని వీడి, ఇటీవల బిఆర్ఎస్ లో చేరిన డాక్టర్ తెల్లం వెంకట్రావు దంపతులు ఆదివారం ప్రగతి భవన్ లో సీఎం కేసిఆర్ ను మర్యాద పూర్వకం గా కలిశారు. భద్రాచలం అసెంబ్లీ స్థానం లో బిఆర్ఎస్ టిక్కెట్ తెల్లం కే కేటాయించనున్నట్లు సీఎం భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. తెల్లం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్ధి గా పోటీచేసి ఓడిపోయారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గా ఉన్న తెల్లం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రధాన అనుచరుడి గా ఉన్నారు. పొంగులేటి తో పాటు తెల్లం బిఆర్ఎస్ ను వీడి రాహుల్ గాంధీ సమక్షం లో కాంగ్రెస్ లో చేరారు. తెల్లం భద్రాచలం టికెట్ ఆశించి కాంగ్రెస్ లో చేరారు.
కానీ ప్రస్తుత ఎమ్మెల్యే పోడెం వీరయ్య కే కాంగ్రెస్ టికెట్ వచ్చే అవకాసం ఉన్నందున తెల్లం కాంగ్రెస్ ను వీడారు. బిఆర్ఎస్ టిక్కెట్ ఇస్తామన్న హామీ మీదనే తెల్లం వెంకటరావు బిఆర్ఎస్ లో చేరినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. సీఎం భరోసా ఇచ్చినట్లు తెలుస్తుందటంతో భద్రాచలంలో తెల్లం అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.