Saturday, February 24, 2024
Homeమై వాయిస్తెలంగాణలో ఏపార్టీ అధికారంలోకి వస్తుంది?

తెలంగాణలో ఏపార్టీ అధికారంలోకి వస్తుంది?

తెలంగాణలో ఏపార్టీ అధికారంలోకి వస్తుంది?

– సీ.ఎం కేసీయార్ హ్యాట్రిక్ కొడతారా?
– రేవంత్ ఆశలు నెరవేరతాయా?
– బిజెపి వ్యూహం ఏమిటి?

(పల్లా కొండలరావు,ఖమ్మం)

తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఇది అంత తేలికగా తేల్చేది కాదు. ప్రస్తుతానికి తెలంగాణలో ఇప్పటికి పరిస్తితి ఇలా ఉంది అని మాత్రమే చెప్పగలం. ప్రస్తుతం ప్రధాన పోటినుండి బిజెపి తొలగిపోయింది. కేసీఆర్ ని ఓడించాలి, కవితని అరెస్టు చేయాలి లాంటి కక్షపూరిత కోరికలతో బీజేపీలో చేరిన వారు పునరాలోచనలో పడ్డారు. వారంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వారిని పార్టీ వీడకుండా చూసేందుకు బిజెపి మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటిదాకా కొట్లాటలతో అసహ్యకరమైన రీతిలో ఉన్న కాంగ్రెస్ నేతల్లో ఐక్యత పెరుగుతోంది. కర్నాటక ఫలితాలు, సోనియా వార్నింగ్ అనంతరం రేవంత్, కోమటిరెడ్డి ఐక్యంగా ఉంటున్నారు. జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ పార్టీ గ్రాఫ్ అమాంతంగా పెరిగిందన్నది వాస్తవం. కాంగ్రెస్ లో మరిన్ని చేరికలు పెరగొచ్చు. కాంగ్రెస్ లో కోవర్టుల పట్ల రాహుల్ గాంధీ సీరియస్ అయ్యారు. భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వారు కూడా అనివార్యంగా కలిసి పని చేసేందుకు సిద్ధం అయ్యారు. రేవంత్ రెడ్డికి సీఎం ఛాన్స్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే సీనియర్లను కలుపుకోవాలి, దుడుకు వైఖరి తగ్గించుకోవాలని సోనియా గాంధీ వార్నింగ్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. తాను ఎన్ని మెట్లయినా తగ్గి పనిచేస్తానని రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే తామందరి లక్ష్యమని రేవంత్ ప్రకటించడం గమనార్హం.

అయితే కాంగ్రెస్ లో ఐక్యతారాగం తాత్కాలికమే తప్ప వారి రోగం అంత తేలికగా తగ్గుతుందనడానకి లేదు. గత చరిత్ర ప్రస్తుత పరిస్తితులను బట్టి ఇలా అనక తప్పడం లేదు. రేవంత్ రెడ్డి సి.ఎం కావడం కాంగ్రెస్ లో మెజారిటీ సీనియర్లకు ఇష్టం లేదు. దీనికోసం వారు ఏమైనా చేస్తారు. ముందు ఎన్నికలలో గెలిచాక ఆనక చూసుకోవచ్చులే అన్నట్లు నేతల ధోరణి ఉన్నది. భట్టి విక్రమార్క కూడా సీఎం రేసులో ఉన్నట్లుగా చెపుతున్నారు. అసలు ఈసారి భట్టి విక్రమార్క మధిరలో గెలుస్తారా? అన్నది మరో వాదనగా ఉన్నది. ఆలు లేదూ… చూలూ లేదూ … కోడుకు పేరు సోమలింగం అన్నట్లు అసలు కాంగ్రెస్ గెలిస్తే కదా? సి.ఎం ఎవరనే ముచ్చట అన్నది మరో వాదనగా ఉన్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగినా కేసీయార్ ని ఖచ్చితంగా ఓడించే స్థాయిలో అది ఉందని చెప్పే ధైర్యం కాంగ్రెస్ లోనే లేదన్నది వాస్తవం. రేవంత్ రెడ్డి వంటి ఒకరిద్దరు మినహా కేసీయార్ వైఫల్యాలపై మాట్లాడే నేతలాపార్టీలో లేరు. కేసీయార్ కు ధీటైన నాయకుడూ లేడు. ఉన్న ఒక్క రేవంత్ ను సీఎం క్యాండిడేట్ అని ప్రకటించే ధైర్యం అధిష్ఠానానికి లేదు. ప్రజలలో నిశ్శబ్ధ విప్లవంలా బీఆర్ఎస్ ను గద్దెదించాలన్న కసి కనబడి, అది ఓట్ల రూపంలో మారితే మాత్రం కాంగ్రెస్ గణనీయమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కానీ ఆ పరిస్థితి ఖచ్చితంగా ఉందని చెప్పే పరిస్తితి ప్రస్తుతానికి లేదు.

తెలంగాణలో ఆశలు వదులుకున్న బీజేపీ బీఆర్ఎస్ తో లోపాయికారీ ఒప్పందానికి రెడీ అవుతున్నది. కవిత అరెస్టు కాకుండా ఉండేందుకు కేసీఆర్ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఆ రెండు పార్టీల తాజా వ్యవహారంలో వచ్చిన మార్పులతో మీడియాలో ఈ ప్రచారం హైలెట్ అవుతోంది. జాతీయ స్థాయిలో కేసీఆర్ ను ఎవరూ నమ్మే స్థితిలో లేకపోవడంతో పాటు ఇంటెలిజెన్స్ నివేదికలు వ్యతిరేకంగా ఉండడంతో ఆఖరి నిమిషం దాకా తెలంగాణలో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు కేసీఆర్ వ్యూహాలు పన్నుతున్నారు. ఎవరికి అంతుపట్టని వ్యూహాలతో ప్రత్యర్ధులను ఉక్కిరిబిక్కిరి చేయడంలో కేసీఆర్ ఘనాపాటి. ఒకవేళ హంగ్ వస్తే కాంగ్రెస్ లో చీలికకు ఇప్పటినుంచే ఆయన ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఉత్తమ్, జగ్గారెడ్డి, భట్టి విక్రమార్క లాంటి వాళ్ళ వైఖరిపై కాంగ్రెస్ లోనే నమ్మకం లేదు. అలాగని వారిని ప్రక్కనపెట్టే ధైర్యం చేయలేని దయనీయంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉంది. ప్రజల్లో నిశ్శబ్దంగా ప్రభుత్వ వ్యతిరేకత ఓ విప్లవంలా వస్తే కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అభ్యర్ధుల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిజెపి కూడా మారిన పరిస్తితుల రీత్యా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా ఉండేందుకు బీఆర్ఎస్ తో లోపాయికారీ ఒప్పందానికి రెడీ అయింది. బండి సంజయ్ ని హడావిడిగా తొలగించడానికి కారణమిదేననే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కేసీయార్ అభివృద్ది, సంక్షేమ పథకాలపై ప్రజలలో అంతగా అసంతృప్తి లేదు. రైతుబంధు, దళిత బంధు, ధరణి, రైతు రుణ మాఫీలపై అసంతృప్తి ఉంది. కానీ అంతకు మించి పాలన ఇవ్వగలరన్న నమ్మకం కాంగ్రెస్ పై లేకపోవడం గమనార్హం. మంత్రులు, ఎం.ఎల్.ఏలు, స్థానిక నేతల అవినీతిపైనా, నాయకుల అంతర్గత కుమ్ములాటలు వల్ల ప్రజలు బీఆర్ఎస్పై అసంతృప్తిలో ఉన్నారు. యువతలో మాత్రం బీఆర్ఎస్ పై తీవ్ర అసంతృప్తి ఉంది.

వీటిని అధిగమించేందుకు తాజా సీఎం కేసీయార్ రంగంలోకి దిగారని సమాచారం. కాంగ్రెస్ లో అసంతృప్తి నేతలను తమ గూటికి రప్పించుకునేందుకు, ఎన్నికల అనంతరం కాంగ్రెస్ తరపున గెలిచిన వారిని తమవైపు తిప్పుకునేందుకు ఇప్పటినుండే తీవ్ర కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తుంది. బిజెపి, బీఆర్ఎస్ ల మధ్య అవగాహనతో కాంగ్రెస్ కు మేలు జరగకుండా ఇరుపార్టీల అభ్యర్ధులను నిలపాలని చూస్తున్నారు. ఎన్నికలకు ముందు కత్తులు దూస్తూనే ఫలితాల అనంతరం కలసి పనిచేయడానికి బిజెపి, బీఆర్ఎస్ ల మధ్య ఒప్పందం కుదిరిందంటున్నారు. అయితే దీనివల్ల అనుకూలత ఎంత ఉందో వ్యతిరేకత కూడా అంతే ఉండే అవకాశం ఉంది. బీజెపి నేతలు స్వయంగా మోడీ, అమిత్ షా, నడ్డాలు బీఆర్ఎస్ అవినీతిపై చేసిన ఆరోపణలు, కవిత ఎపిసోడ్ లో జరిగిన హడావిడిని ప్రజలు అంత తేలికగా మరచిపోరు. ఈ రెండు పార్టీల చీకటి ఒప్పందం నిజమని కాంగ్రెస్ ప్రచారం చేసి ప్రజలను నమ్మించగలిగితే బీఆర్ఎస్ కు గడ్డుకాలమేనని చెప్పాలి.

పొంగులేటి, జూపల్లి ల చేరికతో కాంగ్రెస్ బలం పెరిగిందనడంలో సందేహం లేదు. రాష్ట్రవ్యాపితంగా ఇలాంటి బలమైన నాయకుల చేరిక జరిగి రేవంత్ రెడ్డిని ముందే సీ.ఎం అభ్యర్థిగా ప్రకటించడం, అభ్యర్ధులను ఆఖరు నిమిషం దాకా నాన్చకుండా ఉండగలిగితే కాంగ్రెస్ కు అనుకూలత పెరుగుతుంది. కానీ కాంగ్రెస్ అధిష్ఠానం అంత సాహసం చేస్తుందా అన్నది ప్రశ్నగా ఉంది. వామపక్షాల పరిస్తితి మరీ దయనీయంగా తయారైంది. కామ్రేడ్ లకు కనీసం కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. సీట్లు ఇస్తారనేది కష్టమే. మరో చారిత్రాత్మక తప్పిదం చేశామా? అని ఎప్పటిలాగే పాఠాలు నేర్చుకోవాల్సిన పరిస్తితి కన్పిస్తోంది. కేసీఆర్ కరుణిస్తారా? లేదా? చూడాలి. మొత్తం మీద కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్యే తెలంగాణలో పోటీ ఖాయమని తేలిపోయింది. ఎవరు గెలవబోతున్నారనేది ఇప్పుడే తేల్చి చెప్పలేని పరిస్థితి. బి.ఎస్.పి, టీ.జె.ఎస్, షర్మిల పార్టీలు నామమాత్రపు ఓట్లను రాబట్టుకునే అవకాశం ఉంది. షర్మిల పార్టీ కాంగ్రెస్లో విలీనం లేదా పొత్తు దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments