Tuesday, October 3, 2023
Homeవార్తలుపీవి శ్రీనివాస్ జీవితం ఆదర్శ ప్రాయం 

పీవి శ్రీనివాస్ జీవితం ఆదర్శ ప్రాయం 

  • సంస్మరణ సభ లో తెలంగాణ సాహిత్య అకాడెమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్

భద్రాచలం, ఆగస్ట్ 27 (జనవిజయం): నవతెలంగాణ దినపత్రిక మాజీ జనరల్ మేనేజర్ పీవీ శ్రీనివాస్ సంస్మరణ సభ ఆదివారం భద్రాచలం పట్టణంలోని కేకే ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. పీవీ మిత్రబృందం ఆధ్వర్యం లో ఏర్పాటుచేసిన ఈ సంస్మరణ సభలో పలువురు వక్తలు, స్నేహితులు పాల్గొన్నారు. భద్రాచలం మాజీ జడ్పిటిసి గుండు శరత్ అధ్యక్షతన జరిగిన ఈ సంస్మరణ సభలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ చరిత్రలో ఎవరి పేజీ వారి రాసుకుంటారని అన్నారు.

విద్యార్థి నుంచి, యువజన స్థాయిలో ప్రజా ఉద్యమాలను బలంగా నిర్మించి సామాజిక సేవలో జీవితాన్ని గడిపిన పీవి శ్రీనివాస్ ది గొప్ప చరిత్రని అన్నారు. పీవీ అకాల మరణం తీవ్రంగా బాధిస్తున్నదని అన్నారు. పివీలో అనేక గొప్ప కోణాలు దాగి ఉన్నాయని పార్టీని ఎంతో గొప్పగా గౌరవించాడని వ్యాఖ్యానించారు. తన వివాహం కూడా ఆదర్శ వివాహం చేసుకున్నాడని గుర్తు చేశారు. 1980-90 దశాబ్దాల్లో వచ్చిన యువతకు సామాజిక స్పృహ ఎంతగానో ఉందని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తెలిపారు. ఈ దశాబ్దం చాలా భిన్నంగా ఉందన్నారు. ప్రజల కోసం పనిచేసే వారు ఉద్యమ భావజాలాలను కలిగి ఉంటారని, అటువంటి కోవలో పివి శ్రీనివాస్ పయనం జరిగిందని, పీవీని నేటి యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పివి ఆశయ సాధనకు నడుంబిగించాలన్నారు. బహుజనులు అన్ని రంగాల్లో అగ్ర భాగాన్ని నిలవాలని ఆకాంక్షించారు. పివి కుటుంబానికి అండగా నిలవాలని వెల్లడించారు

నవ తెలంగాణకు పునాది పీవీ : వేణుమాధవ్, నవతెలంగాణ అసిస్టెంట్ ఎడిటర్

నవ తెలంగాణకు పునాది లాంటివాడు పీవీ శ్రీనివాస్ అని నవతెలంగాణ అసిస్టెంట్ ఎడిటర్ వేణుమాధవ్ వ్యాఖ్యానించారు. పత్రికను నిలబెట్టడంలో ఆయన సహకారం మరువలేనిది అన్నారు. సమ సమాజ నిర్మాణం కోసం పత్రిక ద్వారా తనకు చేతనైనంత సహాయం చేశారని గుర్తు చేశారు. పత్రికా ప్రారంభంలో అందులో పని చేసే స్టాప్ లో చైతన్యం తీసుకొచ్చి పత్రిక ఎదుగుదలకు ఎంతగానో దోహదపడ్డారన్నారు. పత్రిక, పార్టీ నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించారని ఆయన సేవలను గుర్తు చేశారు. తన మాటలతో ఉత్తేజం నింపేవారు అని తెలిపారు. నిరంతరం అధ్యయనం మీదనే ఆయన ఫోకస్ పెట్టారని వెల్లడించారు. పివి శ్రీనివాస్ ఆశయ సాధన కోసం అందరూ పని చేస్తామన్నారు

పీవీ లేని లోటు పూడ్చలేనిది : ఎలమంచిలి రవికుమార్, డిసిసిబి మాజీ చైర్మన్.

పీవీ శ్రీనివాస్ లేని లోటు పూడ్చలేనిది అని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం సానుభూతిని తెలియజేస్తున్నట్లు డిసిసిబి మాజీ చైర్మన్, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు ఎలమంచిలి రవికుమార్ వ్యాఖ్యానించారు. పివి కుటుంబంతోపాటు, ఆయన సతీమణి జ్యోతి కుటుంబంతో చక్కని పరిచయాలు ఉన్నాయన్నారు. పివి విద్యార్థి దశ నుంచే సామాజిక స్పృహ కలిగి ఉన్నారని వెల్లడించారు. మారుమూల భద్రాచలం ఏజెన్సీ నుంచి హైదరాబాద్ దాకా అనేక రంగాల్లో పివి ఎదిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పివి పార్టీపై చూపించిన ప్రేమ మరువలేనిది అన్నారు

పివి పలువురికి స్ఫూర్తి : కారం పుల్లయ్య, సిపిఎం పార్టీ భద్రాచలం నియోజకవర్గ కో కన్వీనర్

ప్రజా ఉద్యమాలు నిర్మించి ఎందరో యువతకు మార్గదర్శకంగా నిలవటమే కాకుండా, పత్రిక ద్వారా తన భావజాలాలను వ్యాపింప చేసి సమసమాజ నిర్మాణం కోసం పివి పరితపించిన విధానం ఎన్నటికీ మర్చిపోలేనిదని సిపిఐఎం భద్రాచలం నియోజకవర్గం కో కన్వీనర్ కారం పుల్లయ్య అన్నారు. పీవీతో తనకు ఎంతో చక్కని పరిచయం ఉందన్నారు. వారి కుటుంబంతో కూడా చాలా ఏళ్లుగా సన్నిహిత సంబంధం ఉందని వారంతా భావజాలాలు కలిగిన వ్యక్తులని తెలిపారు. పార్టీ అభివృద్ధిలో కూడా పివి ఎంతగానో పాటుపడాలని ఆయన సేవలను గుర్తు చేశారు. నవ తెలంగాణలో పీవీ పాత్ర ప్రశంసనీయమన్నారు

పివి సేవలు మరువలేనివి : పలువురు వక్తలు వ్యాఖ్య 

ఏపీ సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బాల కాశయ్య మాట్లాడుతూ* పీవికి సమస్యలపై ఎంతగానో అవగాహన ఉందన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సింగు నరసింహారావు మాట్లాడుతూ* ప్రజా ఉద్యమంలో ఎదిగిన ఆణిముత్యం పివి అన్నారు. భద్రాచలం ఏజెన్సీలో కూడా పార్టీ విజయంలో ఆయన భాగస్వామ్యం ఉందన్నారు.

టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి రాజు మాట్లాడుతూ అమరజీవి కామ్రేడ్ పివి శ్రీను మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. పీవీ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని వెల్లడించారు. ఆయన కుటుంబానికి సహకరిస్తామని తెలిపారు. వీవీ లేని లోటు పత్రిక రంగానికి కూడా ఉంటుందన్నారు.

తెలంగాణ బుక్ ట్రస్ట్ సెక్రటరీ కె. చంద్రమోహన్ మాట్లాడుతూ పీవీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. టీవీ5 ఎడిటర్ వైజే రాంబాబు మాట్లాడుతూ… మంచి మిత్రున్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కిషోర్ రెడ్డి మాట్లాడుతూ* మారుమూల ప్రాంతం నుంచి సిజెఎం స్థాయికి ఎదగటం పివీలో వృత్తి నిబద్ధతకు నిదర్శనం అన్నారు.

పివి సతీమణి స్వర్ణజ్యోతి మాట్లాడుతూ తమ అనుబంధాన్ని గుర్తు చేశారు. భద్రాచలం మాజీ జడ్పిటిసి గుండు శరత్ మాట్లాడుతూ …పీవీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని వెల్లడించారు. భద్రాచలం పట్టణ ప్రముఖ న్యాయవాది టి. చైతన్య మాట్లాడుతూ … ఆనాటి విద్యార్థి ఉద్యమం, యువజన ఉద్యమాల్లో పివితో పాటు పాల్గొన్న ఆ జ్ఞాపకాలను గుర్తు చేశారు.

సంస్మరణ సభలో పీవీ మిత్రులు గోంది బాలయ్య, కుంజా ధర్మా , తాళ్లూరి జగన్, బిలిపెల్లి రంగారెడ్డి, భీమవరపు వెంకట రెడ్డి, బుల్లెట్ రమేష్, సోముల మురళి కృష్ణ, ముదిగొండ రామారావు, బండారు ప్రతాప్, పెద్దినేని శ్రీను, స్వరూప్, సింగు శ్రీధర్, సింగు మురళి, ముదిగొండ ప్రమోద్, తల్లిదండ్రులు కృష్ణారావు, పుల్లమ్మ, పట్టణ ప్రముఖులు, పీవీ స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments