ఖమ్మం, జూలై 18(జనవిజయం):
వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించిందని, భారీ నుండి అతిభారీ వర్షాలు పడే సూచనలు ఉన్నందున జాగ్రత్తగా వుండి, ప్రాణ నష్టం జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం డిపిఆర్సీ భవనంలోని సమావేశ మందిరంలో రెవిన్యూ, పోలీస్ అధికారులతో కలెక్టర్ వర్ష పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాతావరణ శాఖ సూచన ప్రకారం జిల్లాలోని సింగరేణి, కామేపల్లి మండలాల్లో 100 మి.మి. పైగా, రఘునాథపాలెం, ఏన్కూరు, ఖమ్మం రూరల్ మండలాల్లో 60 నుండి 100 మి.మి. వర్ష సూచన ఉన్నట్లు తెలిపారు. ఉరుములు, పిడుగులతో ప్రాణ నష్టం జరుగుతున్నట్లు, వీటి నివారణకు దామిని (damini) యాప్ పై డౌన్లోడ్ పై అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. దామిని యాప్ తో పిడుగుల గురించి ముందస్తుగా తెలుసుకొనే అవకాశం ఉందని ఆయన తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ చేస్తూ, పరిస్థితులను ఎదుర్కొనేలా చర్యలు చేపట్టాలన్నారు. పిఆర్, ఆర్ అండ్ బి, ఇర్రిగేషన్ ఇంజనీర్లు సంబంధిత తహసిల్దార్లతో టచ్ లో వుండాలన్నారు. ఇర్రిగేషన్ ఏఇ లకు వారి వారి పరిధిలోని చెరువులు, కుంటలు, నీటి వనరులపై పూర్తి అవగాహన వుండాలన్నారు. వాగులు పొంగిపొర్లి కల్వర్టుల వద్ద ప్రవాహం అధికమైన చోట రాకపోకలు జరపకుండా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ప్రమాదానికి ఆస్కారం వున్న రహదారిని మూసివేయాలని, రాకపోకలు జరపకుండా భద్రత ఏర్పాటుచేయాలని ఆయన అన్నారు. ప్రమాదమున్న చెరువుల వద్ద ఇసుక బస్తాలు సిద్దం చేసుకోవాలన్నారు. వర్షం లో చేపలు పట్టుటకు వెళ్లకుండా చూడాలన్నారు. లోతట్టు ముంపు ప్రదేశాల్లో వర్షపు నీరు ఇండ్లలోకి రాకుండా తగుచర్యలు చేపట్టాలన్నారు. అధికారులు ప్రధాన కార్యస్తానంలోనే ఉంటూ, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షణ చేయాలని, ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, శిక్షణా సహాయ కలెక్టర్ రాధిక గుప్తా, అదనపు డిసిపి ఏ.ఎస్.సి. బోస్, ట్రైనీ ఐపీఎస్ అవినాష్ కుమార్, ఆర్డీవో సూర్యనారాయణ, ఎస్డీసి దశరథం, ఏసీపీలు, తహశీల్దార్లు, పోలీస్, రెవిన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.