భద్రాద్రి కొత్తగూడెం, జూలై 31(జన విజయం): వర్షాలు, వరదల వల్ల దెబ్బ తిన్న పంటలు, పశువులు, ఇళ్లు, పిడుగుపాటు తదితర అంశాలపై సమగ్ర నివేదికలు అందచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయంలో అన్ని శాఖల జిల్లా అధికారులతో వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాలపై అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆర్ అండ్ బి శాఖ పరిధిలో 4 వంతెనలు దెబ్బతిన్నాయని వాటిలో తీవ్రంగా దెబ్బతిన్న 2 వంతెనల మరమ్మత్తులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని చెప్పారు. సైడ్బరు కొట్టుకు పోయిన రహదారులకు తక్షణమే మట్టినింపేందుకు చర్యలు చేపట్టాలని చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 97 రహదారులు మరమ్మత్తులకు గురికాగా 60 పనులు పూర్తి కాగా 30 పసులు పురోగతిలో ఉన్నాయని, చేపట్టాల్సిన 3 పనులను తక్షణమే చేపట్టాలని ఈ ఈని ఆదేశించారు.
103 ఆవాసాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని, 11 చోట్ల పైపులైన్లు దెబ్బతిన్నాయని మరమ్మత్తులు చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని చెప్పారు. మంచినీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేపించాలని డిపిఓకు సూచించారు. సీజన్లో అంటువ్యాధులు ప్రబల కుండా చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను ఆదేశించారు. ప్రతి మంగళ, శు క్రవారాల్లో డ్రై డే పాటించి ప్రజలు ఇళ్ల పరిసరాలు పరిశుభ్రం చేసే విధంగా అవగాహన కల్పించాలని వైద్య, మున్సిపల్, పంచాయతీ అధికారులను ఆదేశించారు.
నష్టాలు అంచనాలు రూపకల్పనలో ఎలాంటి పొరపాట్లుకు తావులేకుండా నిష్పక్షపాతంగా పకడ్బందిగా తయారు చేయాలని చెప్పారు. సర్వే నెంబర్, పంట దెబ్బతిన్న విస్తీర్ణం సమగ్రంగా తెలియచేయాలని సూచించారు. నష్టపు అంచనాలు రూపకల్పనకు మండలస్థాయిలో జాయింట్ టీములు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దెబ్బతిన్న పంటలు, పశువులు, పిడుగుల పాటు వల్ల జరిగిన నష్టాలు తదితర వాటి ఫోటోలతో సహా నివేదికలతో అందచేయాలని అధికారులను ఆదేశించారు. నిరంతరాయ వర్షాలు, గోదావరి వరదల సహాయక చర్యలు భేష్ అంటూ యంత్రాంగాన్ని అభినందించారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులు వరద సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొన్నారని చెప్పారు. వరదలు తగ్గిన తదుపరి ప్రధానంగా పారిశుద్యం, అంటువ్యాధలు ప్రజల కుండా చేపట్టం మన ముందున్న చాలెంజ్ అని చెప్పారు. మురుగునీటి నిల్వలున్న ప్రాంతాలను గుర్తించి నీటి నిల్వలు లేకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు. మురుగునీటి నిల్వలున్న ప్రాంతాల్లో దోమలు వ్యాప్తి జరుగకుండా ఆయిల్బాల్స్, గంభూషియా చేపలు, టెమాఫాస్ స్ప్రేయింగ్ చేయాలని చెప్పారు. ఫాగింగ్ కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలని మున్సిపల్, పంచాయతీ అధికారులను ఆదేశించారు. వ్యాధులు ప్రబలిన గ్రామాల్లో ఆరోగ్య శిభిరాలు నిర్వహించి వ్యాధులు వ్యాప్తి జరుగకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను ఆదేశించారు.
అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యవసర మందులు స్టాకు ఉంచాలని చెప్పారు. ఆసుపత్రుల పరిసరాలు పరిశు భ్రంగా ఉంచాలని చెప్పారు. సంక్షేమ హాస్టళల్లో ఆరోగ్య శిభిరాలు నిర్వహించి వ్యాధులు ప్రబల కుండా విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. వ్యాధులు ప్రబల కుండా ఇంటింటి జ్వర సర్వే నిర్వహించాలని వైద్యాధికారులను ఆదేశించారు. చెరువులు తనిఖీ చేసి పటిష్టతకు చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. చెరువులు అలుగుపోస్తున్నాయని, ఇరిగేషన్ అధికారులు వ్యక్తిగతంగా పరిశీలన చేసి పరిరక్షణకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, మధుసూదన్ రాజు, డిపిఓ రమాకాంత్, జడ్పి సిఈఓ విద్యాలత, ఇరిరగేషన్ అధికారి అర్జున్, ఆర్ అండ్ బీ ఈఈ భీమ్లా, పిఆర్ ఈఈ మంగ్యా, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష, ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ రవిబాబు, వ్యవసాయ అధికారి అభిమన్యుడు, ఉద్యాన అధికారి జినుగు మరియన్న తదితరులు పాల్గొన్నారు.