Friday, February 23, 2024
Homeసినిమానటశేఖరుని 'సింహాసనం'కు 37 ఏండ్లు

నటశేఖరుని ‘సింహాసనం’కు 37 ఏండ్లు

బాహుబలి + ఆర్.ఆర్.ఆర్ = సింహాసనం

 

        నటశేఖరుని ‘సింహాసనం’కు 37 ఏండ్లు

 

(సినిమా డెస్క్, జనవిజయం)

బాహుబలి + ఆర్.ఆర్.ఆర్ = సింహాసనం అంటూ నేటికీ నెట్టింట గొప్పగా చెప్పుకునే నటశేఖరుని సింహాసనం సినిమా విడుదలై నేటికి 37 ఏండ్లు పూర్తవుతున్నాయి. తెలుగు సినిమా పరిశ్రమలో ఎప్పటికీ ఈ సినిమా సంచలనమే! ఎన్నో తొలి టెక్నాలజీలను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన కృష్ణగారు సింహాసనం ద్వారా 70ఎం.ఎంతో పాటు స్టిరియో ఫోనిక్ సౌండ్ ను పరిచయం చేశారు. అఖండ ప్రజాదరణ పొంది, ఎన్నో ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రద్దలు కొట్టిన ‘సింహాసనం’ విడుదలై మార్చి 21, 2023 నాటికి 37 ఏళ్ళు పూర్తయింది. కృష్ణ గారు పరమపదించిన సందర్భంగా ఈ సినిమా రీ రిలీజ్ కు ఆయన అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

రెండు భాషలలో దర్శక,నిర్మాతగా సూపర్ స్టార్!

అభిమానుల హృదయాలలో ప్రజా,విప్లవ,సాహస,సంచలన నటుడిగా.. డేరింగ్ డేషింగ్ డైనమిక్ హీరోగా.. ఆంధ్రా జేంస్ బాండ్ గా, కౌబాయ్ గా ప్రశంసలందుకున్న సూపర్ స్టార్ నటశేఖర హీరో కృష్ణ తొలిసారిగా తెలుగు హిందీ భాషలలో కథ, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, దర్శకత్వం, నిర్మాతగా వ్యవహరిస్తూ హీరోగా ద్విపాత్రాభినయం చేశారు. తెలుగులో ‘సింహాసనం’, హిందీలో ‘సింఘాసన్’ పేర్లతో రెండు భాషల్లో అత్యంత భారీ బడ్జెట్తో ఈ చిత్రం రూపొందించబడింది. ఎక్కడా రాజీ పడకుండా కేవలం 53 రోజులలో రెండు భాషలలో ఈ సినిమాను పూర్తి చేసి అద్భుత విజయాలను సాధించి ఔరా! అనిపించుకున్నారు. అత్యంత భారీ సెట్స్ వేసి హైదరాబాద్ పద్మాలయా స్టూడియోలో, హోగినికల్లో, మైసూర్లో ఈ చిత్రాన్ని కేవలం 53 రోజులలో రెండు భాషలలో నిర్మించారు.

అప్పటికీ,ఇప్పటికీ ప్రతీ వార్తా విశేషమే!

హీరో కృష్ణకు జానపద చిత్రం తీయాలనే కోరికతో వెలువడిన చిత్రరాజమే సింహాసనం. పూర్తిగా జానపదంగా తెరకెక్కిన ఈ చిత్రం తీసే సమయంలో సింహాసనం గురించి ప్రతిరోజూ పత్రికలో ఏదోక న్యూస్ వచ్చేది. దినపత్రికలలో డబుల్ పేజీలలో కృష్ణ గారు సింహాసనంపై కూర్చున్న ఫోటోతో భారీ యాడ్లతో దీని ప్రస్థానం ప్రారంభం కాగా సినిమా విడుదలైన తరువాత సృష్టించిన రికార్డులు, ధియేటర్ల ముందు ట్రాఫ్రిక్ జాంతో 144 సెక్షన్లు, భారీ జనసందోహంతో శతదినోత్సవ వేడుకలు అన్నీ వార్తా విశేషాలే కావడం గమనార్హం. ఇప్పటికీ అవి సంచలన వార్తలే.

కృష్ణ ప్రయోగంపై విమర్శలు

50 లక్షలతో సినిమా తీయడమంటేనే సాహసంగా చెప్పుకునే ఆ రోజులలో మూడున్నర కోట్లు పెట్టి సినిమా నిర్మాణం ప్రారంభించడంతో కొందరు కృష్ణ ప్రయోగం పట్ల భయపడ్డారు. కృష్ణ నష్టపోతాడని సాంఘిక చిత్రల జోరు నడుస్తూ నంబర్ వన్ స్థానంలో ఉన్న కృష్ణ హాయిగా సినిమాలు చేసుకోక ఇదేమిపనంటూ విమర్శించారు. ట్రెండ్ ముగిసిన జానపద చిత్రానికి ఇంత పెట్టుబడి, హంగామా అవసరమా? అంటూ దెప్పిపొడిచినవారున్నారు. పైగా ఆయనే దర్షకత్వమంట అంటూ పెదవి విరిచారు. కృష్ణ ఇంత పెద్ద రిస్క్ తీసుకోవడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. సాహసాలకు,సంచలనాలకు కేరాఫ్ అయిన కృష్ణ గారికి ఆయనపై ఆయనకు, ఆయన అభిమానులపై ఆయనకు ఉన్న విపరీతమైన నమ్మకం కారణంగా వెనుకడుగు వేయలేదు. మూడున్నర కోట్లు పెట్టి సినిమా తీయడానికి ఎవరూ ముందుకు రాలేదు. పైగా ఇతర నిర్మాతలకు ఇచ్చి ఆ తరువాత నష్టపోతే ఎలా అని ఆలోచించిన కృష్ణ తానే స్వయంగా ఈ సినిమాను నిర్మించాడు.

రికార్డుల కోత – కలెక్షన్ల మోత

జానపద చిత్రాల్లోనే సరికొత్త ఒరవడిని సృష్టించిన ‘సింహాసనం’ ఓపెనింగ్స్ పరంగా ఆ రోజుల్లో ఆల్టైమ్ రికార్డ్ సృష్టించడమే కాకుండా శతదినోత్సవం, రజతోత్సవం, స్వర్ణోత్సవం జరుపుకుంది. సినిమా విడుదలై విమర్శకుల నోళ్లు మూయించింది. రెండు భాషలలో హిట్ అయింది. కృష్ణకు మంచి పేరు వచ్చింది. అప్పటివరకు ఉన్న అనేక రికార్డులను ఊచకోత కోసి ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటికి బ్రేక్ చేయని చేయలేని రికార్డులు ఈ సినిమాకు ఉండడం విశేషం. మొదటి వారం 1 కోటి 51 లక్షల 65 వేల 291 రూపాయలు కలెక్ట్ చేసి ఆల్టైమ్ స్టేట్ రికార్డ్ క్రియేట్ చేసింది. ధియేటర్లు, నగరాలు, టౌన్ల పరంగాను, వరుసగా హౌస్ఫుల్, కలెక్షన్ల పరంగా అనేక రికార్డుల మోతతో మొత్తంగా రూ.7 కోట్లుపైగా అంటే నిర్మాణ ఖర్చుకు రెండింతలు మొదటి విడుదలలోనే వసూలు చేసింది. ఈ చిత్రం విడుదల సమయంలో థియేటర్స్ దగ్గర ఓపెనింగ్ కు వచ్చిన భారీ క్రౌడ్స్ కి ట్రాఫిక్ జామ్ అయి ట్రాఫిక్ ని వేరే రోడ్లవైపు డైవర్ట్ చెయ్యాల్సి రావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. చాలా చోట్ల ధియేటర్ల ముందు 144 సెక్షన్ విధించాల్సి వచ్చింది. దాదాపు పది రోజుల ముందే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ ఇవ్వడం విశేషం. ఇప్పటివరకు మరే సినిమాకు ఇలా జరగలేదు.

శతదినోత్సవం హడావిడి!

41 కేంద్రాలలో శతదినోత్సవం పూర్తి చేసుకున్న ఈ సినిమా వందరోజుల వేడుకలు చెన్నైలో ఏర్పాటు చేశారు. 5 వేలమంది వస్తారనుకుంటే 25 వేలమంది అభిమానులు హాజరయ్యారు. కృష్ణ గారి ఫాలోయింగ్ తమిళనాడు ప్రభుత్వాన్ని సైతం ఆశ్చర్యపరిచింది. అప్పట్లో ఈ విషయాన్ని ప్రముఖంగా చెప్పుకునేవారు. దాదాపు 400 బస్సుల్లో ఘట్టమనేని అభిమానులు చెన్నై రావడం పెద్ద చర్చనీయాంశం అయింది. మద్రాస్ వీధులన్నీ అభిమానులతో క్రిక్కిరిసి పోవడంతో ఒక దశలో శతదినోత్సవం కార్యక్రమాన్ని వాయిదా వేద్దామనుకున్నారు. చెన్నై పోలీసుల సహకారంతో హడావిడిగా కొద్ది సమయంలోనే ఈ వేడుకని పూర్తి చేసారు. ట్రాఫిక్ జాం కావడంతో హీరోయిన్లు జయప్రద, రాధ, మందాకిని లతో పలువురు అతిధులు వేదికను చేరుకోలేక పోయారు. అతికష్టం మీద తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, హిందీ నటుడు జితేంద్రలు మాత్రం స్టేజి ఎక్కగలిగారు. కొద్ది సమయంలోనే వేడుకలను ముగించి రెండోరోజు ప్రైవేటుగా ఓ హోటల్ లో పంపిణీదారులకు, ధియేటర్ల వారికి షీల్డులు పంపిణీ చేశారు.

ఉర్రూతలూగించిన పాటలు!

బాలసుబ్రహ్మణ్యం లేకుండానే కొత్త గాయకుడు రాజ్ సీతారాం పాడిన పాటలు అప్పట్లో ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగించాయి. అదో సంచలనం. ఎక్కడ చూసినా సింహాసనం పాటలే మారుమ్రోగుతుండేవి. ఇప్పటికీ పల్లెటూర్లలో ట్రాక్టర్లపై ఆకాశంలో ఒక తార పాట వినిపిస్తూనే ఉంటుంది. బప్పీలహరి సంగీత దర్శకత్వం వహించిన ‘సింహాసనం’ సాంగ్స్ అన్నీ సూపర్హిట్ అయ్యాయి.

అద్భుత టెక్నాలజీ!

వి.ఎస్.ఆర్.స్వామి ఛాయా గ్రహణం, భాస్కరరాజు కళా దర్శకత్వం, సి.మాధవరావు మేకప్, శీను నృత్య దర్శకత్వం, వీరు దేవగన్ ఫైట్స్ అన్నీ కలిపి ‘సింహాసనం’ చిత్రాన్ని టెక్నికల్గా ఓ రేంజ్ కి తీసుకెళ్ళాయి.

భారీ తారాగణం!

రచయిత మహారథి ఈ చిత్రానికి మాటలు రాయడమే కాకుండా ఓ పాత్ర పోషించారు. తెలుగులో హిందీ నటుడు అంజాద్ ఖాన్ నటించిన తొలి చిత్రం ఇదే. షోలేలో గబ్బర్ సింగ్ గా అదరగొట్టిన ఆయన ఇందులో బఫూన్ పాత్ర వేయడం విశేషం. మందాకిని తెలుగుకు పరిచయం అయింది ఈ సినిమా ద్వారానే. కృష్ణ సరసన జయప్రద, రాధ, మందాకిని హీరోయిన్స్ గా నటించగా వహీదా రెహమాన్, గుమ్మడి, ప్రభాకర్ రెడ్డి, కాంతారావు, గిరిబాబు, సత్యనారాయణ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. విక్రమసింహగా, ఆదిత్య వర్దనుడుగా సూపర్ స్టార్ ద్విపాత్రాభినయం అభిమానుల్ని ఎంతగానో అలరించింది.

మళ్ళీ విడుదల చేయాలి!

హిట్ చిత్రాలు రీ రిలీజ్ చేస్తున్న ప్రస్తుత ట్రెండ్ లో కృష్ణ గారు అద్భుతంగా తీర్చిదిద్దిన, రికార్డుల పరంగా ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ సినిమాను రీ రిలీజ్ చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పటి తరానికి ఈ సినిమా గొప్పదనం చూపాలంటే అది రీ రిలీజ్ ద్వారానే సాధ్యం. ఇంత గొప్ప సినిమాని యూట్యూబ్ కు పరిమితం చేయకుండా మళ్ళీ విడుదల చేయాలన్న అభిమానుల కోరిక ఆచరణలోకి రావాలని ఆశిద్దాం. ఇంత గొప్ప చిత్రాన్ని అందించిన కృష్ణ గారికి జనవిజయం జోహర్లు అర్పిస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments