జనవిజయంక్రీడలుప్రకృతి వికాసం నాడు... వికృత హాసం నేడు...

ప్రకృతి వికాసం నాడు… వికృత హాసం నేడు…

బాల్యాన్ని వారి కంటితో చూద్దాం

బిళ్ళంగోడు తొక్కుడు బిళ్ళ
వామనగుంట్ల అచ్చం గిల్లాయ్
బర్రెల బండి ఈతాకు బూరలు
పేర్లు విన్నారా …

కొన్ని శతాబ్దాలపాటు
బాల్యం ఆటలివే
ఇప్పటి తరానికి
కనీసం తెలియని
అపురూప జ్ఞాపకాలివి ..

చెరువులో వేసవి ఈతలు
తాటి ముంజెలు
ఈత కాయలు
నోరూరించే మామిడి కాయలు ….

అమ్మ కలిపి తినిపించిన
కొత్త పచ్చడి అన్నం
వండిన పిండి వంటలు
ఆహా !! వర్ణించలేము

అమ్మమ్మ నానమ్మ చెప్పిన
పంచతంత్రం చందమామ
గలివర్ సహస యాత్ర కధలు
జీవితాన్ని తీర్చిదిద్దిన
అమూల్య పాఠాలు
ఇప్పుడు ఏవి ?

సాంకేతిక విప్లవ హోరులో
చితుకుతున్న బాల్యం
పైన వన్నీ చరిత్ర కాన్వాస్ పై
చూడాల్సిరావటం దురదృష్టం …

కరోనా విరామాన
పిల్లల్ని ప్రకృతికి
దగ్గర చేద్దాం
స్వేచ్ఛగా ఎదగనిద్దాం …

ఏ కలలైతే నిద్రలో కూడా వెంటాడుతూ గమ్యం చేరుకునే దాకా విడిచి పెట్టవో అలాంటి కలల్ని మాత్రమే కనేవాళ్ళు బాలలు… ప్రకృతిలోని ప్రతి అణువును నిష్కల్మషంగా అనుభూతి చెందగలిగే వాళ్ళు బాలలు.. ఏ వికారాలు అంటని చేతన వారిది…  వారి వాక్కే‌ బ్రహ్మ వాక్కుగా భావించే దేశమిది.

కరోనా విలయ తాండవంతో విద్యాలయాలు మూతపడి అందరూ ఇంటికే పరిమితమైన పరిస్థితిలో రేపటి దేశ భవిష్యత్ ఏమిటనేదే ఇప్పుడు కలచివేస్తున్న ప్రశ్న… సాంకేతిక పరిజ్ఞానం తీసుకువచ్చిన సౌలభ్యంతో పాఠ్యాంశాల బోధనా పద్ధతులు మారినా స్వేచ్ఛాయుత తరగతి గదిని మరిపించలేకపోతున్నదనేది కఠోర వాస్తవం… గురు శిష్య బంధాలు, స్నేహ బంధాల మాధుర్యాన్ని కోల్పోయిన బాల్యం యాంత్రిక జీవితంతో నిస్పృహ, నిర్లిప్తతకు లోనై చదువంటేనే నిరాసక్తత చూపించటం పెను సవాలుగా తల్లిదండ్రులకు పరిణమించింది.. రోజంతా పిల్లలను ఎలా సముదాయించాలో అర్థం కాని తల్లిదండ్రులు వారి చేతికి అందిస్తున్న ఫోన్,లాప్,టాబ్లు చేస్తున్న ప్రళయం కరోనా మహమ్మారి కన్న ఎక్కువ విధ్వంసం కలిగిస్తోంది.. పండిట్ నెహ్రూ కలలు కన్న బాలభారతం తన సహజత్వాన్ని కోల్పోయి అసహజ సాంకేతిక ఛట్రంలో బిగుసుకుపోయి తన సహజ సుగంధాన్ని కోల్పోవటం విచారకరం…

ఒకప్పుడు పిల్లల ఎదుగుదలకు కారణమైన ఆటపాటలు ఈనాడు కనుమరుగై శరీర మానసిక వృద్ధిని లేకుండా చేశాయి.. కోతి కొమ్మచ్చి, ఏడు పెంకులు, కబడ్డీ, ఖోఖో, ఈత, గోళీలు, సబ్జా, కళ్ళగంతలు.. వంటి సాంప్రదాయ ఆటలు కాని, క్రికెట్, బాస్కెట్ బాల్, షటిల్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్ వంటి ఆధునిక క్రీడలు కాని ఆడే అవకాశం లేని బాల్యం నేడు ఊబకాయం, చక్కెర వ్యాధి, రక్తపోటు, కళ్ళ వ్యాధుల బారిన బాల్యం పడుతోంది.. ముక్కు పచ్చలారని పసితనం రోగగ్రస్తమవటాన్ని ప్రతి ఒక్కరం తీవ్రంగా ఆలోచించాలి.. బాల్యమంటే ఎవరికైనా మరుపురాని మధుర స్వప్నం..జీవితాంతం మురిపించే గొప్ప నిధి. కాని, మన అతి ప్రేమ, గారాబం ,అర్థం పర్థం లేని వ్యామోహాలతో సహజంగా సాగాల్సిన బాల్యాన్ని చిందరవందర చేస్తున్నాం.. ఇది నూరు శాతం నిజం… మన పిల్లలు పెద్ద అయి వెనక్కు తిరిగి చూసుకుంటే ఏముంది మూడు సెల్ ఫోన్లు, ఆరు టాబ్ లు తప్ప… దయచేసి ఒక్కసారి ప్రతి ఒక్కరం విశ్లేషించుకుందాం..

ఒత్తిడులు,బాధలు లేని బాల్యాన్ని నిర్మించి వారికి ఇవ్వవలసిన బాధ్యత ఈ సమాజానిదే…మన ఆశలు, ఆకాంక్షలు వాళ్ళ మీద రుద్ది ప్రతిది మన కంటి నుండే‌ చూస్తే మరి వాళ్ళ మేధస్సు ఏమవ్వాలి? బాల్యంలో వాళ్ళ మీద పడే ప్రభావాలే రేపటి వారి జీవితం…అదే రేపటి భారతదేశం.. బాల్యమంటే సహజత్వం…సాధారణత్వం…నిర్మలత్వం అంటారు నోబుల్ బహుమతి గ్రహీత.. కైలాష్ సత్యార్థి… కరోనా అనేది కొద్ది కాలం మాత్రమే ఉండే ఒక వైరస్..కాని మనం బాలలను స్వేచ్ఛా రహిత జీవితమనే భయంకర వైరస్ కు బలి చేస్తున్నాం…

బాల్యం అపురూపం.. తనకు తానుగా ఎదిగే ప్రకృతి..
దానిని అంతే స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో పెరగనిద్దాం..
ప్రతి రోజూ తగిన జాగ్రత్తలతో ఆటలను ఆడనిద్దాం..
సమస్త బాల ప్రపంచం తరుఫున ఇది నా అభ్యర్థన….


– అట్లూరి వెంకటరమణ
(కవి, రచయిత)
9550776152

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి