ఖమ్మం, జూలై 19(జనవిజయం):
జిల్లా సమగ్రాభివృద్ధికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా స్నేహాలత మొగిలి అత్యుత్తమ సేవలు అందించారని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. బుధవారం ఐడిఓసి లోని సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా పనిచేస్తూ, బదిలీపై గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అదనపు కమీషనర్ గా వెళ్లిన స్నేహాలత మొగిలి ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఖమ్మం జిల్లాకు మొదటి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా నియమింపబడి, 3 సంవత్సరాలకు పైగా జిల్లాలో విశిష్ట సేవలు అందించారన్నారు. గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థలు బలోపేతం తోనే బంగారు తెలంగాణ సాధ్యమని మంచి ఉద్దేశ్యంతో ప్రభుత్వం అదనపు కలెక్టర్ పోస్టులు ఏర్పాటుచేసిందని ఆయన తెలిపారు. జిల్లాలో పల్లె, పట్టణ ప్రగతి, దళితబంధు, మన ఊరు-మన బడి లాంటి ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాల అమలులో జిల్లా ఉన్నత స్థానంలో నిలుచుటలో స్నేహాలత పాత్ర ఎంతో ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం పొంది, ప్రజల్లో ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచారని, మార్గదర్శకంగా నిలిచారని కలెక్టర్ తెలిపారు. బాధ్యతాయుతమైన పదవిలో బదిలీపై వెళుతున్నారని శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా బదిలీపై వెళ్లిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి మాట్లాడుతూ, విధి నిర్వహణలో స్వేచ్ఛ నిచ్చి ప్రోత్సాహించారని, ఖమ్మం లో పనిచేయడంతో మంచి అనుభవమని, విధి నిర్వహణలో తోడ్పాటు అందించిన అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో బదిలీపై వెళ్లిన అదనపు కలెక్టర్ ని జిల్లా కలెక్టర్, అధికారులు ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్, ఎన్. మధుసూదన్, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణా సహాయ కలెక్టర్ రాధిక గుప్తా, జిల్లా అధికారులు, ఎంపిడిఓ లు, మునిసిపల్ కమీషనర్లు, ఎంపీఓ లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.