జనవిజయంసాహిత్యంసాహిత్య బంధు...?

సాహిత్య బంధు…?

నా ‘మా’ట -9

అరెరరే అరెరరే ఏందిరన్న ఏం చేద్దమన్న ఎటు చూస్తామన్న బంద్
రైళ్లు బందు, హోటళ్లు బంద్, ఇస్కూల్ కూడా బంద్…

టివీలో పాట వస్తుంటే చూస్తూ పేపర్ తిరగేశాను. నాడు రైతుబంధు, నేడు దళితబంధు.. రేపే బంధు వస్తుందో అనుకుంటూ పేపర్ని పక్కకు పడేసి మోగుతున్న ఫోన్ లిఫ్ట్ చేశాను. మిత్రమా! కవులు, రచయితలు, కళాకారుల సమావేశం రేపు నిర్వహించబోతున్నాం. మీరు తప్పకుండా రావాలంటూ ఆహ్వానం పలికాడు. జర్నలిస్టుగా కవరేజీకి పిలిచాడా, లేక నన్నొక కవి అనుకుని ఆహ్వానించాడా అనుకుంటూ పక్కనున్న పేపర్ అందుకున్నాను.

బిసి బంధు ప్రకటించాలి, ముస్లిం బంధు తేవాలి.. ఇవే వార్తలు చాలా పేజీల్లో కనిపించాయి. పైపైన చదివేసి అన్ని పనులు ముగించుకుని ఆఫీస్ కి బయల్దేరాను. మార్గమధ్యలో కవి మిత్రుడు కలిశాడు. ఏంటి సంగతులంటూ కాసేపు ముచ్చట్లు చెప్పుకున్నాక మిత్రుడు కవిత చూపించాడు. ఈ మధ్యనే రాశాను ఎలా వుందో చదివి చెప్పు అంటూ నాకిచ్చాడు. అంత తొందరగా వదిలే వ్యక్తి కాదు. ఈవాళ బుక్ అయ్యాననుకుంటూ కవిత తీసుకుని గబాగబా చదివేశాను. ఎలా వుంది అన్నాడు నేను చెప్పే రిజల్డ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తూ..

చాలా మంది కవులు నిజం చెబితే స్వీకరించరు. కవితలో గాఢత లేకపోయినా అహా, ఓహో అంటే చాలు ఉప్పొంగిపోతారు. నేను అలాంటి వ్యక్తిని కాను. అందుకే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశాను. మిత్రుడు షాక్ కు గురై అంతేనంటావా అన్నాడు. మరొక్కసారి కవితను చదువు నీకే తెలుస్తుందన్నాను. లేదు మిత్రమా. వచ్చేటప్పుడు మా గురువు గారి దగ్గర కవిత వినిపించాను. చాలా బాగుందన్నాడు. నీవెందుకో నచ్చడం లేదన్నాడు. అవునా…నేనైతే నా అభిప్రాయం చెప్పాను. కాదు కాదు కవిత సారాంశాన్ని వివరించాను. అది బాగుందా లేదా అనేది నీవే మరొక్క సారి పరిశీలించు అంటూ ఆఫీసు టైమ్ అవుతోంది వెళ్తానన్నాను. ఎందుకో నా మాటలు అతనికి నచ్చలేదనిపించింది. నీకు నచ్చదులే అన్నట్టుగా అతని ముఖకవళికలు కనిపించాయి. అతని దగ్గర సెలవు తీసుకుని ఆఫీస్ కు బయల్దేరాను.

కవుల్లో ఇలాగా కూడా ఉంటారా అనిపించింది అతని కవిత చదివాక. సందర్భానుసారం కవితలు రాస్తూ అందరినీ అలరించే వ్యక్తి ఇప్పుడెందుకిలా రాశాడనుకుంటూ ఆఫీస్ కొచ్చాను. అతను రాసిన కవితే పదే పదే గుర్తుకొస్తోంది. చాలా సార్లు సమయస్ఫూర్తితో కవితలు రాసి అందరి వద్ద బహుమతులు పొందిన వ్యక్తి ఈసారి ఎందుకో లైన్ తప్పాడనిపించింది. పెద్ద పెద్ద ఈదురుగాలులు వచ్చినప్పుడు తట్టుకుని నిలబడే చెట్లు మాత్రమే పదుగురికి నీడనివ్వగలవు. సాహిత్యంలో కూడా ఉపద్రవాలు వస్తుంటాయి. కొంతమంది పని గట్టుకుని మరీ కవులను పక్కదారి పట్టిస్తుంటారు. ఆ ప్రవాహంలో చాలా మంది కవులు కొట్టుకుపోయి తాము ఏం రాస్తున్నామో ఆలోచన చేయకుండా తను రాసిందే ముఖ్యమనుకున్నట్లు ప్రవరిస్తుంటారు. వర్గ దృక్పథం, శాస్త్రీయ పరిశీలన లేకపోవడమే ఇందుకు కారణం.

సమస్య పరిష్కారానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎన్నుకుంటారు. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యవాదాన్ని అంతమొందించి స్వాతంత్య్రం తేవడం కోసం అహింసామార్గాన్నే గాంధీ ఎంచుకున్నారు. అదే స్వాతంత్ర్య పోరాటంలో హింసా మార్గాన్ని ఎంచుకున్న వారూ లేకపోలేదు. వారందరి అంతిమ లక్ష్యం ప్రజల్ని స్వేచ్చాగాలులు పీల్చేలా చేయడమే. అలా చాలా సమస్యల పరిష్కారానికి చాలా మార్గాలను ఎంచుకున్న దాఖలాలు కోకొల్లలు. పెద్దలెంచుకున్న మార్గాన నడవొచ్చు. వారికంటే విభన్నంగా వ్యూహాలు రూపొందించొచ్చు. తక్కువ స్థాయిలోనూ ఆలోచించవచ్చు. అందరూ ఒకే మార్గాన నడవాలనే నియమం లేకపోవచ్చు. వేర్వేరు దారుల్లో వేర్వేరు వ్యూహాలతో ముందుకు నడిచిన ఘటనలూ చర్రితలో అనేకం. అంతిమ లక్ష్యాన్ని సాధించిన వారు ప్రజల మన్ననలు పొందుతారు. లేకుంటే చరిత్రలో పరాజితులుగానే మిగిలిపోతారు. మిత్రుడు రాసిన కవిత సారాంశం మాత్రం దీనికి భిన్నంగా ఉంది. పెద్దలు సూచించిన మార్గాన నడవడం తప్పేం కాదు. అన్ని సార్లూ అలాగే వ్యవహరించడం సాధ్యమూ కాదు. కవి మిత్రుడు మాత్రం పూర్వీకుల చెప్పిందే ఇప్పుడు కూడా చేయాలనే వితండవాదాన్ని కవితలో స్ఫురింపచేశాడు. పరిస్థితులకు తగినట్లుగా వ్యూహరచన చేయడంలోనే విజయం వుంది.

మరుసటి రోజు కవుల సమావేశానికి అయిష్టంగానే వెళ్లాను. సమావేశం ఎజెండాను అధ్యక్షత స్థానంలో ఉన్న వ్యక్తి ప్రకటించాడు. కవులకు, రచయితలకు సాహిత్య బంధు ప్రవేశపెట్టాలి. ఈ పథకం కింద రచనలకు ఆర్థిక సహకారం అందించాలి. ప్రతి జిల్లా కేంద్రంలో సాహిత్య భవనాలను నిర్మించాలి. పూర్వ కవుల పేర్లతో ఏటేటా ఉత్తమ కవులకు పురస్కారాలు అందించి సన్మానించాలి అంటూ ఎజెండా సారాంశం చెప్పేశాడు. చర్చ ప్రారంభమైంది. అందరూ వారి వారి అభిప్రాయాలు చెబుతున్నారు. ‘ఇప్పటికే పదవులు ఇచ్చి చాలా మంది కవులను, కళాకారులను ప్రభుత్వం కట్టిపడేసింది. మొన్నటి దాకా అనేక సామాజిక రుగ్మతలపై కలం కదిపినవారు నేడు ప్రభుత్వ గడుల్లో బందీలై మౌనవ్రతం చేస్తున్నారు. ఇప్పుడు మీరు సాహిత్యబంధు అడిగితే ఇకపై మనమంతా నోరు కుట్టేసుకోవడమేనా’ అన్నాడో యువ కవి. అతనికి మరో నలుగురు వంత పలికారు. నీవన్నది వాస్తవమే మిత్రమా! కానీ చాలా మంది కవులు ఆర్థిక సమస్యలతో సతమతమవుతుండడంతో చాలా రచనలు వెలుగు చూడడం లేదు. ప్రభుత్వం కనికరిస్తే ఆ రచనలు బయటకొస్తాయి కదా అన్నాడో సీనియర్ కవి. పుస్తకాల ప్రచురణ కోసం ప్రభుత్వాలకు లొంగిపోతే మనం జైళ్లల్లో ఉన్నట్లు లెక్కే అన్నాడో మిత్రుడు. మరి ఇప్పుడేం చేద్దాం. అందరూ రాజ్యానికి వ్యతిరేకంగా ఉంటే ఎలా? అన్నాడు అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి. అయినా మీ పిచ్చిగాని…కవులతో, రచయితలతో ప్రభుత్వానికేం పని ఉంది. మనల్ని ఎందుకు ఉద్ధరిస్తుంది. కవి ఎప్పుడూ ప్రతిపక్షమే. ప్రజాపక్షమే. మనం ఇలాంటి సమావేశాలు పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదంటూ ఆ యువ కవి మరోసారి తన అభిప్రాయాన్ని చెప్పాడు. గంట పాటు చర్చ రసవత్తరంగా జరిగింది. చివరకు మెజార్టీ సభ్యులు సాహిత్యబంధు వద్దనుకుంటూ బయటకు వెళ్లిపోయారు. అక్కడున్న వారు మాత్రం మనం తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుదాం. ఒక వేళ ప్రభుత్వం కనికరించింది అనుకో. వాళ్లే మళ్లీ వెనక్కి వస్తారంటూ సమావేశ అధ్యక్షుడు ప్రకటించగానే సరేనంటూ తలూపేశారు.

రచయితకు నిజాయితీ ఉండాలి. చిత్తశుద్ధి ఉండాలి. అవి లోపిస్తే అవి కావాలి ఇవి కావాలి అని అడుగుతుంటారు అన్న ఓ మహాకవి మాటలు గుర్తుకొచ్చాయి. ఇప్పుడున్న సమాజం తల్లకిందులుగానే ఉంది. కాబట్టి చాలా మంది తలకిందులుగానే చూసి తలకిందులుగానే అర్థం చేసుకుంటారని మార్క్స్ మహాశయుడు చెప్పిన మాటలు అక్షరసత్యం.

– నామా పురుషోత్తం
98666 45218

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి