Saturday, February 24, 2024
Homeరాజకీయంపివి సంస్కరణలే నేటికీ దిక్సూచి

పివి సంస్కరణలే నేటికీ దిక్సూచి

  • దేశగతిని మార్చిన అపర మేధావి
  • భారతరత్న ఇచ్చి గౌరవించిన బిజెపి

హైదరాబాద్‌,ఫిబ్రవరి9(జనవిజయం):

భారతదేశ ఆర్థిక స్థితిగతులను అనూహ్యంగా మార్చి పారిశ్రామిక ప్రగతికి గేట్లు తెరిచిన ఆర్థిక సంస్కర్త దివంగత పివి నరసింహారావు. అందుకే దేశం ఇవాళ విదేశాలతో పోటీ పడేలా చేయడం తన దూరదృష్టితో నిర్ణయాలు తీసుకున్నారు. ఎప్పటినుంచో పివికి భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్‌ ఎట్టకేలకు నెరవేరింది. పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో ఆయనను పూర్తిగా విస్మరించినా.. బిజెపి ప్రభుత్వం పివిని స్మరించింది. ఆయన సేవలను గుర్తించింది. ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించింది. 2004 డిసెంబర్‌ 23న  పివి మరణించారు. ఆయన మరణంతో దేశం గొప్ప మేధావిని కోల్పోయింది. ఆర్థిక పరిస్థితులను అంచనా వేసుకు న్నప్పుడు పివికి ముందు పివి తరవాత అన్న లెక్కలు వేసుకునే స్థితి చెప్పుకోక తప్పదు. రాజకీయాల్లో అరుదైన వ్యక్తిత్వాలు కలిగినవారు బహు అరుదుగా ఉంటారని పివి తనరాజకీయ జీవితంలో నిరూపిం చారు. అలాగే పదవుల కోసం వెంపర్లాడుతున్న నేటి రాజకీయాల్లో

పదవులు వాటంతటవే వెతుక్కుంటూ రావడం…వాటికి వన్నె తేవడం కూడా బహు అరుదు. ఓ  మహానుభావుడు పివి రూపంలో భారతదేశానికి సాక్షాత్కరించడం కూడా దేశం చేసుకున్న అదృష్టంగా  చూడాలి. నిజానికి ఎక్కడో వరంగల్‌ జిల్లా వంగరలో పుట్టి దేశానికి దిక్సూచిగా అయిన తీరు గమనిస్తే ఎక్కడా ఆయన రాజకీయాలు చేయలేదు. రాజకీయాలు ఆయన అసవరాన్ని గుర్తించాయి. ఇందిర అయినా…రాజీవ్‌ అయినా ఆయనలోని అపార ప్రతిభను గుర్తించి చేరదీసారే తప్ప మరోటి కాదు. రాజకీయాల్లో స్థితప్రజ్ఞత ఉన్న అరుదైన నేతల్లో పివి ముందుంటారు. ఆయన స్వార్థం కోసం ఏనాడూ రాజకీయాలు చేయలేదు. అలాగే ఆయనలోని స్వార్థం దేశానికి మంచి చేయాలన్న తపన తప్ప మరోటి కాదు. రాజకీయాల్లో రాణించడం కోసం ఎత్తులు పై ఎత్తులు వేస్తూ..ఎదుటి వారిని బురిడీ కొట్టించడం…. అవసరమైతే ప్రత్యర్థులను మట్టుపెట్టడం లాంటి నేటి రాజకీయాల్లో అరుదైన వ్యక్తిత్వం కలిగిన మహాను భావుడు దివంగత పివి నరసింహారావు.

ఆయన ప్రధాని గా ఉన్నకాలంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలే ఇవాళ దేశానికి అన్నం పెడుతున్నాయి. మన యువత విదేశాలకు ఉద్యోగాల వేటకు వెళ్లగలుగు న్నారు. ఆయన రాజకీయాల్లో స్వశక్తితతో,ప్రతిభతో రాణించారే తప్ప అడుగులకు మడుగులు ఒత్తి రాలేదు. ఆ మహానభావుడు మన తెలుగు వాడైనందుకు మనమంతా గర్వపడాలి. అలాంటి రాజకీయవేత్త ఒకరు భారత ప్రధాని అయినందుకు మనమంతా ఎంతో అదృష్ట వంతులం. అలాంటి వ్యక్తిని నీచాతినీచంగా అవమానించిన ఘనత కాంగ్రెస్‌ది, దాని అధినేత్రి సోనియాది.  పివి కాంగ్రెస్‌కు ఎంతో పేరు తెచ్చారు. ఆయన పాలనా సంస్కరణలతో దేశానికి అలాగే కాంగ్రెస్‌ పార్టీకి చరిత్రలో లిఖించదగ్గ ఘట్టాలను అందించారు. సానుకూల, ప్రతికూల రాజకీయాలను ఆమూలాగ్రం ఔపోసన పట్టిన ఘటికుడు ఆయన. అందుకే వాటిని అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా పాలన చేసి..తిరుగలేని నేతగా రుజువు చేసుకున్నారు.

నిజానికి పివి హయాం తరవాత సంకీర్ణాలు మొదలయ్యాయి. పివి కూడా ఆనాడు సంకీర్ణ రాజకీయాలకు తెరతీసి ఉంటే దేవేగౌడ స్థానంలో మళ్లీ పివియే ప్రధాని అయ్యేవారు. తనకున్న స్థానాలతో తానే మరోమారు ప్రధానిగా అయ్యేందుకు సంకీర్ణ రాజకీయాలు నెరపి ఉంటే భారత చరిత్ర మరోలా ఉండేది.  ఆయనకు ఆనాడు ఈ ఆలోచన రాక కాదు. కానీ కుళ్లు రాజకీయాలు మోయడం ఇష్టం లేకే ఆయన అలాంటి ప్రతిపాదనలు చేసి ఉండక పోవచ్చు.అయినా ఆయన పాలనా కాలం ఓ స్వర్ణయుగం. ముఖ్యమంత్రిగా,కేంద్రమంత్రిగా,ప్రధాన మంత్రిగా,ఆర్థిక సంస్కరణ లను అద్వితీయంగా అమలుపరిచిన పాలనాదక్షుడు పీవీ నరసింహరావు. అందుకే బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయన చరిత్ర పుటల్లో నిలిచిపోతారు. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ,ఊహించని రీతిలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి మార్కెట్‌ సరళీకరణ విధానాన్ని రూపొందించి భారత్‌కు మార్గాన్ని చూపారు. ఇప్పుడా మార్గంలోనే మన ఆర్థిక వ్యవస్థ నడుస్తోంది. ఆయన చూపిన బాట నుంచి పక్కకు తప్పినప్పుడల్లా మళ్లీ సంక్షోభాలు ఎదుర్కొంటున్నాం. పీవీ జీవిత కాలంలో అనేక సందర్భాలలో, ఆయనను తక్కువగా అంచనా వేసిన కాంగ్రెస్‌ ఇక ఎప్పటికీ కోలుకోదు. ఆయనకు చేసిన అవమానం అంతాఇంతా కాదు. కానీ పదవుల కోసం వెంపర్లాడే వారు పివిని ఆవమానించినా పట్టించు కోకుండా మిన్నకుండి ఇవాళ ఆయన గురించి మాట్లాడుతున్నారు.ఆయనను భారతరత్నతో గౌరవించాలన్న డిమాండ్‌ ఉన్నా…సంకుచిత రాజకీయాల కారణంగా దూరం పెట్టారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments