- మణుగూరు లో కాలినడకన పర్యటన
భద్రాద్రి కొత్తగూడెం, జూలై16(జనవిజయం):
ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్ల వేళలా కృషి చేస్తానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆదివారం మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని విఠల్ రావు నగర్ లో కాలినడకన పర్యటించారు. అక్కడి ప్రజలను కలిసి వారి సమస్యలను ముఖాముఖి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాంతారావు మాట్లాడుతూ కాలనీల్లో స్థానిక సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు తాను కాలినడకన పర్యటిస్తున్నట్లు తెలిపారు. ప్రజలతో స్వయంగా మాట్లాడే అవకాశం ఉంటుందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. గ్రామాలలో మౌలిక సదుపాయాలను పూర్తిస్థాయిలో కల్పించి భవిష్యత్ కాలంలో ఎలాంటి సమస్యలు లేకుండా సత్వర చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు గురించి గ్రామస్తులతో ముఖాముఖి వివరించినట్లు రేగా తెలిపారు. పేదలకు భరోసా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అని ఆయన అన్నారు, అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పినపాక నియోజకవర్గం లోని అన్ని మండలాలలో కోట్లాది రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని రేగా తెలిపారు.