జనవిజయంప్రముఖులుశ్రామిక లోకపు నిత్యాగ్నిహోత్రం... శ్రీశ్రీ కవిత్వం

శ్రామిక లోకపు నిత్యాగ్నిహోత్రం… శ్రీశ్రీ కవిత్వం

గాధంలో నుంచి బయలుదేరే నల్లని అలలు మొహాన కొట్టి ఉక్కిరి బిక్కిరై తుఫాను చెవుల గింగురు మని నమ్మిన కాళ్ళ కింద భూమి తొలుచుకు పోతోవుంటే ఆ ‘చలమే’ నయమని వెనక్కి పరుగులు పెడతారు…
(శ్రీశ్రీ కవిత్వం పై చలం తన యోగ్యతా పత్రంలో వెలువరించిన అభిప్రాయం ఇది)

ఆకాశం బద్దలైనట్లు,భూమి కంపించినట్లు ఉబికి వస్తున్న అగ్నిపర్వతం లోని లావాలా ప్రళయ గర్జన చేస్తూ తెలుగు సాహిత్యంలో ఒక మహోజ్వల చరిత్రను సృష్టించినవాడు శ్రీ శ్రీ…. శరచ్చంద్రికతో మొదలు పెట్టి జగన్నాథ రథ చక్రాల వరకు సమాజంలోని ప్రతి అణువును స్పృశించి పరీక్షించి అక్షరీకరించిన అపురూప మేధావి శ్రీరంగం శ్రీనివాసరావు…. కార్మిక కర్షక బడుగు దీన వర్గాల తరుపున వకాల్తా పుచ్చుకుని సమాజపు అపసవ్యతలను చీల్చిచెండాడిన అగ్నిధార శ్రీ శ్రీ…

“నేను ఒకన్నీనిలిచిపోతే
చండ్రగాడ్పులు వాన మబ్బులు మంచు సొనలు భూమి మీద భగ్న మౌతాయి….”
జయభేరి కావ్యంలో అన్నట్లు శ్రీ శ్రీ శకం తర్వాత అంతటి వేగంతో విస్ఫుల్లింగాల్లాంటి పదాలతో ప్రళయం సృష్టించిన కవి మరొకరు లేరనడలో అతిశయోక్తి లేదు… సంస్కృత ఆంధ్ర ఆంగ్ల భాషల్లో విశేష సాధికారత ఉన్న శ్రీ శ్రీ ప్రధానంగా మానవతావాది… దానికి ఉదాహరణగా ఆయన భిక్షువర్షీయసి నిలుస్తుంది..

“ఆ అవ్వే మరణిస్తే
ఆ పాపం ఎవరిదని
వెర్రి గాలి ప్రశ్నిస్తూ
వెళ్ళిపోయింది”
ఎముక ముక్క కొరుక్కుంటు
ఏమీ అనలేదు కుక్క.
ఒక ఈగను పడవేసుకు
తొందరగా తొలగె తొండ
క్రమ్మె చిమ్మచీకట్లూ,
దుమ్మురేగె నంతలోన.
“ఇది నా పాపం కా”దనె
ఎగిరి వచ్చి ఎంగిలాకు.”

ఎముక ముక్క, కుక్క, ఈగ, తొండ, ఎంగిలి ఆకు, వెర్రిగాలి… వాటి స్వభావాలు సగటు మానవున్ని ఏ విధంగా అచేతున్ని చేస్తున్నాయో చెబుతూ అరాచక వాదుల చేష్టలను అన్యాపదేశంగా బహిర్గతపరిచిన సవ్యసాచి శ్రీ శ్రీ…. సగటు మనిషి బలహీనుడు అయినప్పుడు సమాజం అతన్ని వృధా వస్తువుగా చూసి నిర్లక్ష్యం వహిస్తుందని
శ్రీ శ్రీ భావన…

పతితులార !
భ్రష్టులార !
దగాపడిన తమ్ములార !
మీ కోసం కలం పట్టి ,
ఆకసపు దారులంట
హడావుడిగ వెళిపోయే,
అరుచుకుంటు వెళిపోయే
జగన్నాథుని రథచక్రాల్‌,
రథచక్ర ప్రళయఘోష
భూమార్గం పట్టిస్తాను !
భూకంపం పుట్టిస్తాను !…
—-జగన్నాథ రథ చక్రాలు

సమాజపు వివక్షలతో నలిగిపోయి దగాపడ్డారో వారి కోసమే తాను కలం పట్టి, జరుగుతున్న అన్యాయాలపై భూనభోంతరాలు దద్దరిల్లేలా తన కవిత్వంతో భూకంపం పుట్టించినవాడు శ్రీశ్రీ… కష్టజీవి కి ఇరుపక్కల ఉండే వాడే కవి అని సిద్దాంతరీకరించి తన కవితా కర్షకత్వమంతా వారి కోసమే చేసిన కల(హల)ధారి శ్రీ శ్రీ….

పొలాలనన్నీ,
హలాలదున్నీ,
ఇలాతలంలో హేమం పిండగ
జగానికంతా సౌఖ్యం నిండగ
విరామమెరుగక పరిశ్రమించే,
బలం ధరిత్రికి బలికావించే,
కర్షక వీరుల కాయం నిండా
కాలువకట్టే ఘర్మజలానికి,
ఘర్మజలానికి
ధర్మజలానికి,
ఘర్మజలానికి ఖరీదు లేదోయ్‌!….. ప్రతిజ్ఞ

ఆరుగాలం శ్రమించి పండించిన ప్రతి బియ్యపు గింజతో విశ్వం ఆకలి తీర్చే రైతన్న చెమట చుక్కకు వెల కట్టగలిగే వారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరని …మట్టిని బంగారం చేసే రైతుకు సరిసాటి ఎవరూ లేరన్న శ్రీశ్రీ మాటలను ఈనాటి పాలకులు గుర్తెరిగి దేశంలో ఉద్యమ బాట పట్టిన రైతన్నలను గౌరవించాలి….అప్పుడే ఆ మహాకవికి పట్టాభిషేకం…

మాయంటావా? అంతా
మిథ్యంటావా?
నా ముద్దుల వేదాంతీ!
ఏమంటావు?…… మిథ్యావాది

మనిషి ఆత్మవిశ్వాసం లోపించి అంతా కర్మఫలమని తన శక్తిని శంకించుకుంటుంటే కర్తవ్యోన్ముఖున్ని చేస్తూ ఆర్ధిక అసమానతల మాయలో పడొద్దని అవేవి మన ధీశక్తికి సాటిరావని సామాన్యుల్లో ఉత్సాహం నింపిన అసామాన్య వ్యక్తిత్వ వికాస నిపుణుడు శ్రీశ్రీ….

అజ్ఞానపు టంధయుగంలో
ఆకలిలో, ఆవేశంలో-
తెలియని ఏ తీవ్రశక్తులో
నడిపిస్తే నడిచి మనుష్యులు
అంతా తమ ప్రయోజకత్వం
తామే భువి కధినాధులమని,
స్థాపించిన సామ్యాజ్యాలూ,
నిర్మించిన కృత్రిమచట్టాల్‌
ఇతరేతర శక్తులు లేస్తే
పడిపోయెను పేక మేడలై…దేశ చరిత్రలు

ఈ నాటి దేశ స్థితిగతులకు సరిపోయే పంక్తులివి.. కరోనా మహమ్మారి విలయంలో అల్లాడుతున్న జనావాళి ఆక్రందనలఘోషలో, తాత్కాలిక ఉపశమన లేపనాలు కరిగిపోయి వాస్తవ పరిస్థితులు కంటి ముందు కనపడుతున్న వేళ…శ్రీశ్రీ భవిష్యత్ ద్రష్టగా విరాట్ స్వరూపంతో సాక్షాత్కరించటంలో ఆశ్చర్యం లేదు….  శ్రీశ్రీ వర్థంతి సందర్భంగా ఆ మహాకవికి ఘనంగా నివాళులు అర్పిస్తూ….

అసత్యం…అధర్మం..నలుపు లేని
సమాజాన్ని ఊహించిన
మహాత్ముడు..మహర్షి

జగన్నాథ రథ చక్రాలను
కదిల్చిన కలకత్తా కాళిక
లోకమే కలమైన నాళిక
రెండక్షరాల ప్రళయ గర్జన…

విశ్వ వృష్టికి అశ్రువులు
ధారపోసిన విశ్వకవి
తాను సైతం ప్రపంచాగ్నికి సమిధై

భువన ఘోషకు
మన గొంతుకులను సిద్ధం చేసి
మరో ప్రపంచం వైపు
నడిపించిన మహాగ్ని
బాధాతప్త హృదయాలకు
శాశ్వత భిషక్ శ్రీశ్రీ…

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
  • అట్లూరి వెంకటరమణ
    (కవి, రచయిత)
    9550776152

ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి