జనవిజయంసాహిత్యంసాహిత్యానికి సమకాలీనత అవసరం

సాహిత్యానికి సమకాలీనత అవసరం

‘నా’మా’ట’ – 5

ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఈ ఏడాది కొత్తగా మోడ్రన్ తెలుగు కోర్సు ప్రవేశపెట్టారట. దీనిపై ప్రిన్సిపాల్ తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుని కవరేజీ ఇద్దామనే ఉద్దేశ్యంతో బయలుదేరాను. మార్గమధ్యలో ధర్నాచౌక్ వద్ద కళాకారుల ధర్నాను చూసి ఆగాను. స్వరాష్ట్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించిన కళాకారులకు ఏం గతి పట్టిందనుకుంటూ శిబిరం వద్దకెళ్లాను. ‘ఎవడి డప్పు వాడే కొట్టుకోండి’ అన్న పవన్ కళ్యాణ్ పాట గుర్తుకొచ్చింది అక్కడి దృశ్యాన్ని చూశాక. నిన్నటి దాకా ధర్నాచౌక్లో మిషన్ భగీరథ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఈవాళ కళాకారులు చేస్తున్నారు. ఆర్థికవిధానాల మూలంగా అస్తిత్వ వాదం పెరిగిపోయింది. అందుకే నీకు సమస్య వస్తే నీవు ధర్నా చేయాలి. నాకు వస్తే నేను చేయాలి. ఒకరి గురించి మరొకరికి అవసరం లేని కాలం సృష్టించబడింది. అదే ఆర్థిక విధానాలను అమలు చేసిన వ్యక్తిని కూడా మన తెలుగువాడనే ఆలోచనతో కీర్తిస్తున్నాము అనుకోండి. అది వేరే విషయం. ఇది కూడా ఒక టైపు అస్తిత్వమే. కళాకారులకు సంఘీభావం తెలిపి డిగ్రీ కాలేజీ వైపు బయలుదేరాను.

మధ్యలో సాహితీ మిత్రుడు కలిస్తే టీ తాగుదామని హోటల్ వద్ద ఆగాము. ‘నీలోని జర్నలిస్ట్ కవిని డామినేట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది నీ రాతలు చూస్తుంటే. కవులేం రాయాలో చెబుతున్నావు సరే. మీకింతవరకు ఇళ్లుగానీ, ఇళ్లస్థలాలు కాని రాలేదు. వాటి మీద ఫోకస్ పెట్టకపోయావా’ అన్నాడు. స్వరాష్ట్ర సాధన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన కళాకారులు ఇప్పుడు ధర్నాకు దిగారు. ఉద్యమానికి బాసటగా నిలిచిన జర్నలిస్టులదీ అదే పరిస్థితి. ఆ రోజు కూడా వస్తుందిలే అన్నాను. కాసేపు కబుర్లు చెప్పుకుని ఇద్దరం అక్కడి నుండి విడిపోయాము.

జనవిజయం ఎడిటర్ పల్లా కొండలరావు గారి ఫోన్ వస్తుంటే బండిని ఆప్ ఫోన్ లిఫ్ట్ చేశాను. ఈ వారం ‘నా’మా’ట’ వ్యాసం దేనిమీద రాస్తున్నారు. పంపిస్తారా అని అడిగారు. ఇంకా రాయలేదండి. ఈ రోజు సాయంత్రం పంపిస్తానని చెప్పగా ఓకే అని ఫోన్ పెట్టేశారు. డిగ్రీ కాలేజీకి వెళ్లి వచ్చాక నాలుగు తెల్లకాగితాలు ముందేసుకుని కూర్చున్నాను ఈ వారం ఏమి రాయాలోనని ఆలోచిస్తూ…

‘మా కంపెనీకి జీతాలు పెరిగినయ్.. విన్నావా, కన్నావా ఓ లచ్చిమి’ అనే పాట టీవిలో వస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న ధరల పరిస్థితిని వివరిస్తూ పాలకుల తీరును ఎండగడుతూ ఆ పాట సాగుతుంది. ఆ సినిమా వచ్చినప్పుడు ఆ పాటను చాలా సార్లు పాడుకునేవాడిని. నాకంతలా నచ్చింది. చాలా రోజుల తర్వాత ఆ పాట చూస్తున్నాను.

ధరలకు అదుపు లేకుండా పోతోంది. నిత్యావసరాల ధరలు చుక్కలనంటుతున్నాయంటూ పేపర్లలో ప్రధాన శీర్షికలతో వస్తున్న వార్తలు చూస్తునే ఉన్నాం (కొన్ని పేపర్లలోనే వచ్చాయిలేండి). ఎందుకీ పరిస్థితి దాపురించింది. సామాన్యుడికి ఉపాధి అవకాశాలు అల్లంత దూరాన ఉన్నాయి. కింది స్థాయి ఉద్యోగుల జీతాలు మాత్రం జానెడు సైజులోనే ఉన్నాయి. పంట పండించిన రైతన్న ఆ పంటను అమ్ముకునేటప్పుడు ధర ఉండడం లేదు. వ్యాపారి వద్ద పంట ఉన్నప్పుడు మాత్రం ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి. ఇదేమీ విచిత్రం కాదు. పాలకుల విధాన ఫలితమిది.

‘ఓ సాహితీ సంస్థ కవితలు, కథల పోటీ నిర్వహిస్తోంది. ఈసారి ఎలాగైనా బహుమతి కొట్టాలంటూ మిత్రుడు ఫోన్ చేశాడు. ఎలాంటి కవిత, కథ రాస్తే ప్రైజ్ వస్తుందనేది ఆ ఫోన్ సారాంశం. నీవేమి రాయాలనుకుంటున్నావని అడిగాను. ముందు ఆ సంస్థ నైజం, సిద్ధాంతం తెలుసుకుంటాను. దానికి అనుగుణంగా రాయాలనుకుంటున్నాను అన్నాడు. ఇప్పుడు చాలా వరకు అలానే జరుగుతోంది. మిత్రుడి సమాధానం ఎందుకో నాకంతగా నచ్చలేదు. మళ్లీ అడిగాను. ఓకే. సంస్థ గురించి తెలుసుకుంటావు. తర్వాత ఏం రాస్తావన్నాను. హరితహారం జరుగుతోంది. అలాగే వచ్చే నెలలో స్వాతంత్ర్య దినోత్సవం ఉంది. ఆ పైన దసరా ఉంది. వీటిపై రాసి పంపిస్తాను అన్నాడు. నీ ఆలోచన బాగుంది. ఇవి అందరూ రాస్తారు కదా, నీకంటూ ప్రత్యేకత ఉండకపోతే బహుమతెలా వస్తుందన్నాను మళ్లీ కలుగజేసుకుని. అదీ కరెక్టే. మరి ఏం రాయమంటావు అని మళ్లీ నన్నే అడిగాడు. రేపు చెబుతాను, నీవు కూడా ఆలోచించు అంటూ ఫోన్ పెట్టేసి వ్యాసంపై ఆలోచన మళ్లీంచాను. సాధ్యపడడం లేదు. మిత్రుడు చెప్పిందే పదే పదే గుర్తుకొస్తోంది. హరితహారం, స్వాతంత్య్ర దినోత్సవం, దసరాను గుర్తుంచుకున్న మిత్రుడు సమాజంలో జరుగుతున్న ఘటనలు, పరిణామాలు పరిశీలించడం లేదన్న బాధ నన్ను పీడిస్తోంది. పోలీస్ కస్టడీలో ఓ దళిత మరియమ్మ చనిపోయింది. కానరానివి ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. నిత్యావసర ధరలు పెరిగి సామాన్యులు విలవిలలాడుతున్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల వారు అసంతృప్తితో రగిలిపోతున్నారు. యువతకు ఉపాధి లేదు. నెల నెలా ఉద్యోగ విరమణలు జరుగుతూనే ఉన్నాయి. వాటి స్థానంలో కొత్త ఉద్యోగాలు లేవు. మరో పక్క అవసరం ఉన్నప్పుడు తీసుకుని, అవసరం తీరాక కరివేపాకుల్లా ఏరిపారేస్తుంటే దిక్కుమొక్కు లేకుండా పోతున్న పరిస్థితి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులది. పాతవి అమలు కాని హామీలు తననెప్పుడు తలచుకుంటాయని వెక్కివెక్కి ఏడుస్తుంటే కొత్తవి వచ్చి వెక్కిరిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో విద్య, వైద్యం ప్రాముఖ్యత పెరిగిపోయింది. చప్పట్లు కొట్టినా, దీపాలు వెలిగించినా ప్రయోజనం శూన్యమని అర్థమైంది. వైద్యులే దేవుళ్లనే సంగతి అందరికీ తెలుసు. నేడు ఆ రంగంలో కొత్తగా పోస్టులు భర్తీ కావడం లేదు. ఉన్న వారిపై పని భారం రుతోంది. ఇన్ని సమస్యలు సమాజంలో విలయతాండం చేస్తుంటే ఆ కవి మిత్రుడు ఆలోచన అలా ఉందేంటబ్బా అనే ఆలోచనలే నన్ను చుట్టుముట్టాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు నాకు ఎదురైన అనుభవాలే వ్యాసం రాసి పంపించాను.

ఇటు ప్రజలకూ, అటు ప్రభుత్వానికి నడుమ వారధిగా కవిత్వం పని చేస్తుంది. ఆ కవిత్వానికి వర్తమానత, సమకాలీనత అవసరం. లేకుంటే నిష్ఫలం. మరుసటి రోజు మిత్రుడు ఫోన్ చేస్తే ఇదే చెప్పాలనుకుని ఆయన ఫోన్ కోసం ఎదురుచూస్తున్నాను. ‘నీ హృదయాన్ని చీల్చి వేసెయ్యి/జాలి చేష్టమాని ఉక్కు సమ్మెట కావాలని’ అనే వాడ్రేవు చిన వీరభద్రుడు కవిత చదువుతూ…

– నామా పురుషోత్తం
9866645218

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి