Tuesday, October 3, 2023
Homeవార్తలుఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్ట్ అప్రజాస్వామికం

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్ట్ అప్రజాస్వామికం

— గ్రూప్ 2 పరీక్షను వెంటనే వాయిదా వెయ్యాలి

— బిఎస్పీ జిల్లా అధ్యక్షులు బుర్ర ఉపేంద్ర సాహు

ఖమ్మం, ఆగస్టు12 (జనవిజయం) : విద్యార్థుల ఆత్మ బలిదానంతో ఏర్పడిన తెలంగాణలో 9 సంవత్సరాలుగా ఉద్యోగ నోటిఫికేషన్ లు వేయని టీఆర్ఎస్ ప్రభుత్వం, నెల వ్యవధిలో అనేక పరీక్షలను నిర్వహించడం ఎంతవరకు సమంజసమని, నిరుద్యోగుల సమస్యను అర్థం చేసుకొని గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తున్న దీక్షను భగ్నం చేసి హౌస్ అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఖమ్మం జిల్లా గ్రంథాలయం ఎదురుగా నిరుద్యోగ యువకులతో కలిసి బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బుర్ర ఉపేంద్ర సాహూ మాట్లాడుతూ… గ్రూప్ 2 పరీక్షను న్యాయబద్ధంగా వాయిదా వేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేపట్టిన సత్యాగ్రహ దీక్షను భగ్నం చేసి, వందలాదిమంది పోలీసులతో బీఎస్పీ రాష్ట్ర కార్యాలయాన్ని దిగ్బంధంచేసి ప్రవీణ్ కుమార్ ను అరెస్ట్ చెయ్యడం దుర్మార్గం అన్నారు.

రాష్ట్రంలో నిరుద్యోగ యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిరంతరం ఆలోచిస్తూ పోరాటం చేస్తున్నారని అన్నారు. గ్రూప్ 1 పేపర్ లీకేజీ అంశంలో కూడా ప్రభుత్వాన్ని నిలదీసింది బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమేనని అన్నారు. వందల మంది ఆత్మ బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులు ఇంటికో ఉద్యోగం వస్తుందని ఆశించి బంగ పడ్డారని విమర్శించారు. 9 సంవత్సరాల పాటు పాలించిన కెసిఆర్ ప్రభుత్వంలో ఎటువంటి ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు కానీ, ఎన్నికల సమయం సమీపిస్తుండడంతో ప్రచార ఆర్భాటంతో ఓట్ల కోసం ఉద్యోగ నోటిఫికేషన్ లు ఇస్తున్నారని దుయ్యబట్టారు. పారదర్శకంగా నియామకాలు చేపట్టవలసినటువంటి టీఎస్పీఎస్సీ బోర్డు అంగట్లో సరుకుల్లా ప్రశ్నాపత్రాలను దొంగలకు అమ్ముకుందని ఆరోపించారు. ఆ దొంగలు దొరకకముందే మళ్లీ హుటాహుటిన గ్రూప్ 2 పరీక్షలను నిర్వహించడానికి షెడ్యూల్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు.

ఆగస్టు 2న నర్సింగ్ పరీక్షలని, ఆగస్టు 8న ఏవో పరీక్షలని, ఆగస్టు 29, 30న గ్రూప్ 2 పరీక్షలను నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నిరుద్యోగులు ఒకే నెలలో ఇన్ని పరీక్షలకు ఎలా హాజరవుతారు, ఎలా ప్రిపేర్ అవుతారని ప్రశ్నించారు. ఇన్నాళ్లు కష్టపడి చదివిన దానికి ఫలితం రాకుండా నిరుద్యోగులను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారన్నారు. నిరుద్యోగులు, విద్యార్థులు గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వానికి మొరపెట్టుకుంటే వారిపై లాఠీచార్జి చేయడం సిగ్గుచేటన్నారు. సమర్థవంతంగా నియామకాలు నిర్వహించలేని ఈ చేతగాని ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుందని దుయ్యబట్టారు.

ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా తమ జీవితాలను ఫణంగా పెట్టి పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు ఈ పరిస్థితి కల్పించడం దారుణమన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ నాయకులను డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు అరెస్టు చేసినంత మాత్రాన బహుజన్ సమాజ్ పార్టీ పోరాటం ఆపదని, నిరుద్యోగులు, విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు వారి పక్షాన నిలబడి పోరాడుతామన్నారు. మద్యం టెండర్ల మీద ఉన్న ప్రేమ, ఆసక్తి కెసిఆర్ కు నిరుద్యోగుల మీద లేదని విమర్శించారు. అరెస్టులు చేసినా, కేసులు పెట్టినా, నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకు, గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేసేంతవరకు పోరాటం కొనసాగుతుందని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో కెసిఆర్ కి, బిఆర్ఎస్ కి నిరుద్యోగ యువకులే తగిన బుద్ధి చెబుతారని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ ఎం. పుల్లయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు చెరుకుపల్లి నాగేశ్వరావు, ప్రధాన కార్యదర్శి మిరియాల నాగరాజు, మహిళా కన్వీనర్లు ఉప్పల మంజుల, బానోతు రజిని, అనిత, జిల్లా నాయకులు సి.హెచ్. చంద్రమోహన్, పల్లె పొంగు విజయ్, బానోత్ రాంబాబు, బి. ఉపేందర్, అయితగాని శ్రీనివాస్, సుభాష్ చంద్రబోస్, శ్రీకాంత్ స్వేరో, ఉదయ్, వంశీ, నాగరాజు, చరణ్, రాజీవ్, వెంకటనారాయణ, అఖిల్, మాధవరావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments