భద్రాచలం, ఆగస్టు 14 (జనవిజయం): భద్రాచలం లోని సెయింట్ పాల్స్ పాఠ శాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఆర్ట్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకుంది. మండల విద్యాశాఖ అధికారి ఎస్. సమ్మయ్య ఈ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 150 అంశాలు తో కూడిన ప్రదర్శన లు ఉన్నాయి. విద్యా వైజ్ఞానిక అంశాలను పరిశీలించిన సమ్మయ్య మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సృజనాత్మకత ను పెంపొందిస్తాయి అని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ డాక్టర్ కే అబ్రహాం, డాక్టర్ కే రాధ మంజరిని అభినందించారు. విద్యార్థులను ప్రోత్సహించిన తల్లిదండ్రులను, ఈ ఎగ్జిబిషన్లో భాగస్వామ్యాలు అయిన విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు.
ఈ ఆర్ట్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్ కు ప్రభుత్వ ఉన్నత పాఠశాల సైన్సు ఉపాధ్యాయురాలు జే పద్మ, చుక్కా శ్రీనివాస్, జయ బాబు, రిటైర్డ్ ఎంఈఓ రామ్మోహన్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ కె. అబ్రహాం మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసే లక్ష్యం తో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నూతన ఆవిష్కరణలకు నాంది పలికేలా భవిష్యత్ తరాలకు భావి శాస్త్రవేత్తలను అందించే ప్రయత్నంలో పాలుపంచుకున్న విద్యార్థులను అభినందించారు.