Thursday, February 22, 2024
Homeవార్తలురైతుబాంధవుడు బోడేపూడి

రైతుబాంధవుడు బోడేపూడి

నేడు 26వ వర్ధంతి

చిరుప్రాయంలో పాలేరుగా తన జీవితాన్ని ప్రారంభించి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సిపిఎం పక్ష నాయకుడిగా మార్క్సిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా బాధ్యతలు నిర్వహించారు అమరజీవి బోడేపూడి వెంకటేశ్వరరావు. ఆయన జీవితం ఆదర్శనీయం. నీతి ,నిజాయితీ ,తెలుగు రైతు రూపానికి నిలువెత్తు నిదర్శనం బోడేపూడి. తన ప్రాంతంలో ప్రగతిశీల ఉద్యమాలను, బలమైన మార్క్సిస్టు ఉద్యమాన్ని నిర్మించి మార్క్సిస్టు ఉద్యమ నేతగా ఒక విప్లవ ప్రజా నాయకుడిగా ఆదర్శ రాజకీయ వేత్త గా రైతు బాంధవుడిగా అత్యంత గౌరవ మన్ననలను పొందిన మహా వ్యక్తి బోడేపూడి వెంకటేశ్వరరావు.
మార్క్సిజం లోని సజీవసారాన్ని గ్రహించి లెనిన్ నిర్వచించినట్లు గా నిర్దిష్ట పరిస్థితుల -నిర్దిష్ట విశ్లేషణ అనే అంశం ఆధారంగా సామాజిక ,ఆర్థిక ,సాంస్కృతిక బహుముఖ వైవిధ్యం ఉన్న ఖమ్మం జిల్లా లో మార్క్సి,స్టు పార్టీ ఉద్యమ విస్తరణ కు కృషి చేశారు.
తెలంగాణ పోరాటం మట్టి లోంచి మహావీరులను సృష్టించింది .కేవలం ప్రాధమిక విద్య అభ్యసించిన బోడేపూడి జీవితం అంతా ప్రజా విశ్వవిద్యాలయం లో అధ్యయనం చేసి శాసనసభ లో తనదైనశైలిలో అందరిని మెప్పించిన వక్త.
చిన్నతనంలో తండ్రి మరణించడంతో మేనమామల గ్రామం, వైరా మండలం,గండగలపాడుకుతల్లితో బ్రతుకుదెరువు కోసం వచ్చి, మేనమామ ఇంట్లోనే పాలేరు గా తన జీవితాన్ని ప్రారంభించి, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట ప్రభావంతో కమ్యూనిస్టుగా మారి కడవరకు పేదల, రైతుల, కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషిచేసిన యోధుడు బోడేపూడి. రాత్రి పాఠశాలలో పెద్దబాలశిక్ష నేర్చుకొని గ్రామంలో పెద్దల సలహా మేరకు పాఠశాల ప్రారంభించి పిల్లలందరికీ విద్యాబుద్ధులు నేర్పే బాధ్యత తీసుకున్నారు .
తను నివాసమున్న గ్రామం తో పాటు సమీప గ్రామాల్లో నాడు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న రైతాంగ సాయుధ పోరాటం అనేకమందిని ఆకర్షించింది. బోడేపూడి పై కూడా పోరాట ప్రభావం పడింది. పాలేరు గా పనిచేస్తూనే ఆంధ్రప్రాంతంనుంచి వచ్చే పార్టీ రహస్య సమాచారాన్ని, పత్రికలు సింగరేణి కాలరీస్ కార్మిక నాయకుడు కామ్రేడ్ శేషగిరి రావుకు కొత్తగూడెం కాలినడకన వెళ్ళి అందిస్తూ కొరియర్ గా మారారు. గ్రామంలోని అనేకమంది అరెస్టు కావడంతో తాను రహస్యం గా మద్రాసు చేరుకొని ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేయడం జరిగింది .మద్రాసు నుంచి తిరిగి వచ్చి కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణ బాధ్యతలు చేపట్టి నల్లమల గిరిప్రసాద్ ,నల్లమోతు పిచ్చయ్య తో కలిసి మధిర తాలుకా లో బలమైన పునాది వేయటం జరిగింది .1964 లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ లో సైధాంతిక విబేధాల వలన వచ్చిన చీలిక తో సుందరయ్య లైన్ బలపరిచి సిపిఎం వైపు నిలిచారు. గిరిప్రసాద్ నాటి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి పిచ్చయ్య సిపిఐ వైపు ఉండటం జరిగింది. బోడేపూడి ,చింతలపూడి జగయ్య ,కట్టా వెంకటనర్సయ్య తో కలిసి మధిర ప్రాంతంలో సిపిఎం నిర్మాణం చేశారు .బోడేపూడి చిర్రావూరి లక్ష్మి నర్సయ్య, మంచికంటి రామకిషన్ రావు,కెఎల్ నరసింహారావు ,పర్సా సత్యనారాయణ టిబి ఆర్ చంద్రం లతో కలిసి ఖమ్మం జిల్లా లో సిపిఎం విస్తరణ కు కృషి చేశారు .సిపిఎం జిల్లా కార్యదర్శి గా దశాబ్దకాలం పనిచేశారు. వర్గపోరాటాల ఉక్కు మనిషులు రావెళ్ళ సత్యం ,ఏలూరి లక్ష్మి నారాయణ, తమ్మినేని వీరభద్రం లకు మార్గదర్శకత్వంవహిస్తూ ఉద్యమాన్ని ముందుకు నడిపారు. ఈ కాలంలో సిపిఎం ఉద్యమం తీవ్రస్థాయిలో అధికారపక్షం అతివాద మితవాద భౌతిక దాడుల తో నిర్భందం ఎదుర్కొంది. వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన ఉద్యమ యువ నేతలు గండ్లూరి కిషన్ రావు ,బండారు చంద్రారావు , బత్తుల బీష్మరావు దారుణంగా హత్యలకు గురయ్యారు . పదులు సంఖ్య లో గ్రామ స్థాయిలో కార్యకర్తలు హత్య చేయబడ్డారు.
వందల సంఖ్యలో ఆస్తులు కోల్పోయిన కుటుంబాలు. వేలాది మంది జైలు కు వెళ్ళారు . నాటి పరిస్థితి నేడు ఊహించలేము . ఈకాలంలో మార్క్సిస్టు పార్టీ జిల్లా నలుమూలల విస్తరించి ఘన విజయాలు సాధించింది. భూ పోరాటాలు ,కూలీ రేట్లు, రైతు సమస్యల పరిష్కారం లో సిపిఎం జిల్లా ప్రజలు గుండె లో సుస్థిర స్థానం సంపాదించుకున్నది. నేడు భౌతిక దాడుల లేవు. మానిసిక,ఆర్థిక దాడి కొనసాగుతున్న కాలం ప్రశ్నించేవారిని దేశ ద్రోహులుగా ముద్ర వేసి బెయిల్ లేని కేసు లో ఇరికించే కాలం మన కాలం .

పిన్నవయస్సు నుంచి చనిపోయేవరకు ఆగస్టు ఐదు 1997 వరకు ఎర్ర జండా మోస్తూ ప్రజల్లో తనదైన ముద్ర వేసిన రైతు బాంధవుడు బోడేపూడి వెంకటేశ్వరరావు. ఖమ్మం జిల్లాలో బలమైన మార్క్సిస్టు పార్టీ ఉద్యమం కు పునాదులు వేసిన వారిలో బోడెపూడి ఒకరు. 1985 నుంచి వరసగా 89,94, ఎన్నికల లో మధిర అసెంబ్లీ నుంచి గెలుపొందిన బోడెపూడి 89 నుంచి మరిణించేవరకు శాసనసభలో సిపిఎం పక్ష నాయకుడిగా బాధ్యతలు నిర్వహించారు.,రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గా విస్తృత సేవలు అందించటం జరిగింది .
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పునః నిర్మాణం లో నేలకొండపల్లి రైతు మహాసభ తొలి అంకం . తుదిశ్వాస విడిచే వరకూ రైతాంగ ఉద్యమం లో భాగస్వామి . గిట్టుబాటు ధరలు, పంటనష్టపరిహారం కోసం ,సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం జరిగిన అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించిన రైతు నేత. సాగు నీటి అభివృద్ధి కి సంబంధించి వెనుకబడ్డ ప్రాంతాల పై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని శాసనసభ లో నొక్కి చెప్పే వారు. కరువు , వరదలు తో పంటలు దెబ్బతిన్న సమయం లో విస్తృతం గా పర్యటించి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వం పై ఒత్తిడి పెంచే వారు. జిల్లాలో దళిత గిరిజన రైతు లకు, సన్న చిన్న కారు రైతుల కోసం, వాగులు , ఏరులు పై లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేయించారు, ఇప్పటికీ అవి ఉపయోగకరంగా ఉన్నాయి .
వైరా రిజర్వాయర్ ఆయకట్టు రెండు పంటలకు నీరు అందించే ప్రయత్నం చేశారు. సాగర్ ఆయకట్టు లో చివరి భూములకు సాగునీరు అందించేందుకు కాల్వల పై తన శరీరం సహకరించకపోయినా తిరిగి పంటలను కాపాడిన రైతు బాంధవుడు బోడేపూడి.
1950 దశకం ప్రారంభంలో వైరా కమిటీ స్కూల్ ఏర్పాటు కై పాటిబండ్ల సత్యనారాయణ , చింత నిప్పు నర్సయ్య లతో కలిసి పునాది వేశారు . కెవిసిఎం డిగ్రీ కళాశాల ఏర్పాటు తోపాటు జిల్లాలో విద్యా వ్యాప్తి కి కృషి చేశారు. విద్యార్థి యువజన సంఘాల ను ప్రోత్సహించారు.
సహకార సంఘాల నిర్మాణం లో ముఖ్యపాత్ర పోషించారు. వైరా విశాలపరపతి సంఘం జిల్లా లో నేటి కి పెద్ద సంఘం గా రైతు లకు సేవలు అందించటం వెనుక బోడేపూడి పాత్ర ముఖ్యమైనది.
సాంస్కృతిక ఉద్యమం లో భాగస్వామి, ఆదర్శ వివాహాలు జరపటం లో ఆచార్యులు గా ఉండే వారు ,కళలు సాహిత్యం పట్ల ఆయన ఎంతో ఆసక్తి చూపేవారు.ఆప్యాయతానురాగాలకు బోడేపూడిది పెట్టింది పేరు . చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా ఆప్యాయంగా పిలవడం , సాధారణ రైతులు వ్యవసాయ కార్మి కులే కాకుండా మధ్యతరగతి ప్రజలు ఉద్యోగులు సైతం బోడేపూడి ని రాజకీయా లకు అతీతంగా అందరూ ఇష్టపడే వారు.

వరుస మూడు ఎన్నికల్లో మధిర శాసనసభ నియోజకవర్గం నుంచి ఓటమి చెందినా ప్రజల ను అంటిపెట్టుకుని ఉండి సేవలందించిన బోడేపూడి తిరిగి వరుస మూడు ఎన్నికల్లో అదే స్థానంలో విజయం సాధించి అభివృద్ధి లో చెరగని ముద్ర వేశారు. మన ముఖ్యమంత్రి కెసీఆర్ కలల పధకం మిషన్ భగీరథ ను 1996 లో నే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ని ఒప్పించి వైరా రిజర్వాయర్ పై సుజల స్రవంతి ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రజలకు ప్లోరైడ్ రహిత మంచి నీరు అందించే ప్రయత్నం చేశారు. బోడేపూడి వెంకటేశ్వరరావు సంతాప సభలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయం గా వైరా ప్రాంత ప్రజలు ఫ్లోరైడ్ నీటీ తో పడుతున్న ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చి పట్టు పట్టి సుజల స్రవంతి సాధించారని సుజల స్రవంతి కి బోడేపూడి సుజల స్రవంతి గా నామకరణం ప్రభుత్వం చేస్తుంది అని ప్రకటించారు. బోడేపూడి సుజల స్రవంతి నుండి7 మండలాల ప్రజలకు మంచినీరు సరఫరా జరుగుతుంది . నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఖమ్మం జిల్లా లో అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన కు వచ్చినప్పుడు తనతోపాటు హైలీకాప్టర్ లో బోడేపూడి ని తీసుకువెళ్ళి గౌరవించారు .వైరుధ్యాలు ఉన్న ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు ,అధికారులు బోడేపూడి ని గౌరవించే వారు. ప్రజలను వశపరచుకునే ఆహ్లాదకరమైన వ్యక్తిత్వం ఆయనది.

ఖమ్మం జిల్లా కేంద్రం సిపిఎం కార్యాలయం లో బోడేపూడి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసి విశ్రాంత ఉపాధ్యాయులు ,విద్యార్థుల కు తక్కువ ఖర్చుతో వసతి, శిక్షణ సౌకర్యాలు కల్పించటం జరుగుతుంది. వైరా సిపిఎం కార్యాలయం బోడేపూడి వెంకటేశ్వరరావు భవన్ లో 98 నెలల నుంచి బోడేపూడి కళానిలయం ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షలు నెలకు సరిపడా మందులు వంద రూపాయలకు వేలాది మంది ప్రజలకు విజయవాడ ప్రముఖ వైద్యులు గోపాళం శివన్నారయణ సహాకారం తో ఖమ్మం పట్టణం ప్రముఖ వైద్యులు డాక్టర్ చీకటి భారవి , డాక్టర్ రంగారావు , సుబ్బారావు గారు ప్రత్యక్ష భాగస్వామ్యం తో 30 మంది వాలంటీర్ల కృషి తో అందించటం జరుగుతుంది.

ప్రజా సమస్యలు పరిష్కరించడంలో బోడేపూడి అనుభవాలను , సమాజాన్ని మార్చాలనే ప్రయత్నం లో ఆయన స్వయంగా ఎంతగానో మారి మహోన్నుతుడయ్యాడు . ఆయన వదిలి పెట్టిన ఆ మహత్తర వారసత్వాన్ని నిస్సందేహంగా కొనసాగిద్దాము.

-బొంతు రాంబాబు, 9490098205, బోడేపూడి కళానిలయం వైరా,

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments