Thursday, October 5, 2023
Homeమై వాయిస్పువ్వాడ‘అజేయుడు’ కానున్నారా?!

పువ్వాడ‘అజేయుడు’ కానున్నారా?!

పువ్వాడ‘అజేయుడు’ కానున్నారా?!

-ఉమ్మడి ఖమ్మంలో ఇక ఆయనేనా!
-పొంగులేటి,తుమ్మల లేని లోటు భర్తీ చేస్తారా?
-అభివృద్ధి ప్రదాతగా పేరు నిలుపుకుంటారా?

(పల్లా కొండలరావు,ఖమ్మం)

పువ్వాడ అజెయ్ కుమార్. రాష్ట్ర రవాణా శాఖా మాత్యులు. గత ఎన్నికలలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికారపార్టీ తరపున గెలిచిన ఏకైక ఎం.ఎల్.ఏ. తెలంగాణలో ప్రస్తుతం ఖమ్మం రాజకీయం హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో పువ్వాడ అజెయ్ కుమార్ కీలకం కానున్నారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలలో పొంగులేటి పార్టీ వీడారు. తుమ్మల మౌనంగా ఉంటున్నారు. తుమ్మలకు సీఎం కేసీయార్ ప్రాధాన్యతనిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నా ఆచరణలో అలాంటి చర్యలు లేవు. బీఆర్ఎస్ అధినేత కేసీయార్ వ్యూహమేమిటన్న చర్చలో పువ్వాడ అజెయ్ కుమార్ పేరు గట్టిగానే మోగుతోంది. అజెయ్ నాయకత్వంలోనే 2023 ఎన్నికలలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ముందుకు వెళుతోందనిపిస్తోంది. ఈమేరకు కేసీయార్ ఆయనకు అభయం ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది.

పువ్వాడ అజెయ్ కుమార్ గతంలో తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నపుడు కొన్ని అవమానాలు, ఇబ్బందులు ఎదురైనా భరిస్తూ ఓపికగా ఉండడం ప్రస్తుతం కలసి వచ్చిందని చెప్పాలి. తనవల్ల అధిష్టానానికి వర్గపోరు సమస్య లేకపోవడం,ఆర్ధికంగా బలమైన శక్తి కావడం, కేటీయార్ కు క్లాస్మేట్ కావడం, మంత్రిగా ఉండి పాలేరులో 2018లో తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోవడం,అధికార పార్టీలో గెలిచిన ఏకైక ఎం.ఎల్.ఏ కూడా ఆయనే కావడం వల్ల ప్రస్తుత మంత్రిగా కొనసాగడానికి కారణమని చెప్పాలి. ఒకే సామాజిక వర్గానికి చెందినవారైనప్పటికీ ముఖ్యమంత్రి కేసీయార్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అజెయ్ కంటే తుమ్మలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఖమ్మంలో పువ్వాడ అజెయ్ కుమార్ చేతిలో ఓడిన తుమ్మలను బీఆర్ఎస్ లో చేర్చుకుని ఎం.ఎల్.సీ ని చేసి, మంత్రిని చేసి అడిగినన్ని నిధులు, అపారమైన గౌరవం ఇస్తే ఉమ్మడి ఖమ్మంలో ఖమ్మం మినహా అన్ని సీట్లు ఓడిపోవడం పాలేరులో ఆయనసైతం ఓడిపోవడం కేసీయార్ కు అసహనం కలిగించింది.

పైగా సత్తుపల్లి ఎంఎల్ఏ సండ్ర వెంకటవీరయ్య కానీ, కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లోకి వచ్చిన కాంగ్రెస్ ఎం.ఎల్.ఏ లు కానీ తుమ్మలతో సఖ్యతగా లేరు. వీరే కాకుండా ఇతర నేతలకు కూడా తుమ్మల నాయకత్వం కంటే అజెయ్ కుమార్ అయితే కాస్త స్వతంత్రత ఉంటుందని భావిస్తున్నారు. ఖమ్మం నియోజకవర్గం మినహా మిగతా చోట్ల అజెయ్ అయితే జోక్యం తక్కువగా ఉంటుందని అనుకుంటున్నారు. ప్రస్తుతం మంత్రిగా కూడా మంచి పేరే తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఖమ్మంను అభివృద్ధి చేయడంలో ప్రత్యర్ధులు సైతం మెచ్చుకునే విధంగా ఆయన పనిరాక్షసుడిగా దూసుకుపోతున్నారనే చెప్పాలి. ముఖ్యమంత్రి నుండి నిధులు రాబట్టుకోవడంలోనూ, వాటిని వేగంగా సద్వినియోగం చేయడంలోనూ అజెయ్ మంచిపేరే తెచ్చుకున్నారు. దీనితో పాటు ఆయన ఖమ్మం మినహా మిగతా ఏ నియోజకవర్గంలోనూ అతిగా జోక్యం చేసుకోకపోవడం, అధిష్టానం ముందు హెడ్ స్ట్రాంగ్ రాజకీయాలు చేయకపోవడం ప్రస్తుతం కలసివస్తున్న ప్రధాన అంశం. ముఖ్యంగా అహంభావం, నోటిదూల లేకపోవడం పార్టీనేతలలోనూ, అధికారులలోనూ అజెయ్ కు సానుకూల అంశంగా మారిందనే టాక్ ఉంది.

పొంగులేటి పార్టీ వీడినా ఖమ్మంలో గతంలో వచ్చిన ఒక్క సీటుకు ఢోకా లేదనే అంచనాతో అధిష్ఠానం ఉంది. అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప ఖమ్మంలో బీఆర్ఎస్ కు గతంలో వచ్చిన ఒక్క సీటు తగ్గే చాన్స్ లేదు. అది కూడా మంత్రి పువ్వాడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం కావడం గమనార్హం. మిగతా నియోజకవర్గాలలో తనకున్న సర్వే రిపోర్టులు ప్రకారం స్వయంగా నిర్ణయం తీసుకుంటే అమలు చేయడానికి అజెయ్ ద్వారా అయితే తేలికవుతుందనే నమ్మకం ప్రస్తుతం కేసీయార్ కు ఉందనే చెప్పాలి. మొదట్లో అజెయ్ సామర్ధ్యంపై అంతగా నమ్మకం లేని కేసీయార్ మంత్రిని చేశాక అజెయ్ పనితీరుని చూసి క్రమంగా మెచ్చుకుంటున్నారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాలలో వినిపిస్తున్నాయి. కేసీయార్ కు అజెయ్ సామర్ధ్యంపై అనుమానాలున్నా కేటీయార్ ప్రోత్సాహం ఉంది. మరో కోణంలో బీఆర్ఎస్ కు వామపక్షాలకు మధ్య పొత్తు కుదిరితే కూడా తుమ్మల కంటే అజెయ్ ద్వారానే ఎక్కువ సఖ్యత ఉంటుంది. అజెయ్ తండ్రి సీనియర్ కమ్యూనిస్టు నేత పువ్వాడ నాగేశ్వరరావు కనుసన్నలలో ఉండే సిపిఐ ఇప్పటికే అజెయ్ తో సఖ్యతగానే ఉంటుంది. ఇక ప్రత్యక్ష పొత్తు అయితే అది బీఆర్ఎస్ కు అదనపు బలమే అవుతుంది.సిపిఎం లో ఖమ్మం నగరంలో కొంత మంత్రిపై అసహనం ఉన్నా బలమైన శత్రువు బిజెపీని ఎదుర్కోవడం అనే అంశం తెరపైకి వస్తే ఖచ్చితంగా అజెయ్ కు సపోర్టు చేసి తీరతారు. ఇన్ని రకాలుగా పాజిటివ్ అంశాలున్నందున పువ్వాడ అజెయ్ కుమార్ రానున్న రోజులలో ఉమ్మడి ఖమ్మంలో చక్రం తిప్పనున్నారనే వాదన బలంగా వినపడుతోంది. కాలం కలసి వచ్చి ప్రజలు దీవించి బీఆర్ఎస్ మూడోసారి తెలంగాణలో అధికారం చేపడితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పువ్వాడ అజెయ్ కుమార్ అజేయుడుగా దూసుకుపోవడాని అన్నీ శుభ శకునాలే కనిపిస్తున్నాయి.

అయితే ఎట్టిపరిస్తితులలోనూ అజెయ్ ను ఓడించాలన్న కసితో కాంగ్రెస్ తో పాటు కొన్ని శక్తులు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. పువ్వాడపై పొంగులేటిని పోటీకి దింపాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పొంగులేటి ఖమ్మంలో పోటీచేసేందుకు అంత సుముఖంగా లేరంటున్నారు. కమ్మ సామాజిక వర్గం ఓట్లు బలంగా ఉన్నందున రెడ్డి సామాజిక వర్గంకు చెందిన పొంగులేటి ఖమ్మం కంటే కొత్తగూడెం లేదా పాలేరులలో పోటీకి దిగేందుకు సుముఖంగా ఉన్నారు. అయినా ఆయననే రంగంలోకి దింపే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఖమ్మం నగరంలో అవినీతి, భూదందాలు, అక్రమ కేసుల అంశాలు ప్రచారాస్త్రాలుగా మారబోతున్నాయి. బీఆర్ఎస్ లో అజెయ్ పై కోపంతో ఉన్న కార్పోరేటర్లను తనవైపు తిప్పుకోవాలని పొంగులేటి ప్రయత్నిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ దిశగా పొంగులేటి గ్రౌండ్ వర్క్ నడుపుతున్నారు. పరోక్షంగా తుమ్మల నాగేశ్వరరావు సహకారమూ తీసుకోవాలని చూస్తున్నారు. ఇవన్నీ ఆచరణలో ఎంతమేరకు ఫలిస్తాయి. ప్రజలలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత స్థాయి ఎంత అనేది కూడా అజెయ్ గెలుపును ప్రభావం చూపనుంది. ప్రతిపక్షాల ప్రయత్నాలు, ప్రజల వ్యతిరేకత తీవ్రంగా ఉంటే తప్ప అజెయ్ ను ఓడించడం అంత తేలిక కాదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనాగా ఉంది. ఇప్పటికే రాజకీయ ఉద్దండులు తుమ్మల నాగేశ్వరరావు, నామా నాగేశ్వరరావులను ఓడించిన పువ్వాడ జిల్లాలో శీనన్న గా బ్రాండ్ వేయించుకుని కాంగ్రెస్ లో బలమైన నేతగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఓడించగలిగితే పువ్వాడ అజెయ్ కుమార్ హ్యాట్రిక్ కొట్టడమే కాదు అత్యంత బలమైన నాయకుడిగా తయారయ్యే ఛాన్స్ ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments