ఖమ్మం, ఆగస్టు 11(జనవిజయం): రెవిన్యూ సంబంధ అంశాలపై పెండింగ్ లేకుండా తహశీల్దార్లు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం ఐడిఓసి లోని సమావేశ మందిరంలో తహసిల్దార్లతో జీవో 58, 59 అమలు, గృహాలక్షి పథక దరఖాస్తుల పరిశీలన, సాంఘీక సంక్షేమ స్థలాల పట్టాల పంపిణీ, ధరణి మాడ్యూల్ కి సంబంధించి దరఖాస్తుల పరిష్కారం, పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ గురించి కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. జీవో 58 క్రింద వచ్చిన దరఖాస్తుల క్షేత్ర స్థాయి పరిశీలన త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సర్వే నెంబర్ల ప్రకారం గూగుల్ ఎర్త్ లో టైం ఇమేజ్ డౌన్లోడ్ చేయాలని, ఆ ప్రకారం ఎప్పటి నుంచి పొజిషన్లో ఉన్నది చూడాలన్నారు. రోజువారి తనిఖీల లక్ష్యాలు పెట్టుకొని త్వరగా పరిశీలన పూర్తి చేయాలన్నారు. జీవో 59 ద్వారా వచ్చిన దరఖాస్తులకు సంబంధించి, మొదటి విడతలో జారీచేసిన నోటీసులకు గాను డిమాండ్ మొత్తం వసూలుకు చర్యలు వేగవంతం చేయాలన్నారు. రెండో విడత డిమాండ్ నోటీసుల జారీ ప్రక్రియ పూర్తి చేయాలని, డిమాండ్ త్వరగా చెల్లించేలా అవగాహన చేయాలని అన్నారు. గృహాలక్షి పథకం క్రింద ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి 11150, పాలేరుకు సంబంధించి 13712, సత్తుపల్లి కి సంబంధించి 19192, మధిర కు సంబంధించి 16138, వైరా కు సంబంధించి 16295, ఇల్లందు నియోజకవర్గానికి సంబంధించి జిల్లాలోని కామేపల్లి మండలంలో 1979, మొత్తంగా 78467 దరఖాస్తులు అందినట్లు ఆయన అన్నారు. అన్ని దరఖాస్తులు క్రోడీకరించి, ఎక్సెల్ షీట్ లో దరఖాస్తుదారుల వివరాలతో వెంటనే జాబితా తయారుచేయాలని ఆయన తెలిపారు. సాంఘీక సంక్షేమ ఇండ్ల స్థలాలకు సంబంధించి పట్టాల పంపిణీకి చర్యలు వేగం చేయాలన్నారు. గుర్తించిన గ్రామాల్లో ప్లాట్లను అర్హులకు అందజేయాలన్నారు. ధరణి మాడ్యుళ్లకు సంబంధించి ఫార్మాట్ లు ఇవ్వడం జరిగిందని, అట్టి ఫార్మాట్ లో ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు. ధరణి లో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం చేయాలన్నారు. ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రతిపాదనలు ఆమోదించబడినట్లు, కంట్రోల్ టేబుల్ నిర్వహణ సక్రమంగా చేయాలన్నారు. ఇఆర్వో నెట్ లో ఏఇఆర్వో లు లాగిన్ అయి, ప్రతి రిపోర్ట్ ను పరిశీలించాలన్నారు. వారానికి ఒకసారి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటుచేయాలని కలెక్టర్ అన్నారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, కల్లూరు ఆర్డీవో అశోక్ చక్రవర్తి, ఎస్డీసి ఎం. రాజేశ్వరి, కలెక్టరేట్ ఏవో అరుణ, జిల్లాలోని మండల తహశీల్దార్లు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.