ఖమ్మం, జూలై 14(జనవిజయం): రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలపై కార్యాచరణ చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం ఐడిఓసి లోని సమావేశ మందిరంలో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశాన్ని పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ తో కలిసి కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెవిన్యూ, పోలీస్, ఇంజనీరింగ్, ట్రాన్స్పోర్ట్ అధికారులు సమన్వయంతో రోడ్డు ప్రమాదాలపై కారణాలు విశ్లేషించి, వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. సమస్యాత్మక రోడ్లను, ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, వేగ నియంత్రణ బోర్డులు ఏర్పాటు చేయడం, తగు జాగ్రత్తలపై కార్యాచరణ చేయాలన్నారు. కూడళ్లు, పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రుల వద్ద మార్కింగ్ చేయాలని, హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయాలని, స్పీడ్ బ్రేకర్లు లేనిచోట ఏర్పాట్లు చేయాలని అన్నారు. కల్వర్టులు, బ్రిడ్జిల వద్ద వైట్ కలర్ పెయింటింగ్, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. ఓవర్ లోడింగ్ వాహనాలు, ట్రాక్టర్లు, ఆటోలపై నిఘా పెట్టాలని, హెల్మెట్ ధరించేలా ద్విచక్ర వాహనదారులకు అవగాహన కలిగించాలని ఆయన తెలిపారు. జిల్లాలో 69 బ్లాక్ స్పాట్ లను గుర్తించి, 53 బ్లాక్ స్పాట్ లను సరిదిద్దినట్లు ఆయన అన్నారు. ప్రమాదకర ప్రదేశాల్లో నివారణకు చేపట్టాల్సిన చర్యలపై ప్రతిపాదనలు ఇవ్వాలన్నారు. రోడ్డు ప్రమాదాలపై నియతకాల సమీక్షలు చేపట్టాలన్నారు. జిల్లా రోడ్డు భద్రత కార్యాచరణ అభివృద్ధిపర్చాలన్నారు. ఎస్టీ ఎస్డీఎఫ్ క్రింద 2023-24 సంవత్సరానికి రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం రూ. 15 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. హైవే రోడ్లపై 20 ప్రదేశాల్లో 40 బ్లింకర్లు ఏర్పాటుకుగాను ఇప్పటివరకు 6 చోట్ల 12 బ్లింకర్ల ఏర్పాటుచేసినట్లు, మిగతా బ్లింకర్ల ఏర్పాటు వారంలోగా పూర్తి చేయాలన్నారు. కళాశాల విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి, వారిని చైతన్య పరచాలన్నారు.
సమావేశంలో పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ మాట్లాడుతూ, జిల్లాలో ఈ సంవత్సరంలో జూన్ వరకు మొత్తం 399 ప్రమాదాల కేసులు నమోదు అవగా, 130 మరణాలు సంభవించినట్లు తెలిపారు. బ్లింకర్ల వద్ద ప్రమాదాలు తగ్గుతున్నట్లు, అవసరమైన అన్నిచోట్లా ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదకర ప్రదేశాలను క్షేత్ర పరిశీలన చేసి, ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన కార్యాచరణ చేయాలన్నారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి, శిక్షణా సహాయ కలెక్టర్ రాధిక గుప్తా, ఆర్ అండ్ బి, పీఆర్ ఇఇ లు శ్యామ్ ప్రసాద్, కెవికె. శ్రీనివాస్, నేషనల్ హైవే పిడి దుర్గాప్రసాద్, జిల్లా రవాణాధికారి కిషన్ రావు, జిల్లా వైద్యాధికారిణి డా. బి. మాలతి, జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, ఎసిపిలు,మునిసిపల్ కమిషనర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.