– సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
ఖమ్మం, ఆగస్టు 20 (జనవిజయం) : వైజ్ఞానిక స్పృహ వున్న సమాజమే వేగంగా అభివృద్ధి చెందుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. స్థానిక సుందరయ్య భవన్‌లో సిపిఎం జిల్లాకమిటి సభ్యులు బండారు రమేష్ అధ్యక్షతన జాతీయ వైజ్ఞానిక స్పృహ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2013 ఆగస్ట్ 20న ప్రముఖ హేతువాది డా॥ నరేంద్ర దభోల్కర్‌ను ఛాందసవాద శక్తులు హత్య చేశాయని పేర్కొన్నారు. మహారాష్ట్రకు చెందిన దభోల్కర్ అంధ విశ్వాసాలకు, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా జీవితాంతం కృషి చేశారని తెలిపారు. మహారాష్ట్ర అంధ శ్రద్ధ నిర్మూలన సమితి (ఎం.ఎ.ఎన్.ఎస్.) సంస్థను స్థాపించి, దేశవ్యాప్తంగా శాస్త్రీయ దృక్పథాన్ని పెంచే ప్రయత్నం చేశారని కొనియాడారు. రెండు దశాబ్దాల పాటు దళితుల సమానత్వం కోసం, అంటరానితనం నిర్మూలన కోసం డా॥ నరేంద్ర దభోల్కర్ పని చేశారని ఆయన ప్రశంసించారు. అంధ విశ్వాసాలు, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు చట్టం తేవాలని పోరాడారని తెలిపారు. దీన్ని వ్యతిరేకించిన ఛాందస శక్తులు డా॥ నరేంద్ర దభోల్కర్‌ను హత్య చేశారని అన్నారు. అందుకోసమే ఆయన మరణించిన రోజైన ఆగస్ట్ 20ని జాతీయ వైజ్ఞానిక స్పృహ దినోత్సవంగా దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ప్రగతిశీల శక్తులు, ప్రజాస్వామికవాదులు, శాస్త్ర సాంకేతిక నిపుణులు, శాస్త్రవేత్తలు ప్రజలలో శాస్త్రీయ దృక్పథాన్ని, వైజ్ఞానిక స్పృహను పెంచడం ద్వారా డా॥ నరేంద్ర దభోల్కర్‌కు నిజమైన నివాళిని అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన చంద్రయాన్`3 ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ ప్రయోగ ప్రాజెక్టులో పాల్గొన్న ప్రతి శాస్త్రవేత్తకు ఆయన అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, మాచర్ల భారతి, సిపిఎం జిల్లా నాయకులు బండి రమేష్, యర్రా శ్రీనివాసరావు, మెరుగు సత్యనారాయణ, ఎం.సుబ్బారావు, బషీరుద్దీన్, ప్రజాసంఘాల బాధ్యులు టి.లక్ష్మినర్సయ్య, ఎస్.కె.అఫ్జల్, బోడపట్ల రవీందర్, రఫి, విప్లవ్‌కుమార్, పిట్టల సుధాకర్, నాగేశ్వరరావు, నాదెండ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.