- విద్యుత్ పై రేవంత్ వ్యాఖ్యలు అవగాహనారాహిత్యం
- వ్యవసాయాన్ని దండుగ చేసిన పాపం కాంగ్రెస్ దే
- కాంగ్రెస్ పాలనలో అరిగోస పడ్డ రైతాంగం
- ఎండాకాలంలో గ్రామాలకు రావాలంటే ప్రజాప్రతినిధులు భయపడేవారు
- రైతులకు ఉచిత కరెంట్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ వైఖరి పై మంత్రి పువ్వాడ ఫైర్
ఖమ్మం జులై 18 (జనవిజయం):
ఒకప్పుడు కరెంటు కష్టాలకు కారణమే కాంగ్రెస్! అసమర్థ, దుష్టపాలన వల్ల రైతులు అరిగోస పడ్డారు. అందుకే ఆ పార్టీకి ప్రజలు చరమగీతం పాడారు.. అయినా బుద్ధిరాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సిగ్గులేకుండా రైతుల పట్ల, వ్యవసాయం పట్ల నిస్సిగ్గుగా చేస్తున్న కూతలను రైతులు తిప్పికొట్టాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
మంగళవారం రఘునాధపాలెం మండలం వివి పాలెం గ్రామంలో ప్రాథమిక పరపతి సంఘం అధ్వర్యంలో నూతనంగా నిర్మించిన 300 మెట్రిక్ టన్నుల గోడౌన్, షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు.అనంతరం రైతు సభలో మాట్లాడారు.. వ్యవసాయానికి కేవలం 3 గంటల కరెంటు చాలని, ఒక గంట కరెంటుతో ఒక ఎకరం పారించవచ్చని, వ్యవసాయం గురించి తెలిసినోడు మాట్లాడే మాటలేనా? కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలతో రైతులు నవ్వుకుంటున్నారని ఫైర్ అయ్యారు.కాంగ్రెస్ పార్టీ మూర్ఖంగా వ్యవహరిస్తు, తప్పుడు ప్రచారాలకు తెరలేపింది అన్నారు. ప్రజలను అయోమయానికి గురిచేస్తు, వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని, వ్యవసాయాన్ని దండుగ చేసిన పాపం కాంగ్రెస్ ది కాదా అని ప్రశ్నించారు.
అత్యధికంగా ప్రజలు ఆధారపడ్డ వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిన పాపం కాంగ్రెస్ ది కదా.. ఈ రోజు ఈ లోపాలకు కారణం, రైతులు కాంగ్రెస్ పాలనలో అరిగోస పడలేదా చెప్పాలన్నారు..నాడు సాగునీరు అందక, ప్రాజెక్టులు లేక, భూ గర్భ జలాలు అడుగంటి, తాగునీటికి కూడా తల్లడిల్లారని, కరెంటు కష్టాలు, కోతలతో, పవర్ హాలీడేలతో తల్లడిల్లిన విషయాన్ని గుర్తు చేశారు.కాంగ్రెస్ హయాంలో కాలిపోయే మోటార్లు, స్టాటర్లు, ఎండిపోయిన పైర్లు కాలిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ఎరువులు, విత్తనాల కొరత, నకిలీలు, సాగునీరు లేక, కరెంట్ రాక అంతా ఆగమాగం ఉండేదన్నారు.
రైతులు అత్మహత్యలు చేసుకునే దుర్మార్గ పాలన అనాడు కొనసాగిందని, ఎండాకాలంలో గ్రామాలకు రావాలంటేనే ప్రజాప్రతినిధులు భయపడేవారు అని ఆనాటి పరిస్థితులను మంత్రి రైతులకు వివరించారు.అందుకే 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడారని, ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారని, అవగాహన లేని నాయకత్వం, ప్రజలను అయోమయానికి గురి చేసే విధంగా చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే, ఆ పార్టీ పని అయిపోయిందని తేలిపోతున్నదని వివరించారు.
సిఎం కెసిఆర్ వ్యవసాయాన్ని పండుగ చేశారని, ఇదే దశలో సీఎం కెసిఆర్ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, కాళేశ్వరం వంటి ప్రపంచంలోనే అతి గొప్ప ప్రాజెక్టులు కట్టి, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారన్నారు. నేడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో సాగునీరు పుష్కలంగా లభిస్తున్నదని, కోతలు లేని, నాణ్యమైన విద్యుత్ నిరాటంకంగా వస్తున్నదని, దీంతో పంటలుబాగా పండి, రైతులు సంతోషంగా ఉన్నారని, రైతుల పంటలను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ రాష్ట్రంలో రైతును రాజును చేసిన ఘనత సీఎం కెసిఆర్ కే దక్కుతుందన్నారు.
రాష్ట్రంలో భూముల విలువలు పెరిగి రైతుల ఆత్మగౌరవం పెరిగిందని, భూముల విలువలు పెరిగాయని, అమ్మేవారే లేకుండా పోయారని, అలాగే రైతుల ఆత్మగౌరవం పెరిగిందని కొనాలన్నా ఎకరం కోట్లల్లో, గజలు లక్షల్లో ఉందన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడారు.. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేక వ్యాఖ్యలపై మండి పడ్డారు. తీవ్రంగా విమర్శించారు. తమ అనుభవాలను పంచుకున్నారు.కే వలం 3 గంటల పాటు కరెంటు చాలు అనడం అవగాహన రాహిత్యం అన్నారు. ఒక గంటలో ఒక ఎకరం పారడం కూడా సాధ్యంకాదన్నారు.