పాలేరు నుంచి పోటీకి తుమ్మలకు లైన్ క్లియర్?!
- గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేసీఆర్
- ఉమ్మడి జిల్లా ఎన్నికల వ్యూహంలోనూ తుమ్మలకే ప్రాధాన్యం
ఖమ్మం,జూలై 25(జనవిజయం):
పాలేరు విషయంలో సీయం వ్యూహాత్మకంగా ఎత్తుగడ వేయబోతున్నారు. ప్రత్యర్ధుల కదలికలను చిత్తు చేసే విధంగా, ఖమ్మం జిల్లాలో నెలకొన్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా పాలేరు టికెట్ తుమ్మల నాగేశ్వరరావుకే కేటాయించనున్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. ప్రస్తుత ఎం.ఎల్.ఏ కందాలను ఎం.ఎల్.సీ కి ఒప్పించి తుమ్మల ద్వారానే పాలేరును కైవసం చేసుకోవాలనే యోచనలో అధినాయకత్వం ఉంది. వరుసగా జరుగుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా పాలేరు నియోజకవర్గం నుండి సీనియర్ నేత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని రంగంలోకి దింపబోతున్నారు. దీంతో తుమ్మల పట్టుదల నెగ్గబోతోంది. ఆయన పాలేరు నుండే పోటీ చేయాలనే గట్టి సంకల్పంతో ఉన్నారు.
జిల్లాలో ఉండే రాజకీయ వాతావరణాన్ని పసికట్టగలిగిన కాకలు తీరిన నేతగా అనుభవశాలిగా ఎన్నికల వ్యూహరచనల్లో నిపుణుడిగా తుమ్మలకు పేరు ఉన్న విషయం విధితమే. దీనికి అనుగుణంగానే రాజకీయ చదరంగంలో గడి గడిని అవపోసన పట్టిన కెసిఆర్, ఖమ్మం జిల్లా పట్ల సమగ్ర అవగాహన కలిగిన తుమ్మల నాగేశ్వరరావు వీరిద్దరి సమాలోచనలతో పాలేరు టికెట్ మాత్రమే కాకుండా మిగిలిన అన్ని నియోజకవర్గాల అభ్యర్థుల విషయంలో కూడా తుమ్మల నాగేశ్వరరావు సూచన మేరకే అభ్యర్థుల ఎంపిక ఉండబోతోందని తెలుస్తోంది.
ఖమ్మం జిల్లాకు కొన్ని వేల కోట్ల నిధులను నిరాటంకంగా అందించిన కెసిఆర్ ప్రభుత్వం తుమ్మల నాగేశ్వరరావు చరిష్మాను ఏమాత్రం తగ్గించకుండా జిల్లాలో తమ పార్టీ గెలుపు అవకాశాలపై వ్యూహరచనకు ప్రణాళిక బద్ధమైన ఆచరణకు సంబంధించి గురుతర బాధ్యతను తుమ్మలపై ఉంచబోతున్నట్లు సమాచారం.
ఇప్పటికే పాలేరు నియోజకవర్గంలో అన్ని మండలాలలో విస్తృత పర్యటనలలో ఉన్న తుమ్మల పాలేరు ప్రజలకు అందుబాటులో ఉంటూ తన పలుకుబడితో సాగునీటి ప్రాజెక్టులకు ఎత్తిపోతల పథకాలకు నేషనల్ హైవేస్ కి కూడా అవిశ్రాంతం గా నిధులను సమకూర్చి పెట్టిన విషయం పాలేరు ప్రజల మనసులో ఇప్పటికీ ఆయన స్థానం సుస్థిరం అని తెలియజేస్తోంది. వివిధ సాగునీటి పథకాలు, నూతన జాతీయ రహదారుల నిర్మాణం ద్వారా తమ హయాంలో జరిగిన అభివృద్ధి విషయంలో తుమ్మల నాగేశ్వరరావు చొరవను ముందుంచి ఎన్నికల సమయంలో అభివృద్దే తమ ఎజెండాగా ముందుకు పోయేలా బీఆర్ఎస్ అధిష్టానం యోచన గా కనబడుతోంది.